నిందితుడితో పోలీసులు కుమ్మక్కు - డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును నీరుగార్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం - అనంతబాబు, ఆయన భార్యపై ఉన్న ఆధారాలను దాచి ఉంచిన ఖాకీలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 7:12 AM IST
MLC Anathababu Driver Murder Case: దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసు విచారణను వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు. ప్రధాన నిందితుడైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజాపై ఉన్న ఆధారాలు బయటపడకుండా దాచారు. హత్యలో ఇతరుల ప్రమేయం, కేసు నిరూపణకు సాంకేతిక సాక్ష్యాలనూ సేకరించలేదు. తాజాగా సిట్ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. అప్పటి సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించి, రెండో నిందితురాలిగా అనంతబాబు భార్యను చేర్చి కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలతో అనంతబాబు సహా ఆయన భార్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసు విచారణను పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు గడువు విధించడంతో కేసును మరికొన్నాళ్లు సాగదీసి శిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావించిన అనంతబాబు ఆటలకు చెక్ పడింది.
ఎమ్మెల్సీ అంగీకరించినా : 2022 మే 19 రాత్రి 10 గంటల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యాన్ని కారులో తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపారు. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. ఈ ఉదంతాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని యత్నించారు. ఇదే విషయాన్ని మృతుని తల్లిదండ్రులకూ చెప్పారు. సుబ్రహ్మణ్యం ఒంటిపై గాయాలు చూసి ఇది హత్యేనని వారు నిలదీయడం, ఎస్సీ సంఘాల ఆందోళనలతో అప్పట్లో సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శరీరంపై 31 గాయాలు, అంతర్గతంగా మరో మూడు తీవ్ర గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో ఉన్నా, తానే హత్య చేశానని అనంతబాబు అంగీకరించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీకి మరికొందరు సాయం చేశారనీ, వారినీ అరెస్ట్ చేయాలని మృతుని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారు - సుప్రీంకోర్టు ఆగ్రహం
మూడురోజుల తర్వాత కేసు నమోదు: సుబ్రహ్మణ్యం హత్య జరిగిన 3 రోజులకు గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అప్పటికే అనంతబాబు నివాసముండే శంకర్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో కొన్ని సీసీటీవీ ఫుటేజీలను మాయం చేశారు. గతంలో వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల నుంచి 60 ఫుటేజీలను సేకరించారు. వీటిలో కేవలం 18 మాత్రమే విజయవాడలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీడియోలు క్వాలిటీ లేకపోవడం, చీకటిగా ఉండటంతో పూర్తిస్థాయిలో విశ్లేషించలేమని, కొంత సమాచారమే ఇవ్వగలమని వారు తెలిపారు. ఆధునిక పరికరాలున్న సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా పోలీసులు ఆలస్యం చేశారు. కేసు విచారణ, నిరూపణకు కావాల్సిన సెల్‌టవర్ డంప్‌లు, CDRలు తీసుకోలేదు. లోపభూయిష్టంగా ఛార్జిషీట్ వేశారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన సిట్ కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను సేకరించింది. హత్యకు ముందు, తర్వాతి రోజుల దృశ్యాలన్నీ వందల గంటలు ఉండగా, నిశితంగా పరిశీలించింది. హైదరాబాద్, చెన్నై సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అనంతబాబు, ఆయన భార్య కలిసి హత్య జరిగిన ప్రదేశం, అనంతరం అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు సిట్ శాస్త్రీయ నివేదిక ఇచ్చింది. సుబ్రహ్మణ్యం శరీరంపై చీలికలు, దెబ్బలున్నాయని., 2-3 బలమైన వస్తువులతో దాడి చేశారని ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు. భుజం దగ్గర చేతి గోళ్ల రక్కులున్నాయని, హత్యలో ఇద్దరు ముగ్గురు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. తీవ్రగాయాలు, షాక్, భయం, ఒత్తిడి కలిసి మరణానికి దారితీసి ఉండొచ్చని ఫోరెన్సిక్ అధికారులు వివరించారు.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: సుబ్రహ్మణ్యం హత్య కేసులో అప్పటి పోలీసులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఈ కేసు విషయంలో నిందితుడు అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయారంటూ తాజాగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, DSP భీమారావు, సీఐ మురళీకృష్ణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ''ఎమ్మెల్సీ అనంతబాబు క్షణికావేశంలో సుబ్రహ్మణ్యాన్ని నెట్టడం వల్ల, అపార్ట్‌మెంట్ డ్రైనేజీలో పడటంతో తలకు ఇనుపగ్రిల్ తగిలి చనిపోయాడంటూ'' అప్పటి ఎస్పీ మీడియా సమావేశంలో నమ్మబలికే ప్రయత్నం చేశారు. మృతుని శరీరంపై గాయాలు ఎక్కువగా ఉండటంతో కుటుంబసభ్యులు, ఎస్సీ సంఘాల ఆందోళనలతో హత్యకేసుగా మార్చారు. అప్పుడు కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినవారంతా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.
సుబ్రహ్మణ్యం హత్యలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర - ఛార్జిషీట్‌లో పేర్కొన్న సిట్
డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసులో కొత్త ఆధారాలు - సీసీటీవీలో ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులు!
అడ్డంగా బుక్కైన ఎమ్మెల్సీ అనంతబాబు! - ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు? - YSRCP MLC Anantha Babu Issue

