ETV Bharat / state

పోలీసు భద్రత హోదాగా మారింది - దానికోసం ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలి: సుప్రీంకోర్టు

కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - పోలీసు భద్రతను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ - కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం - సొంత భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సూచన

Shock to YSRCP Ex MLA Katasani Rambhupal Reddy
Shock to YSRCP Ex MLA Katasani Rambhupal Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 10:08 AM IST

3 Min Read
Choose ETV Bharat

Shock to YSRCP Ex MLA Katasani Rambhupal Reddy About Security: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ భద్రతను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ కాటసాని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. పోలీసు భద్రత హోదాగా మారిందన్న సుప్రీంకోర్టు దాని కోసం ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని ఘాటుగా వ్యాఖ్యనించింది. డబ్బున్నవాళ్లు ప్రైవేటు భద్రత ఏర్పాటు చేసుకోండని కాటసానికి సలహాఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న టు ప్లస్ టు భద్రతను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పరమేశ్వర్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ కుటుంబ సభ్యుల్లో, ఆరుగురు హత్యకు గురైన విషయాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్థులకు భద్రత కల్పించి, తన క్లయింట్‌కు తీసేసిందని చెప్పారు.

గత ఏప్రిల్‌లో కాటసాని ప్రాణాలకు ముప్పు ఉందంటూ పోలీసులు గృహనిర్బంధం చేశారని, అందుకే రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. రెండు ఫ్యాక్షన్‌ గ్రూప్‌లు ఉన్నప్పుడు ఒకదానికే భద్రత కల్పించకూడదన్నారు. ఐతే ఆ వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ప్రస్తుత రోజుల్లో పోలీసుల కంటే ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలే సమర్థ భద్రత కల్పిస్తున్నాయని అందువల్ల ఖాకీ భద్రత ఉండాలనే మత్తు నుంచి బయటపడాలని జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి పేర్కొన్నారు. మీరు డబ్బు దృష్ట్యా శక్తిమంతులని, భద్రత కోసం మీ డబ్బుశక్తిని ఉపయోగించాలని సూచించారు. మీ బాధంతా, మీకు భద్రత పోయిందని కాదని, మీ ప్రత్యర్థులకు ఇచ్చారన్నదే అన్నారు.

ఇలాంటి పదాలు సాధారణం: ప్రత్యర్థులు నాలుక కోస్తామని బెదిరించినంత మాత్రాన, భౌతికంగా కోస్తారని అర్థం కాదని న్యాయమూర్తి అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పదాలు సాధారణంగా వాడుతుంటారని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. భద్రత అనేది ముప్పును బట్టి కల్పించేదేగానీ, పాలసీకి సంబంధించింది కాదన్నారు. ప్రతీ పౌరుడి స్వేచ్ఛ, ప్రాణాలకు రక్షణ కల్పించడం రాజ్యం బాధ్యతన్నారు. దానికి, మీరైనా, ఇతర పౌరులైనా ఒక్కటేనని, మీరు ఎవరికీ ముప్పు తలపెట్టకపోతే, మీకెవ్వరూ ముప్పు కారని అన్నారు. భద్రత కోసం ప్రభుత్వధనం ఎందుకు ఖర్చుపెట్టాలని ప్రశ్నించారు. మీ భద్రత కోసం ప్రైవేటు ఏజెన్సీని నియమించుకోవడానికి వచ్చిన అడ్డంకి ఏంటని పిటిషనర్‌ తరపు న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు.

గెలిచి ఉంటే భద్రత వచ్చేది: ముప్పుపేరుతో పోలీసులు పిటిషనర్‌ను గృహనిర్బంధం చేశారన్న కాటసాని న్యాయవాది వాదనలనూ జస్టిస్‌ బాగ్చి తోసిపుచ్చారు. ఆ రోజు కార్యక్రమానికి వెళితే అక్కడ మళ్లీ హింసను ప్రేరేపిస్తారనే ఉద్దేశంతో పోలీసులు గృహనిర్బంధం చేశారని గుర్తు చేశారు. పిటిషనర్‌ ప్రతిపక్షపార్టీ సభ్యుడని న్యాయవాది పేర్కొనగా ‘‘మీరేమీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదని 2024 ఎన్నికల్లో ఓడారని గుర్తు చేశారు. గెలిచి ఉంటే భద్రత వచ్చేదని జస్టిస్‌ బాగ్చి వ్యాఖ్యానించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ ఐదు వందలు, వెయ్యి పెట్టి ఎవరైనా రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చని, ఆ తర్వాత నేను ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని కాబట్టి భద్రత కల్పించాలని అడగొచ్చని ఘాటుగా అన్నారు. ముప్పును అంచనా వేయడానికి ప్రభుత్వంలో నిఘాసంస్థలు ఉంటాయని, అవి శాస్త్రీయంగా నిర్ధారిచేందుకు స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని గుర్తు చేశారు అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి వదిలేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

‘నీ అంతు చూస్తా’ - ఎస్సైకి అంబటి రాంబాబు బెదిరింపులు

వైసీపీ ఘోర ఓటమికి పార్టీ నిర్ణయాలే కారణం- సంచలన ఆరోపణలు చేసిన కాటసాని