YUVA : పడిన చోటే లేచి నిలబడ్డాడు - సోషల్ మీడియా సాయంతో 'స్టార్'గా ఎదిగాడు!
సోషల్ మీడియాను కెరీర్ వేదికగా మార్చుకున్న తెలంగాణ యువకుడు జైపాల్ రెడ్డి - వివిధ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలనే దానిపై వీడియోలు - జైపాల్ వీడియోలకు 9 లక్షల మంది ఫాలోవర్స్

Published : August 27, 2026 at 1:35 PM IST
Tech Force CEO A Jaipal Reddy Success Story : ఓటమి తలుపు తట్టినప్పుడు నిరాశతో ఆగిపోవడం సహజం. కానీ ఆ ఓటమిని గెలుపునకు తొలి మెట్టుగా మార్చుకున్నప్పుడే ఒక అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. ఇంగ్లీష్ అంటేనే భయపడి, 4 గోడల మధ్య తన కష్టాలను దాచుకున్న ఆ యువకుడు నేడు ఖండాంతరాలు దాటి ఒక వ్యాపారవేత్తగా ఎదిగి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయకుండా అదే వేదికగా వేలాది మంది యువత విదేశీ కలల్ని నెరవేర్చుకునే దిశగా కృషి చేస్తున్నాడు. అతడి సక్సెస్ వెనకున్న విశేషాలు ఈ కథనంలో చూద్దాం.
సాధారణ యువకుడి అసాధారణ విజయం : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ సమయం గడిపేస్తోంది నేటితరం. కానీ అదే రీల్స్ ఒకరి జీవితాన్ని మార్చే సాధనగా వాడితే ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా ఎలాంటి అడుగులు వేయాలో తెలియక గందరగోళంలో ఉన్న ఎంతోమందికి ఒక మార్గదర్శిగా మారాడీ యువకుడు. ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటానికి జంకిన స్థితి నుంచి ప్రస్తుతం విదేశాల్లో సొంత కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగిన అతడి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా అంటే చాలా మందికి వినోదం, మరికొందరికి కాలక్షేపం. యాదాద్రి జిల్లా రేవణపల్లికి చెందిన జైపాల్ రెడ్డికి మాత్రం యువత జీవితాల్లో మార్పు కోసం సందేశాన్ని అందించే వేదిక. ఇతడిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియం, ఇంటర్, ఇంజినీరింగ్ ఇంగ్లీష్‌లో చదివాడు. ఆంగ్లం చదవడం, రాయడం వచ్చు కానీ మాట్లాడటం రాదు. అలాగే చాలా భయం కూడా. అయినా విదేశాలకు వెళ్లాలని కలలు కన్నాడు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్లాడు. అలా కష్టపడుతూ 18 ఏళ్ల క్రితం స్కాట్లాండ్‌లో అడుగుపెట్టాడు.
ఎంతో మంది యువతకు మార్గదర్శిగా : స్కాట్లాండ్ వెళ్లాక జైపాల్ రెడ్డికి అసలు పరీక్ష మొదలైంది. అక్కడి భాష రాకపోతే పార్ట్‌టైమ్ జాబ్ దొరకదు. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇంటర్వ్యూల్లో చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు. అలా చాలాసార్లు నిరాశపడ్డాడు. భయపడితే భాష రాదని మాట్లాడితేనే వస్తుందని గ్రహించాడు. ఒక్కో అడుగు వేస్తూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి ఉద్యోగం సంపాదించాడు. కొన్నేళ్లు కొలువు చేశాక సొంతంగా అక్కడే టెక్‌ఫోర్స్ అనే కంపెనీ స్థాపించి పలువురికి ఉద్యోగావకాశాలు కల్పించాడు.
యూకేలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలను తెలంగాణ యాసలో వీడియోలుగా మలిచాడు జైపాల్ రెడ్డి. రెజ్యూమె ఎలా తయారు చేయాలి? ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి? అని చాలా మంది మెసేజ్‌ల రూపంలో అతడిని అడిగేవారు. ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పడం కుదరదని వీడియోల ద్వారా సలహాలు ఇస్తూ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతికాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగాడు.
"నేను యూకేలో జాబ్ సాధించిన తర్వాత నా ఫ్రెండ్స్ చాలా మంది ఇంటర్వ్యూ టిప్స్ అడుగుతుండేవారు. అప్పటి నుంచే ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడం ప్రారంభించాను. విదేశీ ఉద్యోగాలకు ఎలా సన్నద్ధమవ్వాలనే దానిపై వీడియోలను సోషల్ మీడియోలో పోస్టు చేసేవాడిని. నాకు సోషల్ మీడియాలో 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నలుగురికి నా సూచనలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే వాటిని పోస్ట్ చేస్తున్నాను" - జైపాల్ రెడ్డి, ఇన్‌ఫ్లూయెన్సర్
సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ : మొదట చిన్న చిన్న వీడియోలు పోస్టు చేయడం, తర్వాత కంటెంట్ మీద అవగాహన పెరగడంతో ఫాలోవర్ల సంఖ్యా క్రమంగా పెరిగింది. ప్రస్తుతం జైపాల్ రెడ్డికి సోషల్ మీడయాలో 'ఆస్క్ జై' పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికల ద్వారా 9 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, ఉద్యోగం కోసం వెతికే వారికి, ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి టిప్స్ చెబుతున్నాడు జైపాల్. రెజ్యూమె తయారీ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వరకు తన అనుభవాలను వివరిస్తూ యువతకు ఉపయోగపడే అంశాలనే ఎంచుకుంటున్నాడీ యువకుడు.
తాజాగా సొంతూరుకు వచ్చిన సమయంలో 'మీట్ అప్' నిర్వహించాడు జైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి దాదాపు 1,700 మంది వరకు యువత వచ్చారని చెబుతున్నాడు. యువత దేనికీ భయపడకూడదని, ఇప్పుడు ఎంతో కష్టంగా అనిపించే సమస్యలు భవిష్యత్తులో చిన్నవిగా కనిపిస్తాయని వివరించాడు. ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటానికి భయపడి నిరాశ చెందిన చోటు నుంచే నేడు లక్షలాది మందికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగాడు జైపాల్ రెడ్డి. సోషల్ మీడియాను కేవలం సమయం వృథా చేసే సాధనంగా కాకుండా యువత జీవితాల్లో వెలుగులు నింపే వేదికగా ఎలా మార్చవచ్చో నిరూపించిన ఈ తెలుగు యువకుడి ప్రయాణం నేటితరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
YUVA : రోజుకు 14 గంటల ప్రిపరేషన్ - 14 కేంద్ర సర్కార్ జాబ్స్‌తో సెన్సేషన్
YUVA : వ్యాధితో పోరాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న యువతి - సాయం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు

