అక్టోబర్ చివరి నాటికి అందరికీ అల్పాహారం సిద్ధం! - వేగంగా సాగుతున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల పనులు
అక్టోబరు కల్లా వందశాతం కమ్యూనిటీ కిచెన్లు పూర్తయ్యేలా చర్యలు - 22 లక్షల విద్యార్థులకు చేకూరనున్న లబ్ధి - కిచెన్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న మార్కెట్ యార్డులు - నెలాఖర్లో మంచిర్యాలలో ప్రారంభం

Published : August 27, 2026 at 9:27 AM IST
Centralized Community Kitchens In Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అల్పాహార పథకాన్ని అక్టోబర్ చివరి నాటికి వంద శాతం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అవసరమైన కేంద్రీకృత సామాజిక వంటశాలల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్స్) నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ కిచెన్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన విద్యాశాఖ ఇప్పటికే ఉన్న కిచెన్లను రెండు ట్రస్టుల ఆధ్వర్యంలో జూన్ నుంచి పథకాన్ని ప్రారంభించింది.
రానున్న రెండు నెలల్లో అన్ని చోట్లా కిచెన్ల నిర్మాణం పూర్తవుతుందని, దీని ద్వారా లక్షిత 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం సాధ్యమవుతుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగినా నవంబర్ 15 నాటికి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం 2 లక్షల విద్యార్థులకు లబ్ధి : మొదటి దశలో భాగంగా జూన్‌లో ఎనిమిది జిల్లాల్లో ఏడు కమ్యూనిటీ కిచెన్ల ద్వారా 1,269 పాఠశాలలు, 33 కళాశాలల్లోని 1,44,610 మంది విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఆ తర్వాత గత రెండు నెలల్లో మధిర, మంథనిలో వంటశాలలను ప్రారంభించడం వల్ల లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరింది. ప్రస్తుతం నార్సింగి, ఉప్పల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కొడంగల్, హన్మకొండ, వరంగల్, మధిర, మంథని ప్రాంతాల్లో కేంద్రీకృత వంటశాలలున్నాయి. ఈ నెల చివర్లో మంచిర్యాలలో మరో కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్నారు.

30 శాతం వ్యయం ట్రస్టులు భరిస్తాయి : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39 ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు అవసరం ఉంది. కొత్త వంటశాలల నిర్మాణం, ఇప్పటికే ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచడానికి రూ.299.90 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఒక్కో యూనిట్ నిర్మాణ వ్యయంలో 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా మిగిలిన 30 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్ భరిస్తాయి.
కిచెన్లకు మార్కెట్ యార్డులు ఎంతో అనుకూలం : మార్కెట్ యార్డుల ప్రాంగణంలోనే ఈ వంటశాలలను నిర్మిస్తున్నామని, అక్కడ ఇప్పటికే ప్లాట్‌ఫారమ్‌లు, షెడ్లు అందుబాటులో ఉండటంతో వాటిని వంటశాలలుగా మార్చడం సులభం అవుతుందని పనులను పర్యవేక్షిస్తున్న తెలంగాణ విద్యా సంక్షేమ, మౌలికాభివృద్ధి సంస్థ(టీజీఈడబ్ల్యూఐడీసీ) అధికారి వెల్లడించారు. సదుపాయాలు ఉండటం వల్ల ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ప్రయోజనాలివే
- ఈ కిచెన్లలో ఒకేసారి వేలాది మందికి సరిపడా భారీ పరిమాణంలో ఆహారాన్ని సిద్ధం చేయొచ్చు
- మానవ శ్రమను తగ్గించడానికి కూరగాయలు కడగడం, తరగడం, అన్నం వండడం, చపాతీలు చేయడం వంటి పనుల కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన పెద్ద పెద్ద యంత్రాలను వాడతారు. దీనివల్ల వంట చాలా వేగంగా పూర్తవుతుంది
- మనుషుల చేతులతో తక్కువగా తాకడం వల్ల పరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది
- ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తారు
- పరిమాణానికి తగిన మోతాదు, కొలతలతో వండటం వల్ల ఎప్పటికీ రుచి, నాణ్యతలో తేడా ఉండదు
- సరుకులను బల్క్‌గా కొనడం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గుతుంది
- ఈ కిచెన్ల ద్వారా గ్యాస్, నీటి వినియోగం ఆదా అవుతుంది
- నిపుణులైన డైటీషియన్ల పర్యవేక్షణలో మెనూ రూపొందిస్తారు
- విటమిన్లు, ప్రొటీన్లు సరైన మోతాదులో అందేలా సమతుల్య ఆహారం అందుతుంది
విద్యార్థులకు తినిపించి, తాను తిని - తొలిరోజు 'సీఎం బ్రేక్ ఫాస్ట్'లో ప్రత్యేకతలు
జూన్ 12 నుంచి ఇంటర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీం - వారం రోజులకు రుచికరమైన మెనూ

