కడిగిన ముత్యంలా మార్గదర్శి - హర్షం వ్యక్తం చేస్తున్న చందాదారులు
మార్గదర్శి సంస్థపై తమకున్న నమ్మకం తీర్పుతో నిరూపితమైందని డిపాజిటర్ల వెల్లడి - తమకు ఆర్థికంగా తోడ్పాటు అందించిందన్న ఖాతాదారులు - నిందలు వేసినా కడిగిన ముత్యంలా వచ్చిందని అభిప్రాయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 9:22 AM IST
Margadarsi Financiers Case Dismissed by the Supreme Court : మార్గదర్శి డిపాజిటర్ల విశ్వాసం అప్పటికీ ఇప్పటికీ ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. నాటి పాలకులు మార్గదర్శిని వేధించినా రామోజీరావుపై నమ్మకంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సొమ్ము దాచుకున్న వారు క్యూలు కట్టలేదు. ఒకవైపు ప్రభుత్వం డిపాజిటర్లను రెచ్చగొట్టినా ఫిర్యాదు చేసేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. నాటి పాలకులు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పటి తమ నమ్మకమే సుప్రీంకోర్టు తీర్పుతో నిజమైందని చందాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్గదర్శి డిపాజిటర్ల నమ్మకం ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు. అప్పటి పాలకులు తమ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి మార్గదర్శిపై ఉసిగొల్పినా చందాదారులు విజ్ఞత ప్రదర్శించారు. రెచ్చగొట్టినా సంయమనం చూపారు. మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని ఎంత ఒత్తిడి చేసినా సంస్థపై వారికున్న అపార విశ్వాసం ముందు అవన్నీ దిగదిడుపే అయ్యాయి. చివరకు వారందరి నమ్మకమే గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పుతో డిపాజిటర్లలో హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పటికీ రూ.5.23 కోట్లు ఎస్క్రో ఖాతాలోనే ఉన్నాయంటే ఆ సంస్థపై విశ్వాసమేనని ఖాతాదారులు అభిప్రాయపడ్డారు. మార్గదర్శిని నమ్ముకొని ఆర్థికంగా నిలదొక్కుకున్నామని, తమ జీవితంలో ప్రతీ ముఖ్యమైన విషయంలోనూ మార్గదర్శి తోడ్పాటు ఉందన్నారు.
"మార్గదర్శితో మా అనుబంధం తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అవసరమైన ప్రతిసారి మార్గదర్శి మాకు తోడుగా ఉంది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తప్పవన్నట్లు నిజాయతీతో పనిచేసే మార్గదర్శి సంస్థకు నిందలు తప్పలేదు. కానీ ఇలా జరిగిన ప్రతిసారి మార్గదర్శి తనను తాను రుజువు చేసుకుంది" -ఇందిరావాణి, చందాదారు, హైదరాబాద్
పలువురు విశ్రాంత ఉద్యోగులు సైతం తమకు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారు. మార్గదర్శి నమ్మకమైన సంస్థ అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో అక్షరాలా నిరూపితమైందని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో లక్షలాది మంది ఖాతాదారుల విశ్వాసం చూరగొన్న మార్గదర్శి పది కాలాల పాటు పదిలంగా ఉండాలని చందాదారులు ఆకాంక్షిస్తున్నారు.
"దాదాపు 1979 నుంచి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో నాకు సంబంధం ఉంది. దీని ద్వారా సేవింగ్స్ చేసి ప్లాట్ కొనడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి సహకరించింది. ఇలాంటి మంచి సంస్థ మీద కొన్ని సంవత్సరాల కింద ఒక రాజకీయ నాయకుడు అనవసరంగా విమర్శలు చేస్తే నేను నిరసన తెలిపాను. అది ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా సరైన తీర్పు రావడంతో చాలా ఆనందంగా ఉంది నాకు. అనవసరంగా ఒక మంచి సంస్థ జోలికెళ్లి వాళ్లను ఇబ్బంది పెట్టడం, దాంతో లాభపడేవాళ్లను ఇబ్బంది పెట్టడం చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బ్యాంకులో డబ్బులు ఎలా దాచుకుంటామో ఆ నమ్మకం మనకు మార్గదర్శిలో ఉంది" - రాఘవేంద్రరావు, హైదరాబాద్
మార్గదర్శిపై మా విశ్వాసం ఎప్పటికీ అలాగే ఉంటుంది: అన్నింటినీ జయించి ఈరోజు మార్గదర్శి సుప్రీంకోర్టులో గెలవడంతో మా ఆనందానికి అవధుల్లేవని చందాదారులు అంటున్నారు. ఇది మా ఇంటి విజయంగా భావిస్తున్నాం. కేవలం స్వార్థం, వ్యక్తిగత కక్షతోనే మార్గదర్శి మీద నిందలేశారని తేలిపోవడం హర్షణీయం. మరో 50 ఏళ్లయినా మార్గదర్శి ఇలాగే ఉండాలి. మా పిల్లలకూ వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నాను.
