'సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి'- సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు
నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్ కొట్టివేత - 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం - తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 1:12 PM IST
Supreme Court Verdict on Actress Pratyusha Death Case: ఒకప్పటి సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు నిందితుడు సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు : ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లాక, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష ప్రాణాలు విడించారు. చికిత్స తర్వాత మార్చి 9న సిద్ధార్థ రెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు టెస్ట్‌లో పోలీసులు గుర్తించారు.
ఆత్మహత్యకు ప్రేరేపించేలా : 2002లో సినీనటి ప్రత్యూష మృతి సంచలనం సృష్టించింది. 2004లో ప్రత్యూష మృతిని పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించేలా సిద్ధార్థరెడ్డి వ్యవహరించారని ట్రయల్ కోర్టు తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వగా నిందితుడు సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌పై పలు దఫాల్లో విచారణ చేపట్టి హైకోర్టు 2011లో ఐదేళ్ల జైలు శిక్షను రెండేళ్లకు కుదించి, రూ.50 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ తీర్పును సైతం సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ప్రత్యూష కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై అసంతృప్తి తెలిపింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదన్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
4 సంవత్సరాల్లో 12 సినిమాలు: తెరమీద ఎంత కలర్ఫుల్గా కనిపించినా కొందరు నటీనటుల నిజజీవితాల్లోనూ చీకటి రహస్యాలు ఎన్నో ఉంటాయి! స్క్రీన్ మీద నవరసాలు పండిస్తూ ప్రేక్షకులను మెప్పించే వారి జీవితాల్లో ఎవరికీ కనిపించని విషాదగాథలు ఉంటాయి. అలాంటి కథే సినీనటి ప్రత్యూషది కూడా. తన నటనతో, హావభావాలతో, అందమైన చిరునవ్వుతో ఒకప్పుడు ఎంతో మంది అభిమానుల మనసును దోచుకుంది. మంచి సినిమా అవకాశాలతో సినీ వినీలాకాశంలో వెలుగుతున్నప్పుడే ప్రేమలో పడి ప్రాణాలు కోల్పోయింది. 1998లో ‘రాయుడు’ సినిమా ద్వారా సినీ రంగంలో అరంగ్రేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 12 సినిమాలు నటించి మంచి గుర్తింపు సాధించింది.
ప్రత్యూష చేసిన తెలుగు సినిమాలు
- శ్రీరాములయ్య
- సముద్రం
- స్నేహమంటే ఇదేరా
- కలుసుకోవాలి
ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
మద్యం స్కామ్‌కు రాజ్ కెసిరెడ్డినే ఆర్కిటెక్ట్ - మరికొంతకాలం జైల్లో ఉండనీయండి: సుప్రీంకోర్టు

