ETV Bharat / state

పెరుగుతున్న డ్రగ్స్ కేసులే అతి పెద్ద సవాల్ : డీజీపీ సీవీ ఆనంద్

రాష్ట్రంలో మూడేళ్లలో 7.15 శాతం పెరిగిన నేరాలు - డ్రగ్స్ కేసుల్లో టాప్​లో నిలిచిన సైబరాబాద్‌ - ఫీల్డ్ లెవల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని డీజీపీ ఆదేశం

DGP Review
అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించిన డీజీపీ సీవీ ఆనంద్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 28, 2026 at 10:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

DGP Review on State Crime : ఉన్నతాధికారులు నేరాల సమీక్షను కేవలం కాగితాలకే, గణాంకాలకే పరిమితం చేయకూడదని అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నేరం వెనుక ఉన్న కారణాలు, నేరస్థుల పద్ధతులు దర్యాప్తుతో పాటు కేసుల పరిష్కారాన్ని లోతుగా విశ్లేషించినప్పుడే క్రైమ్​రేట్​ను సమర్థవంతంగా కట్టడి చేయగలమని డీజీపీ వెల్లడించారు. పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి పరిశోధన, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీవీ ఆనంద్ ఆదేశించారు.

ప్రతీ నెలా క్రైమ్ రివ్యూ తప్పనిసరి : డిజిటల్ పోలీసింగ్ విధానానికి ప్రాధాన్యమిస్తూ, గతంలో 70 శాతంగా ఉన్న సీసీటీఎన్‌ఎస్‌ డేటా నవీకరణను అధికారుల సమష్టి కృషితో 96 శాతానికి తీసుకెళ్లడం పట్ల ఆయన అభినందించారు. ప్రతీ నెలా క్రైమ్ రివ్యూ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని, అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్ ఐజీలు ఇన్‌స్పెక్షన్ నోట్స్ పరిశీలిస్తూ పోలీస్ స్టేషన్ల తనిఖీలను విస్తృతం చేయాలని ఆదేశించారు.

పోలీసులకు కొత్త సవాళ్లు : రాష్ట్రంలో తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మాదకద్రవ్యాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్ నేరాల సంఖ్య పెరగడం పోలీస్ రంగానికి ప్రధాన సవాలుగా మారిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే తీవ్ర నేరాల్లో 10.33% తగ్గుదల నమోదు కాగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇవి 26.23% మేర తగ్గిన్నట్లు డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాలు 13.29%, ఆర్థిక నేరాలు 13.28% మేర క్షీణించి ఊరటనిచ్చాయిని ఆయన వివరించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే ఈ నేరాలు 1.54% తగ్గాయిని తెలిపారు.

సవాలుగా మారిన సైబరాబాద్ : మూడేళ్ల కాలంలో నార్కోటిక్ కేసులు ఏకంగా 46.10% పెరిగాయి. సైబరాబాద్‌లో 90.98%, వరంగల్‌లో 142.31% మేర కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవస్థీకృత నేరాలు 25 నుండి 451కి చేరాయి. రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య మూడేళ్లలో 7.15% పెరిగి 2,84,363కు చేరగా, ట్రాఫిక్ నేరాలు 9.48% వృద్ధి చెందాయని సమీక్షలో డీజీపీ వెల్లడించారు.

గిరిజన జిల్లాలో పెరిగిన క్రైమ్ : చిన్న, గిరిజన జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్‌లలో నేరాల రేటు పెరగడం పట్ల సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కృత్రిమ మేధ ఆధారిత పోలీసింగ్ అప్లికేషన్లు, టీజీ-కాప్, హాక్-ఐ, ఐసీజేఎస్, ఈగల్ కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇచ్చారు. యువ ఐపీఎస్ అధికారులు తీసుకొచ్చిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను, లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస చర్యలను డీజీపీ సమీక్షించారు.

సమర్థవంతమైన బేసిక్ పోలీసింగ్, సమయానుకూల డేటా విశ్లేషణ, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ద్వారానే రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టం చేయగలమని ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ అధికారులకు అదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, సీఐడీ డైరెక్టర్ శిఖా గోయెల్, ఉమెన్ సేఫ్టీ డైరెక్టర్ చారు సిన్హా, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యాతో పాటు కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.

తెలంగాణలో మావోయిస్టు భావజాలం మళ్లీ జీవం పోసుకోకుండా చూస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

ఆహారకల్తీ ముఠాలపై కూంబింగ్‌ ఆపరేషన్ : డీజీపీ సీవీ ఆనంద్