1993లో నాకు పెళ్లయి జీవితం కొత్తగా ఆరంభించినప్పుడు రూ.2 వేల జీతం వచ్చేది. అప్పుడే కొద్దిగా మిగుల్చుకుని మార్గదర్శిలో చిట్టీ కట్టడం ఆరంభించాను. దాన్ని కొన్నాళ్లకు పాడుకుని మార్గదర్శిలోనే 18 శాతం వడ్డీకి డిపాజిట్ చేసుకున్నాను. ఆ వచ్చిన వడ్డీతో మరో కొత్త చిట్టీ కట్టాను. అలా అలా మార్గదర్శిలో నా ప్రయాణం 33 ఏళ్లు కొనసాగింది. క్లిష్టపరిస్థితుల్లో డిపాజిట్లను ఆపేయమన్నప్పుడు కూడా నా నమ్మకం ఏమాత్రం సడలలేదు. ఈ రోజు వరకూ చిట్టీలను ఆపలేదు. ఆ నమ్మకమే నేను ఈరోజు ఆర్థికంగా స్థిరంగా నిలబడడానికి కారణమైంది. ఈ చిట్టీల ద్వారానే నేను మూడు ప్లాట్లను కొనుక్కోగలిగాను. వాటితోనే పిల్లల పెళ్లిళ్లు చేయగలిగాను. మార్గదర్శి మీద మా విశ్వాసం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నా మూడు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో చిట్టీ కంపెనీలొచ్చి వెళ్లినా మార్గదర్శి మీద మాత్రం ఈ రోజుకూ చిన్న అనుమానం కూడా మాకు రాలేదు. అంత నమ్మకంగా ఈ ప్రయాణం సాగింది. ఎవరి మీదైనా నిందలు వేయొచ్చు. వాటన్నింటినీ జయించి ఈరోజు మార్గదర్శి సుప్రీంకోర్టులో గెలవడంతో మా ఆనందానికి అవధుల్లేవు. ఇది మా ఇంటి విజయంగా భావిస్తున్నాం. కేవలం స్వార్థం, వ్యక్తిగత కక్షతోనే మార్గదర్శి మీద నిందలేశారని తేలిపోవడం.. హర్షణీయం. మరో 50 ఏళ్లయినా మార్గదర్శి ఇలాగే ఉండాలి. మా పిల్లలకూ వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నాను. -జి.ఎన్.స్వామి, అడ్మిషన్స్ డీన్, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, విజయవాడ
మార్గదర్శిపై అన్యాయంగా విమర్శలు: ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సంబంధించిన బంధువులకు డబ్బు రాలేదని వివాదం చేయగా ఆ వివరాలు చెప్పాలని సభ్యులుగా మేం ఆయనను అడిగామని పలువురు చందాదారులు తెలిపారు. అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఉండవల్లి మాకు బదులిచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయమని వారంటున్నారు.
నేను మార్గదర్శిలో 1973 నుంచి చందాదారుడిని. జీతం వచ్చిన వెంటనే తొలుత డిపాజిట్ చేసేవాడిని. చిట్టీ పాడిన తరువాత సెక్యూరిటీ మొత్తం అక్కడే డిపాజిట్ చేస్తే రూ.1.50 చొప్పున వడ్డీ ఇచ్చేవారు. పాడిన మొత్తం డిపాజిట్ చేస్తే అప్పట్లో 18 శాతం వడ్డీ చెల్లించేవారు. విశ్రాంత ఉద్యోగులు డబ్బు జాగ్రత్తగా దాచుకునేవారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సంబంధించిన బంధువులకు డబ్బు రాలేదని వివాదం చేయగా ఆ వివరాలు చెప్పాలని సభ్యులుగా మేం ఆయనను అడిగాం. మీకు చెప్పాల్సిన పని లేదని ఉండవల్లి మాకు బదులిచ్చారు. నేను ఇప్పటికీ సంస్థలో చిట్టీలు వేస్తున్నా. మార్గదర్శిని అన్యాయంగా విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయం. -నేదునూరి కృష్ణారావు, విశ్రాంత ఈఈ, ఇరిగేషన్, రాజమహేంద్రవరం
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ఆదాయపు పన్ను నోటీసుల కొట్టివేత - రామోజీరావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు

