ETV Bharat / state

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

తెలంగాణ నుంచి 538, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,345 మంది ఎంపిక - అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లలో ప్రతిభ కనబర్చిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

RELIANCE FOUNDATION
RELIANCE FOUNDATION (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 8:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

Reliance Foundation scholarships : రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటించిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఈ రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 1,883 మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 5,100 మంది విద్యార్థుల్లో (5,000 అండర్ గ్రాడ్యుయేట్, 100 పోస్ట్ గ్రాడ్యుయేట్) తెలంగాణ నుంచి 538 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,345 మంది ఉన్నారు. అత్యంత పోటీతో కూడిన జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియలో ఈ ఫలితాలు తెలుగు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.

పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే : ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అందించడమే ఈ స్కాలర్‌షిప్‌ల లక్ష్యం. ప్రతిభ మరియు ఆర్థిక స్థితి (మెరిట్-కమ్-మీన్స్) ఆధారంగా ఎంపిక చేసిన వారిలో 83 శాతం మంది విద్యార్థులు, వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాల నుంచే రావడం విశేషం. ఇందులో బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు కూడా తగిన ప్రాధాన్యం లభించింది.

లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ శిక్షణ : ఎంపికైన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఆర్థిక సాయంతో పాటు, విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేందుకు మెంటరింగ్, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ శిక్షణ, గ్లోబల్ అల్యూమిని నెట్‌వర్క్ సహకారం కూడా లభిస్తుంది.

ఈ స్కాలర్​షిప్​ మరింత ప్రోత్సాహం ఇస్తుంది : తెలంగాణ నుంచి ఎంపికైన వారిలో భద్రాచలానికి చెందిన రైతు బిడ్డ యర్ర షాలిని ఒకరు. ప్రస్తుతం పంజాబ్‌లోని ఐఐటీ రోపర్‌లో BSc, BEd కోర్సు చదువుతున్న షాలిని తన అనుభవాన్ని వివరించింది.

"మాలాంటి వ్యవసాయ కుటుంబాల పిల్లలకు ఆర్థిక ఇబ్బందులే ఉన్నత విద్యకు అడ్డంకిగా మారుతుంటాయి. ఈ స్కాలర్‌షిప్ వల్ల నేను నా చదువుపై పూర్తి దృష్టి పెట్టగలను. నా లక్ష్యాలను సాధించడానికి ఇది గొప్ప ప్రోత్సాహం, భవిష్యత్తులో కష్టపడి పనిచేసి సమాజానికి సేవ చేసేందుకు ఇది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది"- యర్ర షాలిని

33,471 రిలయన్స్ స్కాలర్​షిప్​లు : ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 33,471 స్కాలర్‌షిప్‌లను అందించి, వారికి అండగా నిలిచింది. రిలయన్స్ వ్యవస్థాపక ఛైర్మన్ దీరుభాయ్ అంబానీ దార్శనికత, నీతా అంబానీ 2022లో ప్రకటించిన 10 ఏళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌ల లక్ష్యంలో భాగంగా ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది.

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్​షిప్స్​- ఆ విద్యార్థులకు ఏకంగా రూ.6లక్షలు!

రిలయన్స్​ ఫౌండేషన్​ స్కాలర్​షిప్​ లిస్ట్ వచ్చేసింది - జాబితాలో మెరిసిన తెలుగు విద్యార్థులు