ETV Bharat / state

ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారు - సుప్రీంకోర్టు ఆగ్రహం

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ - నవంబర్‌ 18 లోపు కేసులో విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం - ఆనాడు పోలీసులు కుమ్మక్కయ్యారని ధర్మాసనం ఆగ్రహం

SC_ON_Ananthababu_Driver_Case
SC_ON_Ananthababu_Driver_Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 6:13 PM IST

2 Min Read
Choose ETV Bharat

SC to Hears MLC Ananthababu Driver Murder Case: దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జిషీట్ ఆలస్యం చేశారని మండిపడింది. బాధ్యులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. నవంబర్ 30వ తేదీ లోపు కేసు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి, డోర్‌ డెలివరీ చేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు మిలాఖత్‌ అయ్యారని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. డీజీపీ, జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. కేసు ట్రయల్ కోసం సీనియర్ న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగేలా చూడాలని హైకోర్టును ఆదేశించింది.

అందుకోసం మార్చి 31వ తేదీ వరకు గడువు విధించింది. విచారణలో జోక్యం చేసుకొని అడ్డంకులు సృష్టించవద్దని హైకోర్టుకు సుప్రీం నిర్దేశించింది. నవంబర్ 30 లోపు కేసు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి దర్యాప్తు చేతగాకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని సీజేఐ తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో పాలకులతో కుమ్మక్కైన పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు చెంపపెట్టని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. విచారణ పూర్తికి గడువు నిర్దేశించడంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసే అవకాశం ఉందన్నారు.

అజ్ఞాతంలోకి జారుకున్న అనంతబాబు: డ్రైవర్‌ హత్యకేసు విచారణకు గడువు నిర్దేసిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సహా తన భార్యపై సిట్ ఛార్జిషీట్ వేయడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి జారుకున్నారు. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి శాసనమండలి సమావేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మీ దుర్గ అలియాస్‌ రోజా కూడా పాల్గొన్నారని సిట్‌ తేల్చింది. ఈ హత్యకు ప్రేరేపించటమే కాకుండా ఈ నేరంలో అనంతబాబుకు అన్ని విధాలా ఆమె సహకరించారని నిర్ధారించింది.

సుబ్రహ్మణ్యం హత్యలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర - ఛార్జిషీట్‌లో పేర్కొన్న సిట్​

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు - ప్రత్యేక న్యాయవాదిని నియమించిన ప్రభుత్వం