సేంద్రియ సాగులో రాణిస్తున్న మహిళ - ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు
12 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న సత్యనారాయణ, స్వాతి దంపతులు - రసాయనాలకు స్వస్తి పలికి సేంద్రియ సాగు వైపు అడుగులు, ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న మహిళ

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 20, 2025 at 4:46 PM IST
|Updated : October 20, 2025 at 5:04 PM IST
Special Story On Organic Farming in Guntur District: అనారోగ్యాలకు మనం తీసుకునే ఆహారమే సగం కారణం. మితిమీరిన పురుగు మందులు, ఎరువుల వాడకంతో ప్రతీ పదార్థమూ కలుషితమై ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది. తనకొచ్చిన బ్రెయిన్ ట్యూమర్‌కు కూడా ఇదే కారణమని గుర్తించిన ఆ మహిళ తన ఇంట్లో వండేవి, తినేవన్నీ సహజసిద్ధంగా ఉండాలనుకున్నారు. రసాయనాలకు స్వస్తి పలికి సేంద్రియ సాగు వైపు అడుగులు వేశారు. దేశీయ వంగడాలనే వాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. ప్రధాని మోదీ ప్రశంసలు సైతం అందుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు.
భర్త ప్రోత్సాహంతో ప్రకృతి సాగు: గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన యర్రు సత్యనారాయణ, స్వాతి దంపతులది వ్యవసాయ కుటుంబం. సొంతంగా 2 ఎకరాల భూమి ఉండగా మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తంగా 12 ఎకరాల్లో సాగు చేసేవారు. పురుగుమందులు, ఎరువులు ఎన్ని వాడినా భూమి గుల్లబారడం తప్ప దిగుబడులు రాక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలోనే స్వాతి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డారు. తన అనారోగ్యానికి విపరీతమైన రసాయనాలు వాటితో పండించిన పంట ఉత్పత్తులే కారణమని గుర్తించారు. భర్తను ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. అప్పటివరకూ వాడిన ఎరువులను పూర్తిగా పక్కన పెట్టారు. పేడ, మూత్రంతో జీవామృతం, కషాయాలు తయారుచేసి పంటలకు చల్లుతూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
"మేము గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మైసూర్ మల్లిక, ఇంద్రాణి, కాలా బట్టి, బ్లాక్ రైస్, నవారా, నారాయణ కామిని, రత్నచోడి, పంచరత్న, తులసీబానో వంటి దేశీయ వంగడాలు పండించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంతోపాటు ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలను పొలం గట్లపైనే పండిస్తున్నాం. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. సేంద్రియ సాగు ద్వారా మనుషుల ఆరోగ్యమే కాదు భూసారం కూడా దెబ్బతినకుండా ఉంటుందని భావితరాలకు మంచి నేల, గాలి అందించడమే మా లక్ష్యం"-యర్రు స్వాతి, రైతు
ప్రశంసించిన ప్రధాని మోదీ: ఈ విధంగా దాదాపు గత 10 ఏళ్లుగా స్వాతి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులోనూ రోగాల కట్టడికి ఉపయోగపడేలా రోగనిరోధకశక్తి, పౌష్టిక విలువలు అధికంగా ఉన్న దేశీయ వరి వంగడాలకే ప్రాధాన్యమిస్తున్నారు. మైసూర్ మల్లిక, ఇంద్రాణి, కాలా బట్టి, బ్లాక్ రైస్, నవారా, నారాయణ కామిని, రత్నచోడి, పంచరత్న, తులసీబానో వంటి దేశీయ వంగడాలు పండించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. సేంద్రియ వరి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన పీజీఎస్ ధ్రువపత్రాన్ని ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా స్వాతి అందుకుని ప్రశంసలు పొందారు.
ప్రకృతి వ్యవసాయంతోపాటు ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలను పొలం గట్లపైనే పండిస్తున్నారు. సేంద్రియ సాగు ద్వారా మనుషుల ఆరోగ్యమే కాదు భూసారం కూడా దెబ్బతినకుండా ఉంటుందని భావితరాలకు మంచి నేల, గాలి అందించడమే లక్ష్యమని స్వాతి అంటున్నారు. మహిళా రైతు నుంచి స్ఫూర్తి పొంది ఇతర రైతులూ సేంద్రియ సాగు చేస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయంతో దిగుబడులు - సొంత మార్ట్ పేరుతోనే ఇంటింటికీ అమ్మకాలు

