ETV Bharat / state

పోలవరం-నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తెలంగాణ రిట్​ పిటిషన్‌పై సందేహాలు

పిటిషన్‌కు విచారణ అర్హతేలేదని వాదించిన ఆంధ్రప్రదేశ్ - సివిల్‌ సూట్‌ వేసుకోవాలని తెలంగాణకు ధర్మాసనం సూచన - తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court Heard on Polavaram and Nallamala Sagar Petition
Supreme Court Heard on Polavaram and Nallamala Sagar Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 12:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

Supreme Court Heard on Polavaram and Nallamala Sagar Petition: పోలవరం-నల్లమలసాగర్‌పై తెలంగాణ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ విచారణ అర్హతపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తంచేసింది. పిటిషన్‌కు విచారణ అర్హతేలేదని ఆంధ్రప్రదేశ్ వాదించగా సివిల్‌ సూట్‌ వేసుకోవాలని తెలంగాణకు ధర్మాసనం సూచించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు గడువు కావాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా వేసింది. జలవివాదాలపై ఇరు రాష్ట్రాలూ మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.

సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే: పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ వేసిన రిట్‌ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రైబ్యునల్‌ జరిపిన నీటి కేటాయింపుల్లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 968, ఏపీకి 484.5 టీఎంసీల వాటా దక్కుతుందన్నారు. 484.5 టీఎంసీలకు మించి వరద జలాల పేరుతో మరో 200 టీఎంసీలను అదనంగా తరలించే యత్నాలను ఏపీ మొదలుపెట్టిందని వివరించారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలిచిందన్నారు. సమస్యపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2న ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిందని కమిటీ నివేదిక వచ్చేవరకైనా ఆంధ్రప్రదేశ్ చర్యలపై స్టే విధించాలని సింఘ్వీ కోరారు.

పోలవరం-నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తెలంగాణ రిట్​ పిటిషన్‌పై సందేహాలు (ETV)

ఆమోదముద్ర వేసేవరకూ: సింఘ్వీ వాదనలను ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తోసిపుచ్చారు. అంతర్గత అవసరాల కోసం 3 నెలలు ముందుగా ప్రాజెక్టు నివేదికను తయారు చేసుకుంటే వారికి అభ్యంతరమెందుకని అడిగారు. కరవుపీడిత ప్రాంతాలకు వరద జలాలను తీసుకెళ్లాలనుకుంటున్నామని తెలంగాణ నీటిని తాము తీసుకోవడం లేదని రోహత్గీ వాదించారు. నదీ పరీవాహక ప్రాంతంలో దిగువనున్న ఏపీకి వరద నీటిని వాడుకొనే హక్కు ఉంటుందన్నారు. సింఘ్వీ కోర్టుకు సమర్పించిన నోట్‌ సరిగా లేదని మరో న్యాయవాది జైదీప్‌ గుప్తా చెప్పారు. పోలవరం, పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టులు వేర్వేరని కానీ రెండింటినీ కలిపి చూపుతున్నారని తెలిపారు.ఈ అంశం సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉందని దానికి ఆమోదముద్ర వేసేవరకూ డీపీఆర్ సమర్పించలేమని తెలిపారు.

ఇరు రాష్ట్రాల మధ్య: ఏపీ దరఖాస్తును సీడబ్ల్యూసీ తిరస్కరించిందని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి చెప్పగా అది అవాస్తవమని జైదీప్‌ గుప్తా వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ అంతర్రాష్ట్ర జలవివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ సర్కార్ ఆర్టికల్‌ 32 కింద రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని ప్రశ్నించారు. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయొచ్చా? లేక సూట్‌ దాఖలు చేయాలా? అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అంశాల్లో ఆర్టికల్‌ 32 కింద దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హతే పెద్ద సమస్య అన్నారు. దానికి బదులు ఆర్టికల్‌ 131 కింద సివిల్‌ సూట్‌ దాఖలు చేసుకోవాలని సూచించారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా అందులో మార్పులు, చేర్పులు చేయలేరు కదా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి మీ సమస్య చెప్పుకోవాలని తెలంగాణకు సీజేఐ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్​ను నిలువరించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మించిన మార్గం లేదనుకుంటే సివిల్‌ సూట్‌ దాఖలు చేయాలన్నారు. అవసరమైతే అందులో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలనూ పార్టీలుగా చేర్చాలని సూచించారు.

వచ్చే సోమవారానికి వాయిదా: ప్రాజెక్టు అన్ని పనులనూ నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు సీడబ్ల్యూసీ చెప్పినా ఆపకపోవడం వల్లే ఆర్టికల్‌ 32 కింద కోర్టును ఆశ్రయించామని సింఘ్వీ తెలిపారు. తమ రిట్‌ పిటిషన్‌లో కేంద్రం, సీడబ్ల్యూసీ ప్రతివాదులుగా ఉన్నాయని చెప్పారు. సివిల్‌ సూట్‌ దాఖలు చేస్తే రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మమ్మల్ని ఎలా పార్టీ చేశారని కేంద్రం ప్రశ్నించొచ్చని అన్నారు. మధ్యంతర రక్షణ కల్పిస్తే సివిల్‌ సూట్‌ వేసే అంశం పరిశీలిస్తామన్నారు.

‘‘కేంద్రం వేసిన కమిటీ నిర్ణయాలు, సిఫార్సులు, అనుమతుల కోసం ఎదురుచూడకుండానే ఏపీ ముందుకెళ్లి ప్రజాధనాన్ని వృథా చేసుకుంటే ఎవరేం చేయగలరు అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ విషయంలో అత్యవసరతను దృష్టిలో ఉంచుకొని కమిటీ జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ విషయంలో సూట్‌ దాఖలు చేయడమే సరైందని ధర్మాసనం భావిస్తున్నట్లైతే ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని సింఘ్వీ కోరారు. ఆలోపు నిర్ణయానికి వస్తామని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. అదే సమయంలో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలూ మధ్యవర్తిత్వం గురించి ఎందుకు ఆలోచించకూడదని సూచించారు.

పోలవరం-నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో వాదనలు - విచారణ 12కి వాయిదా

పోలవరం నిర్మాణానికి రూ.62,436 కోట్లు! - తాజాగా అంచనాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం