ETV Bharat / state

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో ఉండవల్లి పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఉండవల్లి - పిటిషన్‌ దాఖలు చేయడానికి మీరు ఎవరని ఉండవల్లిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court Dismisses Undavalli Petition on Margadarsi Financiers
Supreme Court Dismisses Undavalli Petition on Margadarsi Financiers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 1:58 PM IST

|

Updated : August 20, 2026 at 2:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

Supreme Court Dismisses Undavalli Petition on Margadarsi Financiers: చివరికి న్యాయమే గెలిచింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై రెండు దశాబ్దాల వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేయడానికి మీకున్న అర్హత ఏమిటని ఉండవల్లిని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వ్యక్తిగత కక్షసాధింపే అన్నట్టుగా పిటిషనర్ న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సుదీర్ఘ న్యాయ పోరాటంలో విజయం : మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే ధర్మాసనం డిస్మిస్‌ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై రెండు దశాబ్దాలుగా సాగుతున్న వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సుదీర్ఘ న్యాయ పోరాటంలో విజయం సాధించింది.

హిందూ అవిభాజ్య కుటుంబంగా ఉంటూ ఆర్‌బీఐ చట్టానికి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తోందంటూ, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై 2008లో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. వైఎస్ ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై నమోదు చేసిన క్రిమినల్ కేసును 2018లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.

అవసరమా లేక వృథా కసరత్తా : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు, మళ్లీ తెలంగాణ హైకోర్టుకు పంపించింది. డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించి, మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ కొనసాగించడం అవసరమా లేక వృథా కసరత్తా అనే విషయం నిర్ధారించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ 2024 సెప్టెంబరు 26న డిపాజిట్లు క్లెయిమ్ చేయని వారుంటే అభ్యంతరాలు సమర్పించాలని పత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇచ్చారు. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అప్పటికే డిపాజిటర్లందరికీ డబ్బులు తిరిగి చెల్లించినందున, ఒక్క డిపాజిటర్ కూడా అభ్యంతరం సమర్పించేందుకు ముందుకు రాలేదు. డిపాజిటర్లందరికీ సొమ్ము తిరిగి చెల్లించడంతోపాటు, హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావు 2024 జూన్‌లో మరణించినందున 2008లో నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ గతేడాది జనవరిలో తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. మార్గదర్శి పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఇంకా కేసు కొనసాగించాల్సిన అవసరం లేదంటూ గతేడాది ఆగస్టు 4న కేసు కొట్టివేసింది.

తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. డిపాజిటర్లకు రూ.2591 కోట్లకు పైగా తిరిగి చెల్లించిందని, భవిష్యత్తులో ఇంకా ఎవరైనా వస్తే చెల్లించేందుకు మరో రూ.5.23 లక్షలు ఎస్క్రో అకౌంట్‌లో పెట్టిందని మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు.

ఉండవల్లికి ఉన్న అర్హత ఏమిటన్న సుప్రీం : విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉండవల్లి అరుణ్ కుమార్ ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్‌ఎల్‌పీ వేయడానికి ఉండవల్లికి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించింది. వ్యక్తిగత దురుద్దేశంతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను వెంటపడి వేధిస్తున్నట్టుగా ఉండవల్లి తరఫు న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కామారెడ్డిలో మార్గదర్శి చిట్​ఫండ్స్ 131వ బ్రాంచ్ - వినియోగదారుల హర్షం

"మార్గదర్శి" ఆదాయపు పన్ను నోటీసుల కొట్టివేత - రామోజీరావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు

Last Updated : August 20, 2026 at 2:22 PM IST