అమరావతిలో ప్రభుత్వం, రైతులు చూపిన చొరవ మధ్యవర్తిత్వ విజయమే: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
అమరావతి గ్లోబల్ సిటీ కాబోతోంది - ఏపీలో గొప్ప మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంచుదాం - విశాఖ కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది- విజయవాడలో ‘మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు’లో పాల్గొన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 8:35 PM IST
CJI Justice Suryakant on State Level Conference on Mediation : న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయం కాదని, ఓ ప్రాధాన్యాంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. మధ్యవర్తిత్వం భారతీయలు డీఎన్‌ఏలోనే ఉందని ఉదహరించారు. రెండు పక్షాలకు మేలు చేకూర్చేలా చేయడంలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టులపై కేసుల భారం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని విస్మరించడం ఏ మాత్రం సహేతుకం కాదన్నారు. విజయవాడలో జరిగిన ‘మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు’కు ఆయన హాజరయ్యారు.
కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి : " న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర. మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయి. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదు. కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలి. న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతోనే ప్రజలు కోర్టులకు వస్తున్నారు. కొన్ని కేసుల్లో కోర్టులు కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి. మధ్యవర్తిత్వం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.
మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోజనాలను అనేక దేశాల్లో చూశా. మలేషియాలోని లీగల్ బార్ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. మనదేశంలోనూ ప్రతి స్థాయిలో మధ్యవర్తిత్వం రావాలి. మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశంలో పరిశ్రమలు, స్టార్టప్స్ పెరుగుతున్నాయి. వ్యాపారం, వాణిజ్య పరంగా అనేక వివాదాలు రావడం సహజం. అనేక రాష్ట్రాల్లో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుంది. మధ్యవర్తిత్వం వహించే వారికి శిక్షణ ఇవ్వడం చాలా కీలకం." అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
అందులో విజయవంతం కావాలంటే 3 అంశాలు : " మధ్యవర్తిత్వం ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశం. మధ్యవర్తిత్వానికి మూలాలు మన పురాణాల్లోనే ఉన్నాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు మొదటి మధ్యవర్తి. కురుపాండవుల యుద్ధాన్ని ఆపేందుకు కృష్ణుడి రాయబారం మనకు తెలుసు. మధ్యవర్తిత్వం విఫలం కావడం వల్లే కురుక్షేత్రం జరిగింది. మధ్యవర్తిత్వం విఫలమైతే నాశనం తప్పదని చరిత్ర చెబుతోంది. మధ్యవర్తిత్వం విజయవంతం కావాలంటే 3 అంశాలు తప్పనిసరి. మధ్యవర్తిత్వంపై ఇరుపక్షాలకు పూర్తి నమ్మకం ఉండాలి.
మధ్యవర్తి మాట్లాడే తీరు అనుసరించే పద్ధతి చాలా కీలకం. మధ్యవర్తుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. మధ్యవర్తుల ఎంపిక పారదర్శకంగా ఉంటేనే ప్రజలు సంస్థను గౌరవిస్తారు. మధ్యవర్తిత్వంపై నమ్మకం పెరిగితే దేశవ్యాప్తంగా అనేక మార్పులు. ప్రపంచవ్యాప్తంగా నేడు మధ్యవర్తిత్వానికి ప్రాచుర్యం పెరుగుతోంది. మలేషియా, సింగపూర్‌లో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రత్యక్షంగా చూశా. దేశం కోసం మధ్యవర్తిత్వం అని పిలుపునిచ్చా." అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు.
