ETV Bharat / state

బీసీ, ఎస్సీలకు 57 శాతం పార్టీ పదవులు - యువత, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం

తెలుగుదేశం పార్టీ లోక్‌సభ నియోజకవర్గ కమిటీల ప్రకటన - మహిళలకు 28 శాతం పోస్ట్‌లు - ఇది వరకు కమిటీల్లో 32 మంది సభ్యులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 40కి పెంచింది

TDP Lok Sabha Constituency Committees Announced
TDP Lok Sabha Constituency Committees Announced (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 25, 2025 at 9:11 AM IST

3 Min Read
Choose ETV Bharat

TDP Lok Sabha Constituency Committees Announced : లోక్‌సభ నియోజకవర్గ కమిటీలను తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రకటించింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి 42 మందితో కమిటీలను ఆ పార్టీ నియమించింది. వెనుకబడిన వర్గాలు, ఎస్సీలకు అగ్ర ప్రాధాన్యమిచ్చింది. మొత్తం పదవుల్లో బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 20 శాతం కేటాయించింది. ఆ రెండు వర్గాలకూ కలిపి మొత్తం 57 శాతం పదవులిచ్చింది. కార్యవర్గాల్లో మహిళలకు 28 శాతం పదవులు కేటాయించింది. లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లు ఇటీవలే ప్రకటించిన పార్టీ ఇప్పుడు మిగతా కార్యవర్గాల జాబితాలను విడుదల చేసింది.

ఆ సంఖ్య 32 మంది సభ్యులు నుంచి 40కి : అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకుండా, ఇది వరకు కమిటీల్లో 32 మంది సభ్యులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 40కి పెంచింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ కమిటీలోనూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను తొమ్మిది మంది చొప్పున నియమించింది. వీరితోపాటు ఒక కోశాధికారి, ఒక పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఒక మీడియా సమన్వయకర్త, సోషల్‌ మీడియా సమన్వయకర్త ఉంటారు.

బీసీలకు 389 పదవులు- సీనియర్‌ నాయకులతో త్రిసభ్య కమిటీ : లోక్‌సభ నియోజకవర్గ కమిటీల నియామకంలో సామాజిక సమతూకం పాటించింది. మొదటి నుంచి పార్టీకి అండదండగా ఉన్న బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను వేసిన పార్టీ కమిటీల్లో మొత్తం 1,050 పదవులు ఉండగా వాటిలో అత్యధికంగా 389 పదవులు వారికి కేటాయించింది. ఓసీలకు 335, ఎస్సీలకు 207, ఎస్టీలకు 41, మైనారిటీలకు 78 పదవులను కేటాయించింది. ఈ కమిటీల కూర్పుపై పార్టీ అధినేత చంద్రబాబు విస్తృత కసరత్తు చేశారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక మంత్రి, మరో ఇద్దరు సీనియర్‌ నాయకులతో త్రిసభ్య కమిటీలను నియమించారు. ఆ కమిటీలు ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాయి.

యువత, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం : ఇతర మార్గాల్లో, ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా తెప్పించుకున్న సమాచారాన్ని కూడా బేరీజు వేసుకుని పార్టీ కమిటీలను నియమించారు. ప్రాథమికంగా రూపొందించిన జాబితాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో, వారి సంఖ్య పెంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ మేరకు జాబితాల్లో మార్పులు చేయించారు. పార్టీలో యువత, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన అభిమతానికి అనుగుణంగా కమిటీల కూర్పు జరిగింది. పార్టీకి దీర్ఘకాలంగా విధేయులుగా ఉంటూ, అంకితభావంతో పనిచేస్తున్నవారికి ప్రాధాన్యమిచ్చారు.

ఇటీవల ఆ జాబితా పరిశీలిస్తే, శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా మోదవలస రమేశ్, ప్రధాన కార్యదర్శిగా పీరికట్ల విఠల్ రావు నియమితులయ్యారు. విజయనగరానికి కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్​లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. అరకు(ఎస్టీ) పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా మోజోరు తేజోవతి, ప్రధాన కార్యదర్శిగా దత్తి లక్ష్మణరావు ఎంపికయ్యారు. విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడుగా చోడే వెంకట పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణకు బాధ్యతలు ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశి నాయుడు ఎంపికయ్యారు. అమలాపురం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా గుత్తల సాయి, ప్రధాన కార్యదర్శిగా పాలం రాజు నియమితులయ్యారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా జ్యోతుల నవీన్, ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాస్ బాబా ఎంపికయ్యారు.

టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఖరారు - జాబితా ఇదే

అది అనవసర వివాదం - పార్టీ అధికార ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం