ETV Bharat / state

'ఐతారం మా లగ్గం - మీరంతస్తే మా మనసు నిమ్మలం' : నెట్టింట 'లగ్గం పిలుపు' వైరల్

తెలంగాణ మాండలికంపై మమకారం - పెద్దపల్లి జిల్లా పెగడపల్లి పెళ్లి కుమారుడి వినూత్న ఆహ్వానం - పెళ్లి పత్రికలో నిత్య వాడుక భాష వినియోగిస్తూ పిలుపు - సోషల్ మీడియాలో వైరలవుతున్న వెడ్డింగ్ కార్డ్

Telangana Slang Marriage Invitation Card
తెలంగాణ యాసలో ఉన్న వివాహ ఆహ్వాన పత్రిక (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 30, 2026 at 1:38 PM IST

2 Min Read
Choose ETV Bharat

Telangana Slang Marriage Invitation Card : సాంకేతికత పెరగక ముందు పెళ్లికి పిలవాలంటే నేరుగా అందించే ఆహ్వాన పత్రికలే కీలకం. ఇవి ఎంత గ్రాండ్​గా ఉంటే, వారు అంత రిచ్​ అని భావించేవాళ్లం అంటే అతిశయోక్తి కాదు. కానీ కాలం మారింది. క్రమంగా టెక్నాలజీ పెరగడంతో వెడ్డింగ్​ కార్డుల తీరులోనూ మార్పు వచ్చింది. ప్రస్తుతం వాట్సప్, ఇన్‌స్టాగ్రాముల్లోనే డిజిటల్ వెడ్డింగ్ కార్డుల హవా నడుస్తోంది. అలాంటిది ఈ రోజుల్లో కూడా ఓ సాధారణ పెళ్లి పత్రిక నెట్టింట వైరల్​గా మారింది. ఇంగ్లీష్ సంప్రదాయాలకు భిన్నంగా, అచ్చమైన తెలంగాణ భాష, యాసలపై మమకారం ఉట్టిపడేలా ముద్రించిన ఓ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

వాడుక భాషలో పెళ్లి పిలుపు : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన అల్లం మల్లమ్మ, గట్టయ్య దంపతుల కుమారుడు వెంకటేశ్​కు​ సౌమ్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ శుభకార్యానికి బంధుమిత్రులను ఆహ్వానించేందుకు వారు ఎంచుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తమ ప్రాంతీయ యాసను గౌరవిస్తూ, తెలంగాణ భాషపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ పూర్తి తెలంగాణ పదజాలంతో ఈ పత్రికను డిజైన్ చేయించారు.

సాధారణంగా పెళ్లి పత్రికల్లో సంస్కృత శ్లోకాలు, లాంఛనప్రాయమైన తెలుగు పదాలు ఉండటం సర్వ సాధారణం. వాటి స్థానంలో నిత్య జీవితంలో ఉపయోగించే అచ్చమైన లోకల్ పదాలను వాడారు. 'అయ్యలారా, అమ్మలారా, సుట్టాలరా, దోస్తులారా' అంటూ ఆత్మీయంగా నేరుగా పలకరిస్తూ పిలుస్తున్నట్లే కార్డును రూపొందించారు. పత్రికలో వివాహ ఆహ్వానం అనడానికి బదులు స్థానిక పదం 'లగ్గం పిలుపు' అని, వివాహ వేదిక లేదా స్థలాన్ని 'జాగా' అని, పెళ్లిరోజైన ఆదివారాన్ని ఐతారం అని పేర్కొనడం కట్టిపడేస్తున్నాయి.

తెలంగాణ మాండలికంలో ఉన్న పెళ్లి పత్రిక (ETV Bharat)

ఇదే నిజమైన ఆహ్వానం : ఈ పత్రికలో రాసిన కొన్ని లైన్లు చదువరుల హృదయాలను తాకుతున్నాయి. 'అచ్చి మా పెండ్లి సంబరం సూసి పోతే మా మనసు నిమ్మలమైతది' అంటూ వారు రాసిన పంక్తులు బంధువులను, గ్రామస్థులనే కాకుండా నెటిజన్లను సైతం కట్టిపడేస్తున్నాయి. ఈ ఆత్మీయ పిలుపునకు నిజమైన ఆహ్వానం అంటే ఇదే అంటూ పలువురు ఈ కార్డును రీషేర్ చేస్తున్నారు. భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి పెద్దగా ఏం చేయనక్కర్లేదు. ఇలా మన ఇంట్లో జరిగే శుభకార్యాల్లో వాడుకుంటే చాలని ఈ పెగడపల్లి కుటుంబం నిరూపించింది. ప్రస్తుతం ఈ 'లగ్గం పత్రిక' రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతోంది.

కల్యాణ శుభగడియలు మళ్లీ వచ్చేశాయ్ - ఆగస్టు, సెప్టెంబర్​లో శుభముహూర్తాలు ఇవే

కాస్ట్​ ఎంతైనా సరే పెళ్లిళ్లు మాత్రం అమెరికాలోనే - స్టూడెంట్​ వీసా సమస్యే కారణం