పాఠ్యపుస్తకాల్లోని మొదటి పేజీలో 'జయజయహే తెలంగాణ' - పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం

Published : November 18, 2025 at 8:11 AM IST
Telangana Cabinet Decisions : గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సిద్ధం చేసిన బిల్లును ఆమోదించిన కేబినెట్ తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని తీర్మానించింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2 మెయిన్ కెనాల్‌కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహణకు కేబినెట్ నిర్ణయించింది.
అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ 29 అంశాలపై సుమారు ఆరు గంటలపాటు చర్చించింది. ఇటీవల కన్నుమూసిన ప్రజా కవి అందెశ్రీ కుమారుడు దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 : ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్‌కు మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు.
"ఇండస్ట్రీల భూములు ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా నిర్ణయించాం. ఆ ప్రాంతంలోని ముందున్న రోడ్డు వెడల్పును అనుసరించి వారు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు చెల్లించాలనే విషయంపై కేబినెట్ ఆమోదించింది. పేదవారికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు ఫోర్త్ సిటీ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ డిశంబరు 8, 9న ఏర్పాటు చేయాలని దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేబినెట్ ఆమోదించింది." - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ మంత్రి
గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత : గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్-2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో మొబిలిటీ, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ ఇతర రంగాల్లో గిగ్ వర్కర్లు, ఇళ్లలో పని వాళ్లు సుమారు 4 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ఫిర్యాదుల పరిష్కారం, గుర్తింపు తదితర అంశాల కోసం బిల్లును సిద్ధం చేసింది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం, మంత్రులు చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయంపై సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రులు అభినందించారు.
"గిగ్ వర్కర్లకోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. దానిలో గిగ్ వర్కర్ల యూనియన్, అగ్రిగేటర్లు, ప్రభుత్వానికి సంబంధించిన వారు ఉంటారు. దీనిలో గిగ్ వర్కర్లు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఈ చట్టంలో ఉంది. అగ్రిగేటర్లు ఈ బోర్డులో సభ్యులుగా ఉండి వీరి సమస్యలను తెలుసుకుని వాటిని సంబంధిత అధికారులకు తెలిపి పరిష్కరించే వెసులు బాటును కల్పిస్తున్నాం. మెడికల్, యాక్సిడెంట్స్, సెస్ ప్రకారంగా ఏవిధమైన సౌకర్యాలు కల్పించగలమో గిగ్ వర్కర్లకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది." - వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ మంత్రి
డిసెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తాం : కేబినెట్ కీలక నిర్ణయం
స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్! - రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం

