ETV Bharat / state

లద్దాఖ్ అందాలు చూడాలన్న కోరిక - బుల్లెట్‌పై నీరజ సుదూర ప్రయాణాలు

ఓ సంస్థలో బైక్‌ రైడింగ్‌ కోర్సులో చేరి మెలకువలూ నేర్చుకున్నా - ‘సగం నుంచే వెనక్కి వెళ్లిపోతుందిలే’ అని అనుకున్న - అంచనాలన్నీ తారుమారు చేస్తూ లద్దాఖ్ ప్రయాణం

Story on Neeraja Velamuri at Visakhapatnam
Story on Neeraja Velamuri at Visakhapatnam (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 3:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

Story on Neeraja Velamuri at Visakhapatnam: బుల్లెట్‌పై సుదూర ప్రయాణాలు చేస్తుంటే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. పైగా ఇవి ఎన్నో జీవిత పాఠాలనీ నేర్పుతున్నాయి అంటున్నారు నీరజ వేలమూరి. ఆమె లద్దాఖ్​ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నీరజది విశాఖపట్నం. అమ్మ పద్మావతి. నాన్న మూర్తి. ఉద్యోగరీత్యా అసోం, దిల్లీ, విశాఖ తదితర ప్రాంతాల్లో చదువు సాగింది. ఈమె ఇందౌర్‌ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసింది. నాన్నకు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. బుల్లెట్‌పై లద్దాఖ్‌ వెళ్లాలనేది ఆయన కల. బాధ్యతల వల్ల వీలు పడలేదు. కానీ ఆ విశేషాల్ని గురించి తరచుగా చెబుతుండేవారు. దాంతో బైక్‌ రైడింగ్‌ మీద ఇష్టం ఏర్పడటంతో పాటు నాకూ లద్దాఖ్‌ అందాలు చూడాలన్న కోరిక బలపడింది అన్నారు.

అప్పుడే నేర్చుకున్నా: నీరజ తొమ్మిదో తరగతిలోనే స్కూటీ నడపడం నేర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ల అన్నయ్య సహాయంతో బైక్‌ నడపడం నేర్చుకున్నారమె. ఓ సంస్థలో బైక్‌ రైడింగ్‌ కోర్సులో కూడా నీరజ చేరారు. అక్కడే మెలకువలూ అన్ని నేర్చుకున్నాను అని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా గురుగ్రామ్‌లో ఉంటున్నారు. బైక్‌ రైడ్స్‌ అంటే ఇష్టమే కానీ, మొదట్లో ఎలా, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలన్న స్పష్టత లేదని ఆమె అన్నారు.

Story on Neeraja Velamuri at Visakhapatnam
బుల్లెట్‌ బైక్​పై సుదూర ప్రయాణాలు చేస్తున్న నీరజ (Eenadu)

ఈ క్రమంలో ఓ రోజు తన సహోద్యోగులు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు బైకుల మీద వెళ్తున్నారని తెలియడంతో వాళ్లతో నేను వస్తా అని అడిగింది. ‘అమ్మాయి అంత దూరం బైక్‌ ఏం నడుపుతుంది’ అనుకున్నారంతా. ‘సగం నుంచే వెనక్కి వెళ్లిపోతుందిలే’ అని అనుకున్న వాళ్లూ లేకపోలేదు. వాళ్ల అంచనాలన్నీ తారుమారు చేస్తూ రిషికేశ్‌ మొత్తం చుట్టొచ్చింది. అలా 2025 ఏప్రిల్‌ నాటికి కల్లా గంగోత్రి, పంజాబ్‌లోని అమృత్‌సర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలి ఇలా దాదాపు 4వేల కి.మీ. బైక్‌ మీద ప్రయాణించింది.

ఈ ప్రయాణాల కోసం నీరజ వాళ్ల నాన్న బైక్​నే వాడుతున్నారు. ఆయన ఈ బైక్​ను 45 ఏళ్లు వచ్చాక చాలా ఇష్టపడి కొనుక్కున్నారు. నేను ఉద్యోగం చేస్తూనే దీన్నో ఒక హాబీగా కొనసాగిస్తున్నానని నీరజ అన్నారు. ఇటీవల అనుకోకుండా నేను కలలు కన్న లద్దాఖ్‌కు వెళ్లే అవకాశం కూడా వచ్చిందని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కష్టాలను అధిగమిస్తూ: ఎండ, వాన, కొన్నిసార్లు సున్నా కంటే తక్కువ డిగ్రీ ఉష్ణోగ్రతలు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్‌ లా చేరుకునే క్రమంలో మాకు ఎదురైన వాతావరణ పరిస్థితులు ఇవి అని ఆమె చెప్పారు. ఈ ప్రాంతం 19,024 అడుగుల ఎత్తులో ఉంది. గురుగ్రామ్‌ నుంచి రానూపోనూ 4300 కిలో మీటర్లు 17 రోజులపాటు సమయం పట్టిందన్నారు. ఒక్కోసారి 300 నుంచి 400 కి.మీ. వరకూ పెట్రోల్‌ బంకులు ఉండేవి కాదని చెప్పారు. వెళ్లే మార్గం మంచుతో మూసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయన్నారు. దాంతో రెండు, మూడు రోజులు టెంట్లలోనే గడిపామని చెప్పారు. టైరులో గాలి తగ్గించి మంచుతో నిండిన రహదారిలోనూ ప్రయాణం చేశామని నీరజ అన్నారు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని నీరజ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నో పాఠాల్నీ నేర్చుకున్నానని, ఓపిక, సహనం, రక్షణ, కష్టం-సుఖం వంటివి ఈ ప్రయాణంలో నేర్చుకున్నానని ఆమె చెప్పారు. తొందరలోనే నాన్నను లద్దాఖ్‌ తీసుకువెళ్తానన్నారు.

ఓ వైపు కళా, మరోవైపు క్రీడలు - మల్టీ టాలెంటెడ్‌గా సత్తా చాటుతున్న అక్షర

కష్టపడింది, కల నెరవేర్చుకుంది - పెళ్లి ఒత్తిడి తట్టుకొని కానిస్టేబుల్​గా ఎంపికైన కల్పన