ETV Bharat / state

చెంపలపై కొడుతూ, చెవులు మెలిపెడుతూ - నర్సరీ విద్యార్థిపై 8 నిమిషాల పాటు టీచర్ దాడి

ఆదిలాబాద్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన - నర్సరీ చదువుతున్న విద్యార్థిని 8 నిమిషాల పాటు కొట్టిన టీచర్ - సీసీ కెమెరా దృశ్యాలతో వెలుగు చూసిన ఉదంతం

Etv Bharat
ప్రతీకాత్మక చిత్రం (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 12:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

Teacher Beat Young Child At Adilabad : అప్పుడప్పుడే పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు అక్కడి వాతావరణం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కొందరు తల్లిని వదిలేసి ఉండలేక ఏడుస్తుంటారు. ఇంటికి వెళ్తానని మారాం చేస్తుంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని టీచర్లు​ వీరి పట్ల ఓపిక, ప్రేమతో ఉండి వారిని సముదాయించాల్సి ఉంటుంది. వారికి అర్థం అయ్యేలా చెబితే కొన్ని రోజులకు పిల్లలు పాఠశాల వాతావరణానికి అలవాటు పడతారు. టీచర్లు చెప్పింది నేర్చుకుంటుంటారు. అయితే నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల బాలుడితో ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్​ దారుణంగా ప్రవర్తించింది. ఆదిలాబాద్​ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే,

8 నిమిషాల పాటు కొడుతూనే ఉంది : ఆదిలాబాద్​ జిల్లా బోథ్​ మండలం కుచులాపూర్​లోని వేదం పాఠశాలలో ఓ టీచర్​ బాలుడి పట్ల దారుణంగా ప్రవర్తించింది. పిల్లాడిని 8 నిమిషాల పాటు కనికరం లేకుండా చితకబాదింది. స్కేల్​తో బాదుతూ, చెవులు మెలిపెడుతూ, చెంపలపై కొడుతూ ఆ బాలుడికి నరకం చూపించింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల ద్వారా ఈ దృశ్యాలు బయటపడ్డాయి.

అనుమానంతో సీసీ కెమెరా చెక్​ చేసిన తల్లిదండ్రులు : కుచులాపూర్​ గ్రామానికి చెందిన విద్యార్థి ముస్కు రుద్వేద్ ​రెడ్డి (4) వేదం పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. గురువారం విద్యార్థులకు అక్షరాలు దిద్దిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయురాలు ఆ బాలుడిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. పాఠశాల అనంతరం బాలుడు ఇంటికి వెళ్లగా బాలుడి మొహం చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. చెవులు, చెంపలు, వీపు, తొడ భాగం ఎరుపెక్కి ఉండటంతో కుటుంబసభ్యులు వెంటనే పాఠశాలకు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ దృశ్యాల్లో ఉపాధ్యాయురాలి దాష్టీకం బయటపడింది.

సోషల్​ మీడియాలో వైరల్​ : విద్యార్థిని 8 నిమిషాల పాటు చితకబాదిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్​గా మారాయి. ఈ విషయం గురించి ఎంఈవో మహమ్మద్​ హుస్సేన్​ను వివరణ కోరగా, ఘటనపై విచారణ జరిపి డీఈవోకు పూర్తి వివరాలు అందిస్తామన్నారు. ఇదే విషయమై ఎస్సై పురుషోత్తంను సంప్రదించగా, ఉపాధ్యాయురాలు సింధూజ, పాఠశాలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో టీచర్ దెబ్బలు తాళలేక ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హోంవర్క్​ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు పిల్లాడిని చెంపపై కొట్టగా, ఒక్కసారిగా కుప్పకూలి బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​ కాగా, టీచర్​ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగు చూడటంతో ప్రైవేట్​ పాఠశాలల్లో ఉపాధ్యాయుల తీరుపై పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

'బూతులు తిడతాం, ఇష్టమొచ్చినట్లు కొడతాం - అంతా మా ఇష్టం'

6ఏళ్ల బాలికను అగరుబత్తితో కాల్చిన టీచర్​- కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్!