తమ్ముడికి రాఖీ కట్టేందుకు - తాతయ్య ఇంటికి వెళ్తూ - జీవితాల్ని చిదిమేసిన ప్రమాదం
కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - 6 ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు మృతి - శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 7:01 PM IST
Six Passengers of Vijayawada Died in Kodad Road Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషాదం నింపింది. తమ్ముడికి రాఖీ కట్టాలని ఆశగా బయలుదేరిన అక్క శవంగా ఇంటికి చేరింది. తాతయ్య వాళ్లింటికి వెళ్లి సరదగా గడపాలనుకున్న మరో యువతి తిరిగిరాని లోకానికి వెళ్లింది. ఏడాదిన్నర బాబును చూడాలని ఇంటి బాట పట్టిన ఆ తల్లి కానరాని లోకానికెళ్లింది. ఇంటర్వ్యూకి వెళ్లొస్తూ ఒకరు, పండుగ వేళ సొంతూర్లకు వస్తూ మరో ఇద్దరు ఇలా ఆరుగురు బస్సు ప్రమాదంలో విగతజీవులయ్యారు. వారి కుటుంబాలకు తీరని లోటును మిగిల్చారు. రెండ్రోజుల్లో కోలాహలంగా రాఖీ పండుగ జరుపుకోవాల్సిన ఇళ్లు కన్నీటి సంద్రంలో మునిగాయి.
హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
శవంగా ఇంటికి: ప్రమాదం ఏవైపు నుంచి పొంచి ఉంటుందో తెలియదు. అప్పటి వరకూ చాలా సంతోషంగా గడిపి. తమ వారితో రాఖీ పండుగ జరుపుకోవాలని కలలు కన్న వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన లక్ష్మీతేజ అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. తమ్ముడికి శుక్రవారం రాఖీ కట్టేందుకు విజయవాడ బయలుదేరారు. ఇంతలోనే అనుకోని రోడ్డుప్రమాదం ఆమె ఆశల్ని చిదిమేసింది. మధురానగర్‌కు చెందిన కొండూరు భావనవర్ష కోదాడ నుంచి మధురానగర్‌లోని తాతగారింటికి బయలుదేరింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆమె మృతదేహాన్ని తాతయ్య ఇంటికి తరలించారు.
కానూరుకి చెందిన మేరీ జ్యోత్స్న (29) హైదరాబాద్ కాగ్నిజెంట్‌లో పని చేస్తున్నారు. ఈమెకు ఏడాదిన్నర బాబు ఉన్నాడు. జ్యోత్స్న అకాల మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సురవరపు షకీనా భర్త సాయికృష్ణతో కలిసి ఏడాది నుంచి పటమట వివేకానంద కాలనీలో అద్దెకు ఉంటున్నారు. హైదరాబాద్ ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్లి వస్తూ బస్సు ప్రమాదంలో మృతి చెందారు.
ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన యాసవరపు చిన్ని, పమిడిముక్కల మండలంలోని పడమటలంకపల్లికి చెందిన నాగేంద్రబాబు ఈ ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వస్తూ వీరంతా మృత్యువాత పడ్డారు. శుక్రవారం తమ్ముడికి రాఖీ కట్టేందుకు వస్తుందని ఎదురుచూసిన తాతయ్యకు మనవరాలి లక్ష్మీతేజ మృతి శరాఘాతంగా మారింది.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు ఏపీ వాసులు మృతి
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ స్కూల్ బస్సు - విద్యార్థికి గాయాలు

