ETV Bharat / state

సెప్టెంబర్ 7నుంచి అసెంబ్లీ సమావేశాలు - ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి సమాచారం

సెప్టెంబర్ 7నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు - సభ్యులకు సమాచారం ఇచ్చిన శాసనసభ, శాసన మండలి కార్యదర్శులు - ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి సూచన

Telangana Assembly Sessions
తెలంగాణ అసెంబ్లీ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 7:04 PM IST

|

Updated : August 29, 2026 at 10:59 PM IST

1 Min Read
Choose ETV Bharat

Assembly Monsoon Session from September 7 : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉభయ సభల సభ్యులకు శాసనసభ, మండలి కార్యదర్శుల నుంచి అధికారికంగా సమాచారం అందింది.

వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు : సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతో ఈసారి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ-బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, కొత్త బిల్లుల ఆమోదం లాంటివి ప్రభుత్వ అజెండా గా ఉంటాయి.

వచ్చే నెల 2లోపు ఇవి అందించాలి : వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి సూచించారు. వచ్చే నెల 2లోపు ఇవి అందించాలని తెలిపారు. రూల్-39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముందస్తు ప్రశ్నలను సంబంధిత శాఖలకు పంపించి తెలంగాణ ప్రభుత్వం సమాధానాలు సిద్ధం చేయనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు శాసన సభ్యులకు కార్యదర్శి రేండ్ల తిరుపతి లేఖ రాశారు.

సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు : సీఎం రేవంత్

Last Updated : August 29, 2026 at 10:59 PM IST