‘జ్ఞానాపురం' 150 ఏళ్ల నాటి చరిత్ర - వారి సేవలకు 'వీధికో పేరు' - పేరుకో ప్రత్యేకత!
విశాఖలో ఒక చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా జ్ఞానాపురం - చెన్నై, కేరళ, బెంగళూరు, గుంటూరుతో పాటు, విదేశాల్లో మిషనరీలకు చెందిన ఫాదర్లు విశాఖ చర్చిల నిర్మాణానికి కృషి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 10:17 AM IST
|Updated : December 28, 2025 at 11:02 AM IST
History of Visakhapatnam Street Names: విశాఖ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, గ్లాస్ బ్రిడ్జి. వీటితో పాటు ఇక్కడ ఉన్న ఓ వీధికి చారిత్రక నేపథ్యం ఉందడోయ్. నగరంలో ఈ ప్రదేశం పురాతన ప్రాంతంగా ప్రసిద్ధి. ఇది శతాబ్థాల నాటి చరిత్రను కలిగి ఉంది. క్యాథలిక్ సమాజాలకు ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఉంటుంది. ఇది విశాఖ రైల్వే స్టేషన్‌కు దగ్గరగానే ఉంటుంది. అసలు ఆ వీధి పేరు ఏంటి? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విలేజ్ ఆఫ్ విజ్డమ్: విశాఖలో ‘జ్ఞానాపురం’ పేరు తెలియని వారంటూ ఉండరు. ఆ ప్రాంతాన్ని రోమన్ క్యాథలిక్ క్రైస్తవ విశ్వాసులు రోమ్ పట్టణంగా భావిస్తుంటారు. ఇక్కడున్న పునీత పేతురు ప్రధాన దేవాలయానికి ఏకంగా 150 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో బిషప్ టిస్సో ఈ ప్రాంతానికి ‘జ్ఞానాపురం (విలేజ్ ఆఫ్ విజ్డమ్)’ అని పేరు కూడా పెట్టారు.
జ్ఞానాపురం చరిత్ర: ఇది చారిత్రక రోమన్ క్యాథలిక్ మిషన్ ద్వారా 1880లో ఫ్రాన్సిస్ డి సేల్స్ స్థాపించారు. ఇక్కడ సెయింట్ పీటర్స్ హైస్కూల్ వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇది నగరంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానించి ఉంటుంది. నగరంలోనే అతి పురాతన ప్రాంతాల్లో ఒకటిగా జ్ఞానాపురాన్ని చెబుతుంటారు.
జ్ఞానాపురం ఆంగ్లో-ఇండియన్, క్యాథలిక్ సమాజాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. చర్చిలు, విద్యా సంస్థలతో బాగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం సంప్రదాయాలను పాటిస్తూనే ఆధునికతను స్వీకరించింది. ఇక్కడ ప్రత్యేకించి క్రిస్మస్ సమయంలో పండుగ వేడుకలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ ప్రాంతంలో నేటికి ఆంగ్లో-ఇండియన్ల సంప్రదాయాలు సజీవంగానే ఉన్నాయి.
నేటికీ ప్రాచుర్యంలో పేర్లు: బెంగళూరు, చెన్నై, కేరళ, గుంటూరుతో పాటు, విదేశాల్లో మిషనరీలకు చెందిన ఫాదర్లు విశాఖ వచ్చారు. వారు ఇక్కడ జ్ఞానాపురంతో పాటు చర్చిల నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారు. ఆ కృషికి నిదర్శనంగా స్థానిక వీధులకు, కాలనీలకు వారి పేర్లు కూడా పెట్టారు. ఇప్పటికీ ఆ పేర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవే ‘‘రే, బరిల్, సిరిల్, మాన్యువల్, రోసిలియన్,రసా, నికోలస్, డయాస్, వడిచర్ల, సెబాస్టియన్, మైపాన్‌పాల్, రావులపల్లి వీధులు, ఏకేఎంకాలనీలు’ ఇవన్నీ 150 ఏళ్ల చరిత్రను కలిగి ఉన్నాయి.
కొందరి సేవలు ఇలా:-
- బిషప్ ‘రోసిలియన్’(1899- 1910): బిషప్ పేతురు చర్చిలో స్లీవగుర్తు మండపం నిర్మించారు. చర్చిల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. నగరంలో స్థానిక వీధికి 'రోసిలియన్' అనే పేరు కూడా పెట్టారు.
- ఫాదర్ ‘సిరిల్’ : ప్రస్తుత ఫాదర్ల నివాస గృహం, చర్చి నిర్మాణంతో పాటు రక్షణగిరి పుణ్యక్షేత్రంపై క్రీస్తు తిరుహృదయ స్వరూపాన్ని ఫాదర్ సిరిల్ స్థాపించారు.
- బ్రదర్ ‘నికోలస్’ : నేటి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్, సెయింట్ అలోషియస్, విశాఖపురి మేరిమాత పుణ్యక్షేత్రం నిర్మించారు. ఈ నిర్మాణాలు అన్నింటికి బ్రదర్ నికోలస్ ఇంజినీర్‌గా పని చేశారు.
- ఫాదర్ ‘వడిచర్ల’ జోసెఫ్ (1935-1943) : ఆయన మొదటి తెలుగు ఫాదర్. క్రైస్తవుల ఐక్యత కోసం ‘ఆంధ్ర కథోలిక అసోసియేషన్’ వడిచర్ల జోసెఫ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్యారిస్ పాస్టల్ కౌన్సిల్ (PPP)గా పేరు మార్చారు.
- ఫాదర్ ‘సెబాస్టియన్’ : ఆయన క్రైస్తవ సంఘాల ఏర్పాటుకు పునాదులు వేశారు.
- ఆర్చి బిషప్ కాగితపు మరియదాసు : ఆయన జ్ఞానాపురంలో జన్మించారు. విశాఖ అగ్రపీఠాధిపతి అయ్యారు. జూబ్లీ పాఠశాల, బీడీఈ, సోఫియా కళాశాలలు నిర్మించారు.
నేటికి విశాఖలో జ్ఞానాపురం ఒక చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా చెబుతుంటారు. అప్పట్లో వారి చేసిన కృషికి గానూ స్థానిక వీధులు, కాలనీలకు ఉన్న పేర్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

