ధరణి అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం! - నేడో, రేపో మార్గదర్శకాలు జారీ
రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీకి చెందిన సీనియర్ అధికారులకు స్థానం - 2020 నుంచి జరిగిన అనుమానిత భూ లావాదేవీలపై దృష్టి - అక్రమాల వెనుక కీలక వ్యక్తులున్నట్లు అనుమానాలు

Published : July 8, 2026 at 7:35 AM IST
Dharani Portal Land Scam Exposed : ధరణి అవకతవకలపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోర్టల్ వేదికగా చోటుచేసుకున్న భూ అక్రమాలపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, సైబర్‌క్రైమ్, తదితర విభాగాలతో ఏర్పడిన విచారణ బృందం అక్రమార్కుల గుట్టు వెలికితీస్తోంది. ఈ అక్రమాల కోసం పోర్టల్ తెరవడానికి ఉపయోగించిన డిజిటల్ లాగిన్‌లను, అక్రమ లావాదేవీల ఫుట్‌ప్రింట్స్‌ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ధరణి పోర్టల్‌లోని లొసుగులను అనుకూలంగా మార్చుకొని యజమానులకు తెలియకుండా కొందరు పలు జిల్లాల్లో ఎకరాల కొద్దీ యాజమాన్య హక్కుల మార్చినట్లు గుర్తించారు.
మరో రెండ్రోజుల్లో మార్గదర్శకాలు జారీ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలుత ఈ తరహా అక్రమం వెలుగు చూడగా సర్కారులో ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి తదితర జిల్లాల్లో 17 వేల ఎకరాల వరకు హక్కులు మార్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు మరింత లోతుగా చేపట్టేలా కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ తదితర రంగాల్లో అనుభవం ఉన్న సీనియర్ అధికారులను ఇందులో నియమించనున్నట్లు తెలిసింది. 2020 నుంచి జరిగిన అనుమానిత భూ లావాదేవీలపై సిట్ దృష్టి సారించనుంది. ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ కానున్నట్లు తెలుస్తోంది.
జిల్లాకు లింకులు ఉన్నట్లు అనుమానాలు : రూ. కోట్ల విలువైన భూములు ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు గ్రామీణ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో వందల ఎకరాల హక్కులు మారిపోయాయి. విచారణ చేస్తున్న బృందం జిల్లాకు ఇద్దరు ముగ్గురు చొప్పున అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు లింకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందాల్లోని అధికారుల హోదా, సామర్థ్యం సరిపోదని భావిస్తోంది. అవసరమైతే ఐటీ, సైబర్ రంగాల సహకారం విస్తృతంగా తీసుకోవాల్సి ఉండటంతో సిట్ అవసరమని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. భూ భూరతి పోర్టల్ వేదికగా కూడా సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లొసుగులతో కొన్నిచోట్ల హక్కులు కొల్లగొట్టినట్లు అనుమానిస్తున్నారు. వీటన్నింటినీ వెలికితీసి కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు రెవెన్యూ వర్గాలు తెలుపుతున్నాయి.
4,100 లావాదేవీలపై అనుమానాలు : జనవరిలో యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఛార్జీల దారి మళ్లింపు అక్రమం వెలుగు చూసింది. 4,100 లావాదేవీలు అనుమానంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు జిల్లాల్లో గుట్టుగా హక్కుల మార్పిడి జరుగుతున్నట్లు కూడా వెలుగు చూసింది. ఈ అక్రమాల వెనుక పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ధరణి ఆపరేటర్లు, మాజీ ఆపరేటర్లతోపాటు దళారుల పాత్ర ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో గుర్తించినట్లు సమాచారం.
సీసీఎల్ఏ ప్రధాన కార్యాలయానికి చెందిన కొందరు, జిల్లాల్లోని పలువురు కలిసి ఈ మార్పిడికి పాల్పడగా, కొందరిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాలని కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశించినట్లు తెలిసింది. పలు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక సమాచారం లభ్యం అయినట్లు తెలిసింది. ఆ సమాచారం ప్రకారం ఈ అక్రమానికి పాల్పడిన వారి మధ్య లింక్‌లను గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇటీవల విచారణ బృందం వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు మరింత లోతుగా ఆధారాలు సేకరించాలని ఆయన ఆదేశించినట్లు, అలాగే ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి చర్చించినట్లు సమాచారం.
ధరణిలో దొంగలు - 10 వేల ఎకరాలు స్వాహా!
ధరణి డాక్యుమెంట్లపై విచారణ - ఆందోళనలో పలువురు తహసీల్దార్లు, డీటీలు

