ETV Bharat / state

బడికి రాని ఉపాధ్యాయులు - గిరిజన బిడ్డల కోసం టీచర్‌గా మారిన మహిళ

దశాబ్దాల తరబడి రోడ్డు సౌకర్యం లేని సుళ్లారి గ్రామం - పాఠశాల ఉన్న విధులకు రాని ఉపాధ్యాయులు - పిల్లల కోసం టీచర్‌గా మారిన పదోతరగతి చదివిన ఉష

Sullari Govt School Issue
పిల్లల కోసం ఉపాధ్యాయురాలిగా మారిన యువతి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 8:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sullari Govt School Issue : శాస్త్రసాంకేతిక రంగలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ దేశంలోని చాలా ప్రాంతాలకు ఇప్పటికీ సరైన రహదారి సౌకర్యాలు లేవు. ఇక కొండకోనల్లో ఉండే గిరిజనుల పరిస్థితి మరీ దయనీయం. ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో వారు ఉన్నారు. అక్కడ వారికి సరైన రోడ్లుండవు, వసతులు కానరావు, పక్కాగృహాలు కనాకష్టం. ఏ పురుగో ముట్టినా, ప్రాణం చేతగాక అనారోగ్యం ప్రాణం మీదకు తెచ్చిన డోలీ మోతలే ఆధారం. నేటికీ మౌలిక సదుపాయాల కల్పన అనేది వారికి ఒక అందని కలగానే మిగిలిపోయాయి.

ఇక గిరిజన గ్రామాల్లోని పాఠశాలల్లో విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు వెనుకడుగేస్తున్నారు! ఎందుకంటే సరైన రహదారులు లేకపోవడంతో పాటు కొండకోనల గుండా వాగులు, గెడ్డలు దాటుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఆ గ్రామంలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. టీచర్‌ రాక చదువుకు దూరమైన తన తోటి గిరిజన పిల్లల కోసం ఆ మహిళ టీచర్‌ అవతారమెత్తారు. ఓవైపు తన నాలుగు నెలల పసికందును చూసుకుంటూనే ఆ గిరిపుత్రుల పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అమ్మగానే కాదు టీచరమ్మగానూ స్ఫూర్తి నింపుతున్నారు. మరి ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పిల్లల కోసం ఉపాధ్యాయురాలిగా మారిన యువతి (ETV Bharat)

Sullari Village Problems : పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం సంపంగిపాడు పంచాయతీ పరిధిలో సుళ్లారి గ్రామం ఉంది. దశాబ్దాల తరబడి ఈ గ్రామానికి కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు. ఇక సంపగిపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే గెడ్డ దాటుకుని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే. సుళ్లారి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలకు టీచర్​ను నియమించలేదు. దీంతో విధుల సర్దుబాటులో దలైవలసలో పని చేస్తున్న టీచర్​ను ఇక్కడికి కేటాయించారు.

ఆ టీచర్​ మూడు రోజులు పాటు దలైవలస పాఠశాలలోనూ మరో మూడు రోజులు సుళ్లారి గ్రామంలో ఉన్న విధులు కేటాయించారు. అయితే ఆ ఉపాధ్యాయుడు సుళ్లారి రావడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో పిల్లల చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో గ్రామానికి చెందిన ఉష అనే పదోతరగతి చదివిన మహిళ ముందుకొచ్చారు. ఆమె టీచర్‌గా మారి గిరిజన పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఆమె భర్త కూలి పనికి వెళ్తుండగా మూడేళ్లు, నాలుగు నెలల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సంవత్సరాలు ఉన్న పెద్ద కుమారుడు కూడా పాఠశాలలో విద్యార్థే. నాలుగు నెలల వయసున్న మరో కుమారుడి కోసం బడిలోనే ఓ ఊయల ఏర్పాటు చేశారు ఉష. ఊయల్లో చంటోడిని చూసుకుంటూనే పిల్లలకు చదువు చెబుతున్నారు.

"నేను పదోతరగతి వరకు చదివాను. ఈ పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగు నెలల బిడ్డతో పాటు మరో మూడేళ్ల కుమారుడు కూడా నాతో పాటే ఉంటారు. మా ఆయన కూలి పనులకు వెళ్తారు. ఇక్కడి పిల్లలకు పాఠాలు అర్ధమయ్యేలా చెబుతున్నాను." - ఉష, స్థానికురాలు

ఇక్కడ ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు కలిసి 27 మంది ఉన్నారు. సుళ్లారితో తోపాటు సమీపంలో ఉన్న నేరేడువలస గ్రామంలోని విద్యార్థులకు కూడా ఇది ఒక్కటే పాఠశాల. ఉష స్ఫూర్తిని మెచ్చుకుంటున్న గ్రామస్థులు ఆమె చొరవతో పిల్లలు కూడా క్రమం తప్పకుండా బడికి వస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఐటీడీఏ డీడీ విజయశాంతిని వివరణ కోరగా సీఆర్టీలను నియమించినా ఇంకా కొందరు ఆయా పాఠశాలలకు వెళ్లకుండా మార్పు చేయాలని కోరుతున్నారని చెప్పారు. కేటాయించిన టీచర్‌తో మాట్లాడి గురువారానికి సమస్యను పరిష్కరించామని తెలిపారు.

గుర్రాలు, గాడిదలపై జెండాలతో గిరిజనులు - రోడ్డు కోసం వినూత్న నిరసన

విద్యార్థినికి జ్వరం - 6 కిలోమీటర్లు వీపుపై మోస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లిన వార్డెన్​