ETV Bharat / state

తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల భర్తీ - ఛైర్మన్లను ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్

నామినేటెడ్‌ పదవులు భర్తీచేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు - 18 సంస్థలకు బాధ్యులను నియమిస్తూ నిర్ణయం - పార్టీకి నిబద్దతతో పనిచేసినవారికి పట్టం కట్టిన నాయకత్వం - మిగతా చాలా కార్పొరేషన్ల విషయంలోనూ ఏకాభిప్రాయం

TPCC Chief Mahesh Kumar Goud Announces Nominated Posts
TPCC Chief Mahesh Kumar Goud Announces Nominated Posts (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2026 at 10:36 AM IST

2 Min Read
Choose ETV Bharat

TPCC Chief Mahesh Kumar Goud Announces Nominated Posts : పార్టీకి విధేయులుగా పని చేసిన నాయకులకు పదవులతో పట్టం కడతామన్న మాటను మరోసారి నిజం చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​ గాంధీభవన్ వేదికగా 18 కుల ఫెడరేషన్లు, కార్పోరేషన్లకు ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను ప్రకటించారు. సామాజికవర్గాల సమతుల్యతను పాటిస్తూ నియామకాలు చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఎలాంటి వ్యతిరేకత రాకుండా రాష్ట్ర నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది.

కార్పోరేషన్‌ ఛైర్మన్లను ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీకి విధేయులుగా పని చేసిన నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. కార్పోరేషన్ పదవులతో పాటు సలహాదారు, మార్కెట్ కమిటీ, దేవాదాయ శాఖ ధర్మకర్తల కమిటీ పదవులు ఇలా వందల సంఖ్యలో నియామకాలు ఇప్పటికే జరిగాయి. తాజాగా కుల ఫెడరేషన్‌లకు సంబంధించిన కార్పోరేషన్ పదవులను ఖరారు చేశారు. కొద్దిరోజులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ మీనాక్షి నటరాజన్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి పదవుల భర్తీ ప్రక్రియను అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా కొలిక్కి తెచ్చారు. కులాలు, కుల వృత్తులకు చెందిన 18 ఫెడరేషన్లు, కార్పోరేషన్‌లకు ఛైర్మన్లు, 11 మందికి వైస్ చైర్మన్ పదవులను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

"అన్ని వర్గాలవారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయామన్న పాటిస్తూ పదవులు భర్తీ చేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పని చేసేవారికి పదవులు ఇచ్చారు" - పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

బ్రాహ్మణ కార్పోరేషన్ నుంచి యాదవ, వడ్డెర, వాల్మీకి బోయ, పద్మశాలి, వెలమ, కమ్మ కార్పోరేషన్ల వరకు దాదాపు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈ నియామకాల్లో బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ ఛైర్మన్‌గా బసవరాజు శ్రీనివాస్, వాషర్‌మెన్ సహకార సంస్థ ఛైర్మన్‌గా డి.అజయ్ కుమార్, గీతకార్మికుల సహకార సంస్థకు మోతుకూరి చంద్రశేఖర గౌడ్, పెరిక కార్పోరేషన్‌కు వెంకటేశ్వర్లు, మేర కార్పోరేషన్‌కు సంగా వెంకట రాజం, వాల్మీకి బోయ సహకాసంస్థకు గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు కార్పోరేషన్‌కు బొమ్మ శ్రీరాం, యాదవ కార్పోరేషన్‌కు రఘునాథ్ యాదవ్, వడ్డెర సహకార సంస్థకు రేణుక నారాయణ నియమితులయ్యారు. చేనేత అభివృద్ధి సంస్థకు వెంకట రమణ, కమ్మ కార్పోరేషన్‌కు బండి రమేష్, పద్మశాలి సహకార సంస్థకు గూడూరు శ్రీనివాస్, భట్రాజు సహకార సమాఖ్యకు బాలరాజు, వెలమ కార్పోరేషన్‌కు జువ్వాడి నర్సింగ్ రావు, మేకలు,గొర్రెల అభివృద్ధి సమాఖ్యకు సరిత, పశుగణాభివృద్ధి సంస్థ చరణ్ కౌశిక్ యాదవ్, తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకటనారాయణ, గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌కు సూదిని రామిరెడ్డి నియమితులయ్యారు.

అంకితభావంతో పని చేసేవారికి పట్టం : అన్ని వర్గాలవారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయామన్న పాటిస్తూ పదవులు భర్తీ చేశామని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పని చేసేవారికి పట్టం కట్టినట్లు చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవుల్లో ఉంటారు.