ఇదెక్కడి విడ్డూరం 'సర్' : గత ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే - ఇప్పుడు తొలగించినవే ఎక్కువ!
హైదరాబాద్ సర్ ముసాయిదా జాబితాలో షాకింగ్ విషయాలు - 15 నియోజకవర్గాల్లో 19.41 లక్షల ఓట్ల తొలగింపునకు గుర్తింపు - మలక్‌పేట, యాకుత్‌పురాలో గత ఎన్నికల్లో నమోదైన ఓట్ల కంటే అనర్హులుగా పేర్కొన్నవే అధికం

Published : September 1, 2026 at 10:46 AM IST
Hyderabad Draft Voter Deletion List : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా రూపొందించిన ఓటర్ల తొలగింపు జాబితాలోని గణాంకాలను నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రధానంగా మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో తొలగింపునకు గుర్తించిన (అనర్హులుగా భావించిన) వ్యక్తుల సంఖ్య 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవంగా నమోదైన ఓట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. గ్రేటర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో చివరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో 21,72,111 ఓట్లు పోల్ కాగా, ముసాయిదా తొలగింపు జాబితాలో 19,41,444 మంది వ్యక్తుల పేర్లను చేర్చారు.
- మలక్‌పేటలో ఇదీ పరిస్థితి : 2026 జూన్ నాటికి మలక్‌పేటలో మొత్తం 3,30,191 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,354 ఓట్లు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 1,35,807 ఓట్లు నమోదైనప్పటికీ ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా 1,47,799 పేర్లను తొలగింపు జాబితాలో చేర్చింది. అంటే సుమారు 44.76 శాతం మంది ఓటర్ల పేర్లు ఈ కేటగిరీలోకి చేరాయి.
- యాకుత్‌పురాలో గమనిస్తే : 3,74,948 మంది నమోదిత ఓటర్లు ఉన్న యాకుత్‌పురా నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,39,990 ఓట్లు, పార్లమెంట్ శాసన నియోజకవర్గ ఎన్నికల్లో 1,56,341 ఓట్లు పోలైనప్పటికీ 1,54,982 మంది ఓటర్ల పేర్లను తొలగింపు జాబితాలో చేర్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రతి పది మంది ఓటర్లలో నలుగురి కంటే ఎక్కువ మంది పేర్లు తొలగింపు జాబితాలో ఉండటం గమనార్హం.
ఓటింగ్ శాతంపై ప్రభావం చూపొచ్చు : గత ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య కంటే అధికంగా ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో లేనివారు, వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు, మరణించిన లేదా ఆచూకీ లేని ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే, ఇది గత ఎన్నికల్లో నమోదైన ఓటర్ల సంఖ్యతో పోల్చితే ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే హైదరాబాద్ నియోజకవర్గాల్లోనే సర్ ద్వారా ఇలా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగింపులు కనిపిస్తున్నాయి. 2023లో తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాల జాబితాలో మలక్‌పేట్, యాకుత్‌పురా కూడా ఉన్నాయి.
పేర్లు తొలగిపోయినట్లు తేల్చడం సరికాదు : తొలగింపు ముసాయిదా జాబితాను సిద్ధం చేసేందుకు పోలింగ్ బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు) గైర్హాజరైన, నివాసం మార్చుకున్న లేదా మరణించిన ఓటర్లకు సంబంధించిన వాదనలు, అభ్యంతరాలను సేకరించడానికి ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తున్నారు. అదే సమయంలో అధికారిక నోటీసులను కూడా జారీ చేస్తున్నారు. తొలగింపు ముసాయిదా జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరినీ తుది ఓటర్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగిపోయినట్లు ఇప్పుడే తేల్చడం తొందరపాటు అవుతుందని రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. అయితే మలక్‌పేట్, యాకుత్‌పురాలో గత రెండు ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోని పేర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తీవ్రంగా పరిశీలించాల్సిన విషయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు.
'మీ పేర్లు మేం చదవలేం' : చాయ్ తాగి - బిస్కెట్ తిని సాదాసీదాగా వెళ్లిపోయారు 'సర్'!
ఓటర్లకు 'సర్' నోటీసులు - 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు విచారణ

