YUVA : ఒకే వాహనంలో ప్యాసింజర్లు, సరకు రవాణా - ఈ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్‌ని ఆవిష్కరించిన విద్యార్థి - 2 రకాలుగా వినియోగించేలా ఈవీ తయారీ - మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్‌లో శిక్షణ - 300 కేజీల బరువును మోసేలా ఈవీ తయారీ, ప్రత్యేకతలివే

Published : September 2, 2026 at 8:04 PM IST
|Updated : September 2, 2026 at 8:27 PM IST
Student Inventor Develops 2 in one EV : చాలామంది విద్యార్థులు చదువు, పరీక్షలకే పరిమితం అవుతుంటారు. కానీ, ఆ యువకుడు మాత్రం చదువులో మేటిగా ఉంటూనే సమాజానికి ఉపయోగపడే సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. రేయింబవళ్లు శ్రమించి ప్యాసింజర్ లోడ్ క్యారీర్ ఈవీ P.L.C.E.V అనే ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌ను రూపొందించాడు. ఒకే వాహనంలో ప్యాసింజర్లు, సరకు రవాణా చేసేలా డిజైన్‌ను పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. మరి ఎవరా యువ ఆవిష్కర్త? ఆ వాహనం విశేషాలేంటి? నేటి కథనంలోచూద్దాం.
మల్టీపర్పస్ ఈవీ ఆవిష్కరణ చేసిన విద్యార్థి : డిగ్రీలు పొందిన తర్వాత కొత్త ఆవిష్కరణలు చేయటం నిన్నటి మాట. కానీ, జెన్ జీ అందుకు పూర్తి భిన్నం. విద్యాభ్యాసం కొనసాగిస్తూనే సరికొత్త ఆవిష్కరణలు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే వాటిని రూపొందిస్తున్నాడు. ఇందుకు ఉదాహరణే ఈ యువకుడు. ప్రస్తుతం ప్యాసింజర్స్ కోసం, గూడ్స్ రవాణా చేయడానికి వేరువేరుగా వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాచ్ చేశాడీ యువకుడు. ఈ రెండు అవసరాలు తీర్చేలా మల్టీపర్పస్ ఈవీ వెహికల్ డిజైన్ చేశాడు.
ఎలక్ట్రిక్ వెహికల్‌పై ఉన్న ఈ యువకుడి పేరు పార్థసారథి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెద్ద వీరభద్రరావు, లావణ్య దంపతుల కుమారుడు. తండ్రి స్టిక్కరింగ్ వృత్తి, తల్లి గృహిణి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్-ఏటీసీ కేంద్రంలో మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. వైవిధ్యంగా ఏదైనా తయారు చేయాలన్న ఆసక్తితో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌ని రూపొందించాలని సంకల్పించాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల సపోర్ట్‌తో ప్రయాణికులతో పాటు సరకులు కూడా తరలించేలా నూతన ఆవిష్కరణ చేశాడు.
"ఈ ఈవీ వాహనం తయారు చేసేందుకు సుమారు ఏడాది కాలం పట్టింది. దీనిని రూపొందించేందుకు రూ.1.60 లక్షలు ఖర్చయ్యింది. నేను ఓ వైపు కళాశాలకు వెళుతూనే ఈవీని తయారు చేశాను. దీనిని అప్‌గ్రేడ్ చేసేందుకు కొంత ఫండ్ అవసరం ఉంది. ఈవీ వాహనం వల్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే తక్కువ ఖర్చుతోనే తయారు చేసేందుకు అవకాశముంటుంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని తయారు చేయాలని భావిస్తున్నాను. ఈ వాహనాన్ని టూ ఇన్ వన్‌గా ఉపయోగించుకోవచ్చు. నలుగురు ప్రయాణికులు, 300 కేజీల బరువున్న వస్తువులను మోయొచ్చు" -పార్థసారథి, ఈవీ రూపకర్త
ఈవీ ప్రత్యేకతలు ఇవే : ఈ వెహికల్ తయారీ కోసం అయాన్ బ్యాటరీ ప్యాక్, 48 వోల్ట్, 1.250 వాట్ల బీఎల్డీసీ మోటర్, 50 యాంపియర్ కంట్రోలర్, ఈ-రిక్షా వైరింగ్ హార్నెస్, స్టీరింగ్ ర్యాక్, డిఫరెన్షియల్, లైటింగ్ సిస్టమ్ వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించాడు పార్థసారథి. 300 కేజీల బరువును సునాయాసంగా మోస్తూ ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని అంటున్నారు. వేగంగా ఛార్జింగ్ కావడం, తక్కువ నిర్వహణ ఖర్చుతో పనిచేయడం లాంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నాడు.
ఈవీ తయారీకి లక్ష 65 వేల రూపాయలు ఖర్చయిందని చెబుతున్నాడీ యువ ఆవిష్కర్త. విద్యార్థులు కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం కాకుండా వినూత్న ఆవిష్కరణలు చేసేలా ఏటీసీ కేంద్రం ప్రోత్సహిస్తుందని చెబుతున్నాడు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో పర్యావరణ హితమైన వాహనం తయారు చేయాలనే ఆలోచనతోనే ఈ వెహికల్ తయారు చేసినట్లు వివరిస్తున్నాడు.
భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు : ఈవీని తయారు చేసేందుకు పార్థసారథికి ఏడాది సమయం పట్టింది. గ్రో గ్రీన్ గ్రో ఎలక్ట్రిక్ , ఈవీ జీరో ఎమిషన్, క్లీన్ ఎనర్జీ బ్రైట్ ఫ్యూచర్ లాంటి నినాదాలతో వెహికల్‌ని ఆవిష్కరించాడు. ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు ఫోర్ వీలర్ తయారీపై దృష్టి పెట్టానని చెబుతున్నాడు పుస్తకాల విజ్ఞానంతోనే సరిపెట్టుకోకుండా అన్నింటిలో నైపుణ్యం సాధిస్తే సరికొత్త ఆవిష్కరణలు రూపొందించవచ్చని చెబుతున్నాడీ యువ ఆవిష్కర్త. ప్రస్తుతం ఈ ఫోర్ వీలర్ వాహనం గంటకు 35కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని అంటున్నాడు పార్థసారథి. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు తయారు చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు.
YUVA : రోజుకు 14 గంటల ప్రిపరేషన్ - 14 కేంద్ర సర్కార్ జాబ్స్‌తో సెన్సేషన్
YUVA : వ్యాధితో పోరాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న యువతి - సాయం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు

