తిరుపతిలో కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
తిరుపతి గ్రామీణం దామినీడులో 16 కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ - శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్- దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ సూర్యకాంత్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 1:28 PM IST
|Updated : March 1, 2026 at 2:28 PM IST
CJI Justice Suryakant Tour : ఆసుపత్రిలో చేరిన రోగి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లినట్లే, కోర్టుమెట్లు ఎక్కిన కక్షిదారు న్యాయంతో తిరిగి వెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కోర్టు భవనాల సముదాయనికి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థానప చేశారు. తిరుపతి రూరల్‌లోని దామినీడు వద్ద 16 కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభ సూచికమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. "న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోంది. నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు తమకు న్యాయం జరగాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే వారికి సరైన న్యాయం జరుగుతుంది. అనారోగ్య సమస్య రాగానే నయమవుతుందన్న నమ్మకంతో ఆస్పత్రికి వెళ్తారు. వైద్యులు ఇచ్చిన భరోసాతో తమకు స్వస్థత చేకూరుతుందని నమ్ముతారు.
కోర్టుకు వచ్చామంటే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం రావాలి. న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. తిరుపతిలో కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసుకున్నాం. వెంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుపతికి చాలా మంది వస్తారు. న్యాయం కోసం వచ్చిన వారికి పూర్తి నమ్మకం కలిగినప్పుడే సంతృప్తి ఉంటుంది. తిరుపతిలోని నూతన భవనం ప్రజలకు మరో ఆలయంలా మారాలి" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు.
"న్యాయం అందించటంలో నిర్దేశిత గడువు ఉండాలి. ఒక్క బెంచ్‌కే కాదు. బార్‌లోని లాయర్లు కూడా లక్ష్యంతో ఉండాలి. బార్ నుంచి వాదన సరిగ్గా ఉన్నపుడే జడ్జిల నుంచి నాణ్యమైన తీర్పులు ఉంటాయి. నాణ్యమైన తీర్పులు ఉంటే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. మహిళా న్యాయవాదులకు చక్కని సౌకర్యాలు కొత్త భవనంలో ఏర్పాటు చేయాలి. కోర్టు నూతన భవనంలో మెడికల్ సెంటర్ కూడా ఉండాలి." - జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు సీజేఐ
అన్ని మౌలిక వసతులతో నూతన భవనాల ఏర్పాటు జరుగుతోందని హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. 'త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధునాతన సాంకేతిక సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు. ఒకసారి జమ్ముకశ్మీర్‌లో వరదలు వచ్చినప్పుడు కోర్టు భవనంలోకి నీళ్లు వచ్చాయి. సిబ్బంది మొత్తం తాత్కాలికంగా శిబిరం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు' అని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు.
"చాలా కోర్టుల్లో జడ్జిల ఛాంబర్లు సరిగ్గా ఉండేవి కాదు. టాయిలెట్స్ కూడా లేక లాయర్లు, క్లయింట్స్ ఇబ్బంది పడుతుంటారు. గతంలో కశ్మీర్ వరదల్లో అక్కడి హైకోర్టు భవనం పూర్తిగా మునిగిపోయింది. జడ్జిల ఇళ్లు, టెంట్‌ల కింద కోర్టు కార్యకలాపాలు నిర్వహించాం. న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సిబ్బంది వ్యవహరించింది. జడ్జిల పని పట్ల అంకిత భావానికి ఈ ఘటన అద్దం పట్టింది. అన్ని జిల్లాల్లోని కోర్టుల్లో ఏసీలను ఏర్పాటు చేయించాం. క్లయింట్లు, లాయర్లకు కూడా సౌకర్యవంతమైన వాతావరణం వచ్చింది. తిరుపతిలో కోర్టు సముదాయం కూడా వందేళ్ల అవసరాలను తీరుస్తుంది." - జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు సీజే
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ సూర్యకాంత్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
నేడు ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్- రాష్ట్రపతి ఆమోద ముద్ర

