ETV Bharat / state

'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' - మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు కార్యక్రమం

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సర్కార్‌ నిర్ణయం - 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం ప్రకటన - సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

PRAJAPALANA PRAGATHI PRANALIKA
CM REVANTH REDDY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 7:47 AM IST

|

Updated : March 1, 2026 at 9:41 AM IST

3 Min Read
Choose ETV Bharat

Prajapalana Pragathi Pranalika Programme In Telangana : ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేసే సంకల్పంతో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పౌర సేవలను ఇంటివద్ద నుంచే వినియోగించుకునేలా సంస్కరణలు చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. ఓఆర్​ఆర్​ నుంచి ఆర్​ఆర్​ఆర్​ వరకు ఉన్న పెరీ అర్బన్‌ రీజియన్‌లో విస్తరించే మానుఫ్యాక్చరింగ్‌ రంగం దేశానికే ఆదర్శంగా నిలవనుందని సీఎం వెల్లడించారు.

మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. సచివాలయంలో సీఎస్​, డీజీపీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, సీఎంవో అధికారులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమానికి అవసరమైన ప్రణాళికను, ప్రత్యేక లోగోను, 99 రోజుల కార్యక్రమాల షెడ్యూలును రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్‌తో పాటు అన్ని కార్యాలయాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలని నిర్దేశించారు.

ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక : 99 రోజుల కార్యక్రమం అమలులో అధికారుల పనితీరులో లోపాలను సహించబోనని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక అని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం, అమల్లోకి తెచ్చిన ప్రతి పాలసీ విజయం, వైఫల్యం వారిపై ఉన్నట్లు తేల్చిచెప్పారు. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తేవాలని సీఎం సూచించారు. కరెంట్ మీటర్, ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్‌ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలన్నారు. ఏ ఫైలు, ఏ అర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే విధానం ఉండాలన్నారు.

సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేశ్​రంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3 వారాల్లో కమిటీ తన నివేదికను అందించాలని నిర్దేశించారు. ప్రతి విభాగం ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్‌ అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్​లను వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా అప్​డేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, ఆరోగ్య శ్రీ అర్హులైన వారందరికీ చేరాలన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందించాలన్నారు. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని రేవంత్ రెడ్డి నిర్దేశించారు.

మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌గా : దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో పని చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి అవసరమైన మానుఫ్యాక్చరింగ్ జోన్‌గా భవిష్యత్తులో కీలకంగా మారుతుందన్నారు. దాదాపు 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించే మాన్యుఫాక్చరింగ్ రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. 100 మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు.

ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని విభాగాల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలులేదని తేల్చిచెప్పిన సీఎం, ప్రతి శాఖకు సొంత భవనం ఉండేలా బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టుకునేలా ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్లోబల్‌ సమ్మిట్‌తో పాటు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, విదేశీ పర్యటనల్లో కుదిరిన ఒప్పందాలన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్ల 9 నెలలకు సరైన దిశా నిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు : సీఎం రేవంత్ రెడ్డి

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ నిర్మాణంలో రాజీ పడొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

Last Updated : March 1, 2026 at 9:41 AM IST