ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న టీనేజ్‌ ప్రెగ్నెన్సీలు - 25 జిల్లాల్లో సమస్య తీవ్రం

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో సమస్య - అత్యధికంగా పల్నాడులో 14.94 శాతం, కర్నూలులో 13.50 శాతం, - కీలక శాఖల్లో ఉదాసీనతతో క్షేత్రస్థాయిలో అదుపు తప్పుతున్న పరిస్థితి

Teenage Pregnancy cases rising in ap
Teenage Pregnancy cases rising in ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 1:37 PM IST

3 Min Read
Choose ETV Bharat

Teenage Pregnancy: రాష్ట్ర వ్యాప్తంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ కలవరపెడుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో క్షణికావేళం, అత్యాచారాలు, బాల్య వివాహాలు ఇలా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు గర్బం (టీన్ ప్రెగ్నెన్సీ) దాల్చడానికి కారణాలు ఎన్నో. అయితే ఇంత చిన్న వయసులో గర్భదారణ అంటే ఇటు తల్లికి, అటు బిడ్డకి ఇద్దరికీ ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. బాల్య వివాహాల్ని నిర్మూలించడంతో పాటు లైంగిక ఆరోగ్యం, టీన్ ప్రెగ్నెన్సీ వంటి విషయాలు గురించి చిన్నతనం నుంచే అమ్మాయిల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని అంటున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి? టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చడానికి గల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

టీనేజ్ గ్రూప్ అంటే 13 సంవత్సరాల నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారే. వీరిలో ఎన్నో ఆశలు, మరెన్నో లక్ష్యాలు ఉంటాయి. ఈ వయసులో గర్భం దాల్చడం వల్ల వారి ఆశలన్నీ నీరుగారుతున్నాయి. అక్కడితో వారి జీవితం బాధ్యతల్లో బందీ అవుతోంది. ఈ ప్రభావం కుటుంబం ఎదుగుదలతో పాటు రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థలు, ప్రగతి పైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది.

టీన్ ప్రెగ్నెన్సీ అంటే?

13-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని టీనేజ్ అంటారు. ఈ సమయంలో గర్భం దాల్చిన అమ్మాయిల్ని టీన్ ప్రెగ్నెంట్​గా పరిగణిస్తారు. రాష్ట్రంలో కౌమార బాలికల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్య 25 జిల్లాల్లో తీవ్రంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత అదుపు తప్పింది. బాల్య వివాహాలు, అత్యాచారాలు, తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం ఇలాంటివన్నీ చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణాలు అవుతున్నాయి.

దీంతో తల్లీబిడ్డల్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాతాశిశు మరణాల ప్రమాదము కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఆరోగ్య, సామాజిక, ఆర్థిక రంగాల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా మంత్రులు, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు వైద్యారోగ్యశాఖతో పాటు ఇతర కీలక శాఖలను ఈ అంశం పై అప్రమత్తం చేశారు.

సున్నా స్థాయికి తేవాల్సింది పోయి: గత ప్రభుత్వ హయాంలో ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంది. దాంతో రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ రాష్ట్ర సగటు 8.80 శాతానికి పెరిగింది. రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ కార్యక్రమం (RKSK) ఇతరత్రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కావడం లేదు.

కిశోర బాలికలకు ఆరోగ్యం, లైంగిక-పునరుత్పత్తి, పోషకాహారం, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. మత్తు పదార్థాల కట్టడి సాధ్యం కాకపోవడం, కీలక శాఖల ఉదాసీనతతో పాటు సమస్య మరింత జఠిలమైంది.

5 శాతానికి బెంచ్ మార్కా?

  • వాస్తవానికి టీనేజ్ ప్రెగ్నెన్సీ లక్ష్యం సున్నా స్థాయిలో ఉండాలి. కానీ చేసేది లేక 2025-26లో 5 శాతానికి తగ్గించాలని బెంచ్ మార్కుగా అధికారులు నిర్దేశించారు. క్రమంగా సున్నా స్థాయికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • విశాఖజిల్లాలో బెంచ్ మార్కు కంటే తక్కువగా నమోదైంది. ఈ జిల్లాల్లో మాత్రమే 3.98% టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదైయ్యాయి. మిగతా జిల్లాల్లో 5 శాతం నుంచి 13 శాతానికి మించే సమస్య ఉంది.
  • టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు అత్యధికంగా పల్నాడులో 14.94 శాతం, కర్నూలు జిల్లాలో 13.50 శాతం కేసులు నమోదు అయ్యాయి.

టీనేజ్ ప్రెగ్నెన్సీ సమస్యలు:

  • బాల్య వివాహాలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోవడం
  • గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత
  • తల్లీబిడ్డల్లో పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు, తక్కువ బరువు సమస్యలు
  • బిడ్డ ఎదగకుండా ప్రసవించడం వల్ల శిశువు ఎదుగుదల లోపాలు
  • ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువైతే తట్టుకోలేకపోవడం, మరణాలు

ప్రాణాలకు ముప్పు ఎక్కువ: బాల్య వివాహాలు, యుక్త వయసు రాకుండా గర్భధారణ ( ప్రెగ్నెన్సీ) శ్రేయస్కరం కాదని విజయవాడ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ శిరీష శాఖమూరి తెలిపారు. గర్భాశయం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాని చిన్న వయసులో గర్భం దాలిస్తే శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని అన్నారు. గర్భధారణ సమయంలో ఎనీమియా, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు వస్తాయి. కాన్పు కష్టమై, అధిక శాతం సిజేరియన్​లకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావం వల్ల తల్లికీ, బిడ్డకు ఇబ్బందులు ఎదురవుతాయి అని తెలిపారు. కొన్ని సందర్భల్లో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వెల్లడించారు.

గర్భిణీలలో రక్తహీనత సమస్యకు చెక్ - ఇకపై ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు

పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు- మూడేళ్లలో గర్భవతులైన 2,320 మంది మైనర్లు