ETV Bharat / state

కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం - మౌలిక వసతులకు సహకారం

ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతులు, శిక్షణలో అందనున్న సహకారం - దేశానికి గర్వకారణంగా నిలిచే అథ్లెట్లను తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ సంకల్పమన్న సీఎం రేవంత్ రెడ్డి - ఎంవోయూపై హర్షం వ్యక్తం చేసిన సీఎం

MOU With Korea National Sport University
కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 26, 2026 at 7:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

Telangana MOU With Korea National Sport University : తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు ప్రతిభ చాటడానికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ(కేఎన్‌ఎస్‌యూ)తో యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనీవర్సిటీ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ టీమ్, కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధుల బృందం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా ప్రపంచస్థాయి స్పోర్ట్స్ మౌలిక వసతులు, ప్రతిభ, శిక్షణ వంటి అంశాల్లో తెలంగాణకు కేఎన్‌ఎస్‌ యూనివర్సిటీ సహకారాన్ని విస్తృతంగా అందించనుంది.

ఈ ఒప్పందం ఐదేళ్లుపాటు అమల్లో ఉండనుంది. పరస్పర అంగీకారంతో ఆసక్తి ప్రకారం పునరుద్ధరించుకోవచ్చు. ఒప్పందంలో భాగంగా అకడమిక్‌ కార్యక్రమాలు, విద్యా నాణ్యత, పాఠ్య ప్రణాళికల అభివృద్ధి పెంపు వంటి అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి. అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణుల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించనున్నారు. క్రీడలకు సంబంధించిన రీసెర్చ్, పరిశోధనా పత్రాల ప్రచురణ వంటి వాటిలో కలిసి పని చేయనున్నారు.

2024లో సీఎం పర్యటనతో : సీఎం రేవంత్‌రెడ్డి 2024 ఆగస్టులో సౌత్ కొరియా పర్యటనలో భాగంగా కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శించారు. పారిస్‌ జరిగిన ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాలలో కేఎన్‌ఎస్‌యూలో శిక్షణ పొందిన క్రీడాకారుల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా సీఎం ఆ క్రీడాకారులను నిండు హృదయంతో అభినందించారు. తెలంగాణ యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ వర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా ఉండాలని ఈ సందర్భంగా కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌తోపాటు 12 రకాల క్రీడా అకాడమీల ఏర్పాటు గురించి చర్చలు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం సౌత్ కొరియా అధ్యక్షుడు, కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జరిపిన చర్చలు ఇప్పుడు సఫలం అయ్యాయి. దీనిపై బుధవారం సోషల్​ మీడియా ఎక్స్​లో ముఖ్యమంత్రి పోస్ట్​ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో యువ అథ్లెట్లకు ప్రపంచ స్థాయి క్రీడా సామర్థ్యాలు నేర్చుకునే కొత్త అవకాశాలు సృష్టించేలా ఎంవోయూ చేసుకోవడం శుభసూచకమని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల నుంచి ఒలింపిక్ పోడియం వైపు ప్రయాణానికి తెలంగాణ సిద్ధమవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రీడా భాగస్వామ్యంలో ముఖ్య వారధి : ఈ కీలకమైన ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులకు అభినందనలను సీఎం తెలిపారు. 2024లో దక్షిణ కొరియాలో పర్యటించి కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయంతో జరిపిన చర్చలు ఇప్పుడు ఫలవంతం అయ్యాయని పేర్కొన్నారు. క్రీడా భాగస్వామ్యంలో ఇది ముఖ్య వారధిగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌ వేదిక దిశగా తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయని, 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచే అథ్లెట్లను తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వేదికల్లో మన ప్రతిభ : కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం తెలంగాణ క్రీడా రంగానికి చరిత్రాత్మక ముందడుగని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభివర్ణించారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణను రాష్ట్ర క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మన ప్రతిభకు అంతర్జాతీయ వేదికలు మరింత చేరువ కానున్నాయని వివరించారు.

తెలంగాణ క్రీడాకారులకు శుభవార్త - ఒలింపిక్స్​లో పతకాలు గెలిస్తే డబ్బులే డబ్బులు!