ETV Bharat / state

అవినీతి అధికారులపై నమోదైన ఏసీబీ ఎఫ్ఐఆర్​ల రద్దు చెల్లదు: సుప్రీంకోర్టు

హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు - ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ల రద్దు చెల్లదు - హైకోర్టు విధానం న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని వ్యాఖ్య - ఇకపై ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించొద్దని నిర్దేశం

Supreme Court Set Aside Judgment of the AP High Court
Supreme Court Set Aside Judgment of the AP High Court (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 9:58 AM IST

3 Min Read
Choose ETV Bharat

Supreme Court Set Aside a Judgment of the AP High Court: రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులపై విజయవాడ అవినీతి నిరోధక విభాగం (ACB) సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (ఏసీబీ సీఐయూ) నమోదు చేసిన ఎఫ్‌ఆర్‌ఐలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది ఆగస్టు 1న వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది. ఈ కేసులో ప్రతివాదులు అందరిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

ఇకపై ఇలాంటి ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తులను సవాల్‌ చేస్తూ దాఖలు అయ్యే పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించరాదని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ వెలువడిన 6 నెలల్లోపు ప్రతివాదులపై దర్యాప్తు పూర్తి చేసి, తుది నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. వారి పై అరెస్ట్‌ లాంటి కఠిన చర్యలు తీసుకోరాదని నిర్దేశించింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేయడానికి ప్రతివాదులంతా సహకరించాలని సూచించింది. జస్టిస్‌ ఎంఎం సుందరేష్, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం నిన్న (గురువారం) ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.

ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని: ఏసీబీ కేసుల దర్యాప్తు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో హైదరాబాద్‌ ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ను ‘పోలీస్‌ స్టేషన్‌’గా నోటి ఫై చేస్తూ 2003 సెప్టెంబర్ 12న ప్రభుత్వం జీఓ 268 జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2016 అక్టోబర్‌ 17న ఏసీబీ డీజీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. దాన్నే ఏసీబీ కేసుల విచారణ పోలీస్‌ స్టేషన్‌గా కొనసాగించారు.

2020 వరకు 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 12 కేసుల్లో దర్యాప్తు పూర్తి అయ్యింది. ఒక కేసులో ఛార్జిషీట్‌ కూడా వేశారు. ఈ నేపథ్యంలో 2020-23 మధ్య కాలంలో ఈ కేసుల్లో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం విజయవాడ ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని పోలీస్‌ స్టేషన్‌గా నోటిఫై చేయనందున ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని కోరారు.

ఈ కేసు నడుస్తుండగానే ఈ కార్యాలయాన్ని రాష్ట్రం మొత్తానికి ఏసీబీ పోలీస్‌ స్టేషన్‌గా వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌ 14న జీఓ కూడా ఇచ్చింది. అయితే అప్పటివరకు ఏసీబీకి రాష్ట్రంలో నమోదు చేసిన కేసుల పై దర్యాప్తు చేసే అధికారం లేదని, 2016 అక్టోబర్‌ 17 తర్వాత నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టి వేయాలని నిందితులు కోరారు. దీంతో హైకోర్టు 13 ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేస్తూ గతేడాది ఆగస్టులో తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్‌ చేస్తూ ఏసీబీ (రాయలసీమ) జాయింట్‌ డైరెక్టర్‌ సెప్టెంబర్‌ 12న సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు.

రాష్ట్ర విభజనకు ముందున్న చట్టాలు అన్నీ: ‘అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాల పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను హైకోర్టు కొట్టేయడంతో కొన్ని కేసుల దర్యాప్తును మొగ్గలోనే తుంచేసినట్లయింది. మరికొన్ని కేసుల్లో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా రద్దు చేసినట్లయింది. ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన పోలీస్‌ స్టేషన్ల జ్యూరిస్‌డిక్షన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేయడమే. ఒక సాంకేతిక కారణం చూపి ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరో జ్యూరిస్‌ డిక్షన్‌ చూపాల్సిన బాధ్యత హైకోర్టుకు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల్లో మార్పులు, చేర్పులు, సవరణలు, రద్దు చేస్తే తప్పితే రాష్ట్ర విభజనకు ముందున్న చట్టాలు అన్నీ విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయి.

దీనిలో భాగంగా ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నాం. వీటిలో ఇప్పటికే దాఖలైనవి, ఇక పై దాఖలు చేయబోయే ఛార్జిషీట్లను, దర్యాప్తు తర్వాత ఏవైనా ఇతరత్రా అంశాలు ఉంటే వాటినీ సవాల్‌ చేసే స్వేచ్ఛను ప్రతివాదులకు ఇస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్, గుంటూరు ప్రమోద్‌కుమార్‌లు వారి వాదనలు వినిపించారు.

కుక్కలు కరిచే మూడ్​లో ఉన్నాయని ముందే ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు

రైతుల మీదకు నెట్టేయకండి- దిల్లీ వాయుకాలుష్యానికి అసలు కారణాలు కనుక్కోండి: సుప్రీం కోర్టు