వ్యాపారవేత్తలూ కోర్టుల కంటే మధ్యవర్తిత్వానికే మొగ్గు : " మధ్యవర్తిత్వం ఇప్పుడు గొప్ప గమ్యస్థానానికి చేరుకుంటోంది. మధ్యవర్తిత్వం ఇప్పుడు గ్రామాలు, గృహాల వరకు చేరింది. మధ్యవర్తిత్వం వల్ల రైతుల సమస్యలు, భూ వివాదాలు పరిష్కారం. మధ్యవర్తిత్వం వల్ల జటిలమైన వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. అమరావతిలో ప్రభుత్వం, రైతులు చూపిన చొరవ మధ్యవర్తిత్వ విజయమే. వ్యాపారవేత్తలూ కోర్టుల కంటే మధ్యవర్తిత్వానికే మొగ్గు చూపుతున్నారు. వ్యాపార సంబంధాలు దెబ్బతినకూడదని వ్యాపారులు భావిస్తున్నారు. అమరావతి గ్లోబల్ సిటీ కాబోతోంది. విశాఖ కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. అమరావతి, విశాఖ అభివృద్ధిలో న్యాయపరమైన అడ్డంకులు ఉండకూడదు. శిక్షణ ద్వారా మధ్యవర్తిత్వ నైపుణ్యాలు పెంచాలి. ఏపీలో గొప్ప మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంచుదాం." అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
దేశంలోనే అత్యుత్తమ న్యాయ నగరం : అంతకుముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ న్యాయ నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేషనల్ జ్యూడీషియల్ నిర్మాణం వల్ల అమరావతి జస్టిస్ హబ్‌గా మారుతుందన్నారు. అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, ఇంటర్నేషనల్ లా కౌన్సిల్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు.
'బ్లూ-గ్రీన్' సిటీగా అమరావతి : " 2047 నాటికి భారత్ నెంబర్‌వన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. మన దేశానికి యువత, టెక్నాలజీ పెద్ద బలం. మా చిన్నప్పుడు విద్యుత్ లేక అనేక ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు ప్రతి భవనంపై విద్యుత్ తయారుచేసే స్థాయికి చేరాం. ఏపీలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ నిర్మించడం మన అదృష్టం. అమరావతిలో జస్టిస్ సిటీ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తాం. విజయవంతమైన మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం ఇస్తాం. అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, ఇంటర్నేషనల్ లా కౌన్సిల్‌కు సహకరిస్తాం.
అమరావతిలో మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తాం. రాజధానికి 33 వేల ఎకరాలు ఇవ్వడమే మధ్యవర్తిత్వం విజయానికి ఉదాహరణ. అమరావతిని 'బ్లూ-గ్రీన్' సిటీగా నిర్మాణం చేస్తాం. మా నాన్న మధ్యవర్తిగా ఉండి అనేక సమస్యలు పరిష్కరించేవారు. వివాదాలు వచ్చినప్పుడు రాజీ మార్గానికి ఉన్న శక్తి నాకు తెలుసు. న్యాయం త్వరగా లభిస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుంది." అని చంద్రబాబు తెలిపారు.
" మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు. రాజధాని అమరావతి గురించి సీజేఐకు వివరించాం. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి అనేది దేవతల రాజధాని. సీజేఐ ఇవాళ మొత్తం అమరావతిలో ఉన్నారు, చాలా సంతోషం. సీజేఐ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఇక్కడకు వచ్చారు. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారు. అమరావతిని గొప్ప నగరంగా నిర్మిస్తున్నాం. కాలుష్యం లేని నగరంగా అమరావతిని తయారుచేస్తాం. అమరావతిలో ఉండేవారు 20 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారు. కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర." - సీఎం చంద్రబాబు
మధ్యవర్తులకు గౌరవ వేతనం : కొందరు వ్యక్తులు అవసరం లేకుండానే కోర్టుకు వస్తున్నారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వేల కేసులు పరిష్కారం అవుతాయన్నారు. మధ్యవర్తులకు గౌరవ వేతనం పెంచాలన్నారు. విజయవంతమైన కేసులో మధ్యవర్తికి రూ.3 వేల నుంచి రూ.10 వేలు ఓడిపోయిన కేసులో రూ.3 వేలు వరకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.
తిరుపతిలో కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
అమరావతిలో మరో కీలక ఘట్టం - ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన

