ఏప్రిల్‌లో సర్కారు చేతికి హైదరాబాద్ మెట్రో - నిర్వహణ చూసేది మాత్రం ఫ్రాన్స్
ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ పూర్తిగా థర్డ్ పార్టీదే - హైదరాబాద్ మెట్రో సర్కారు చేతికొచ్చినా నిర్వహణ బాధ్యత చూసుకోనున్న కియోలిస్ - స్వాధీనానికి ముందే రుణాల రీఫైనాన్సింగ్‌కు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

Published : March 2, 2026 at 8:31 AM IST
Hyderabad Metro Operations : మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నిర్వహణ ఎలా? ఇప్పటి మాదిరిగా సమర్థంగా నిర్వహించగలదా? అనే అనుమానాలు తలెత్తడం సర్వసాధారణం. ఎందుకంటే మెట్రో ఆపరేషన్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజా రవాణా భద్రత కూడా చాలా కీలకం. మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసినా ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ పూర్తిగా థర్డ్ పార్టీనే చూస్తుందని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ మెట్రో రైలు ఆపరేషన్స్‌ను మాత్రం ఫ్రాన్స్ దేశానికి చెందిన కియోలిస్ అనే సంస్థ చూస్తోంది.
ఆ సంస్థతో ఎల్ అండ్ టీ చేసుకున్న ఒప్పందం ఈ సంవత్సరం నవంబర్ నెల వరకు ఉంది. దీంతో ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఈ సంస్థే నిర్వహణ బాధ్యతలు చూడనుంది. అలాగే గడువు ముగిశాక ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించాలని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా పర్యవేక్షణ కోసం రైల్వే అధికారులను జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి నియమించనున్నట్లు ఓ కీలక అధికారి తెలిపారు. ఈ క్రమంలో మెట్రో ఆపరేషన్స్ పరంగా ఎలాంటి తేడా ఉండదని, పైగా అప్పులపై వడ్డీ భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
రూ.12,965 కోట్ల అప్పులు : ఎల్ అండ్ టీ మెట్రోకు 2025 డిసెంబరు నాటికి రూ.12,965 కోట్ల అప్పులున్నాయి. తొలుత బ్యాంకుల కన్సార్షియం నుంచి అప్పులు తీసుకున్నా, అధిక వడ్డీలను తగ్గించుకునేందుకు రీఫైనాన్సింగ్ చేసి డిబెంచర్లు, కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. వీటిపై 6.68 శాతం నుంచి 9.85 శాతం వరకు అసలుపై వడ్డీలను చెల్లిస్తోంది. ప్రభుత్వం కూడా 15 ఏళ్లకు రూ.900 కోట్ల సాఫ్ట్‌లోన్‌ను గతంలోనే ఇచ్చింది.
అప్పుల బదలాయింపుతో పాటు రీ ఫైనాన్సింగ్ : మెట్రో రుణాలను ప్రభుత్వం బదలాయించుకోవడంతో పాటు అవకాశం ఉన్న మేరకు రీ ఫైనాన్సింగ్‌కు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణ మంజూరుకు అంగీకరించినట్లు సర్కారు తెలిపింది. రూ.4,374 కోట్ల కమర్షియల్ పేపర్లను ఎల్ అండ్ టీ లెటర్ ఆఫ్ కంఫర్ట్ మద్దతుతో స్వల్ప కాలానికి తీసుకుంది. ఎల్ అండ్ టీ వైదొలిగితే లెటర్ ఆఫ్ కంఫర్ట్ రద్దు కానుంది. రూ.8,657.5 కోట్ల ఎన్‌సీడీ పేపర్లలోనూ కంట్రోల్ రిడింప్షన్ ఉంది. దీని ప్రకారం ఎల్ అండ్ టీ వాటా 27 శాతం కంటే తగ్గితే డిబెంచర్ హోల్డర్లు తమ డిబెంచర్లన్నీ నగదుగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఐదేళ్లలో మెట్రో చేయాల్సిన మూలధన ఖర్చు
- ఎలక్ట్రికల్ అండ్ మెయింటెన్స్ : రూ.199.77 కోట్లు(36శాతం)
- సివిల్ పనులు: రూ.87.13 కోట్లు(16శాతం)
- ట్రాక్షన్: రూ.65.81 కోట్లు(12శాతం)
- సిగ్నలింగ్‌కు: రూ.41.53 కోట్లు(7శాతం)
- మెట్రోరైళ్లకు(రోలింగ్ స్టాక్): రూ.36.57 కోట్లు(6శాతం)
- ఐటీ: రూ.23.01 కోట్లు(4శాతం)
- టెలికాం/ఏఎఫ్‌సీ: రూ.20.71 కోట్లు(4శాతం)
అప్పుల భారం : తొలి దశ మెట్రో నిర్మాణ పనులను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టారు. ప్రాజెక్టు వ్యయం రూ.15 వేల కోట్లు కాగా, అందులో సుమారు రూ.13 వేల కోట్లను రుణాల రూపంలో సేకరించారు. వీటికి వడ్డీ రేటు 8 శాతం ఉండటంతో ఏటా రూ.వందల కోట్లు వడ్డీలకే సరిపోతున్నాయనే భావన ఉంది. కొవిడ్ సమయంలో ప్రయాణికుల నుంచి ఆదాయం తగ్గినా, అప్పుల భారం మాత్రం తగ్గలేదు. దీంతో రుణాలు చెల్లించడం, నిర్వహణ మెట్రోకు భారంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకోవడంతో ప్రభుత్వమే బాధ్యత తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అప్పులను పునర్ వ్యవస్థీకరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 8 శాతం వడ్డీని 6 నుంచి 6.5 శాతం వరకు తగ్గించే ప్రయత్నం, రీ ఫైనాన్సింగ్ ద్వారా ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను తక్కువ వడ్డీతో తీసుకున్న రుణాల ద్వారా చెల్లించడం, బకాయిల కాల పరిమితిని 20 ఏళ్ల నుంచి 25 నుంచి 30 ఏళ్లకు పెంచడం వంటి చర్యల ద్వారా వార్షిక రుణ చెల్లింపుల భారాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
మెట్రో అప్పులు తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు - రుణాల పునర్ వ్యవస్థీకరణకు కసరత్తు
మెట్రో స్వాధీనానికి కేబినెట్ ఆమోద ముద్ర - మార్చిలోగా ప్రభుత్వం చేతికి

