హోళీ స్పెషల్ : సహజ రంగులు వాడండి - చర్మాన్ని కాపాడుకోండి
భారత సంస్కృతిలోకి రంగుల సందడి - చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సంబురాలు - కళ్లు, చర్మంపై ప్రభావం చూపుతుందని నిపుణుల హెచ్చరిక - ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్

Published : March 2, 2026 at 2:42 PM IST
Holi Feast And Precautions Telugu : హోళీ అంటే కేవలం పండుగ కాదు, అది ఒక ఫీలింగ్! ఒక వైబ్! ఒక కలర్ బ్లాస్ట్. చెడుపై మంచి గెలిచిందనే సింబల్‌గా మొదలైన ఈ పండుగ దానితో పాటు ఇప్పుడు ఫ్రెండ్షిప్, ఫన్‌కు సింబల్‌గా మారిపోయింది. ఒక రోజైనా 'ఆల్ టెన్షన్స్ ఆఫ్ - హ్యాపీనెస్ ఆన్' మోడ్‌లోకి వెళ్లిపోతారు. అయితే ఈ సంబురంలోనే ప్రమాదం సైతం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏంటి ? పండుగ నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సందడి : వసంత ఋతువు వచ్చిందంటే ప్రకృతి కొత్త రంగులతో అలరారుతుంది. అదే రంగుల సందడిని మన సంస్కృతిలోకి తీసుకొచ్చిన హోళీ పండుగ. చెడుపై మంచి గెలిచిన జ్ఞాపకంగా జరుపుకునే ఈ పండుగకు పురాణాలలో విశేష ప్రాధాన్యం ఉంది. భక్త ప్రహ్లాదుడి భక్తి, హోలిక దహనం కథ మనకు ధర్మం ఎప్పటికీ నిలుస్తుందనే సందేశం ఇస్తుంది. భారత్ ఆద్యంతం హోళీ ఆనంద తరంగాలు పంచుతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగిపోయే అపురూపమైన పండుగ ఇది.
మనసుల మధ్య దూరాలను చెరిపేలా : హోళీ అంటే రంగుల హరివిల్లు. ఉదయం నుంచే స్నేహితులు, కుటుంబ సభ్యులు పరస్పరం రంగులు రాసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. నీటి బెలూన్లు, పిచ్కారీలతో పిల్లల సందడి వేరేలా ఉంటుంది. కొందరు పూలతో చేసిన సహజ రంగులను ఉపయోగిస్తారు. పూలు, పసుపు, కుంకుమ వంటి సహజ వనరులతో తయారైన రంగులు చర్మానికి హానికరం కావు. ప్రేమతో రాసిన రంగు మనసులను దగ్గర చేస్తుందనే నమ్మకంతో ఈ పండుగను జరుపుతారు. మనసుల మధ్య దూరాలను చెరిపేసేందుకు సమాజం ఈ పండుగను నడిపిస్తుంది అనేది జన నానుడి.
పిల్లల చర్మంపై ఈ ప్రభావం : ఆధునిక కాలంలో రసాయనాలతో తయారైన రంగులు ఆరోగ్యానికి హానికరం అవుతున్నాయి. తక్కువ ధరకు లభించే ఈ రంగుల్లో సీసం, క్రోమియం వంటి హానికర లోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి చర్మ అలర్జీలు, కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తాయి. పిల్లల సున్నితమైన చర్మంపై ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుంది. ఆనందం కోసం వేసుకునే రంగు ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
సహజ రంగులనే వినియోగిద్దాం : సురక్షిత హోళీ కోసం సహజ రంగులనే ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లోనే పసుపు, కుంకుమ, చందనం, పూల పొడి వంటివాటితో రంగులు తయారు చేసుకోవచ్చు. చర్మానికి నూనె రాసుకోవడం, కళ్లకు గాగుల్స్, జుట్టుకు కవర్ ఉపయోగిస్తే రక్షణ ఉంటుందని చెబుతున్నారు. పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. హోళీ మన సంస్కృతి, మన ఆనందం, మన ఆరోగ్యం దాంతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత కూడా అని గుర్తించి జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
"హోళీ పండగను దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దలదాకా అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజున రంగులు చల్లుకోవడం ఆనవాయితీ. దీనికోసం ప్రతి ఒక్కరూ సహజమైన రంగులను వాడాలి. రసాయనలతో కూడిన వాటిని వినియోగించరాదు. ఈ తరహా రంగుల వల్ల చర్మ సంబంధ వ్యాధులు, స్కిన్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదముంది. శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు ఈ రంగులు కళ్లో పడితే దృష్టి సమస్యలు కూడా రావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని కళ్లలో పడిన వెంటనే నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అప్పటికీ సమస్యగా అనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలి." - రాజలింగం, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్
వైరల్ ఫొటో : 28 ఏళ్ల క్రితం హోలీ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి - ఎక్కడున్నారో గుర్తుపట్టారా?

