ETV Bharat / state

ఐనంపూడిలో పదిన్నర ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు - పనులు ప్రారంభం

యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి తోడ్పాటు అందించేలా ఈ పార్కులు - కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఐనంపూడిలో పదిన్నర ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు

Msme Park Ainampudi
Msme Park Ainampudi (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 7:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

MSME Park Ainampudi : కృష్ణా జిల్లాలోని యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని సాధించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి తోడ్పాటు అందించేలా ఈ పార్కులు, ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కొన్నిచోట్ల పనులు జరుగుతుండగా మరికొన్ని చోట్ల స్థలాల విషయంలో వెనకడుగు పడుతోంది.

స్థానికుల హర్షం: కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఐనంపూడిలో పదిన్నర ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు భూమి కేటాయించి 11.3 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇక్కడ 7 ఎకరాల్లో భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. 32 షాపులు ఒక్కోటి 10 మీటర్ల వెడల్పు, 8.3 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. 40 అడుగుల రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వాటిపై మెట్లు వాహనాలు తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని వీరపనేనిగూడెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు మూడో దశకు సంబంధించి 46.9 ఎకరాల్లో రూ.14.7 కోట్లతో పనులు చేపట్టారు. తొమ్మిది మినహా అన్నీ ప్లాట్లు భర్తీ అయ్యాయి. పారిశ్రామిక పార్కులో వసతుల కల్పన, భవన నిర్మాణాలు జరగుతున్నాయి. సుమారు వెయ్యి మందికి ఇక్కడ ఉపాధి లభించనుంది. ఐనంపూడిలో పార్క్ నిర్మాణ పనుల ప్రారంభంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐనంపూడిలో 2026 మార్చి నాటికి ఎంఎస్‌ఎంఈ పార్కు పనులు పూర్తి చేసేలా చర్యలు (ETV)

స్థలాల విషయంలో తర్జనభర్జన: పామర్రు, గన్నవరం మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో స్థలాల విషయంలో అధికారులు, పాలకులు తర్జనభర్జన పడుతున్నారు. మచిలీపట్నం పోర్టు సమీపంలోని ముడా భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పెడన నియోజకవర్గం బంటుమిల్లి వద్ద ఉప్పు శాఖ పరిధిలోని భూమి పరిశీలనలో ఉండగా ఆ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. గుడివాడ, తాడిగడపలో వక్ఫ్​ భూములు గుర్తించగా అవనిగడ్డ పరిధిలో దేవాదాయశాఖ స్థలాన్ని పరిశీలించారు. వీటికి అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికారులు గుర్తించిన భూములు చాలా వరకు ఆక్రమణల్లో ఉన్నాయి.

ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు: ఐనంపూడి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని వివరించారు. ఈ పార్కులో 27 వేల చదరపు అడుగుల వైశాల్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 300 మీటర్ల పరిధిలోనే హైవేకు కనెక్టివిటి ఉందన్నారు.

175 నియోజకవర్గాల్లో దశల వారీగా: రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దశల వారీగా ఎంఎస్‌ఎంఈ పార్కులు/ ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్సులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 56 పార్కులను అభివృద్ధి చేస్తోంది. మొత్తం 175 పార్కుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 122, ప్రైవేటు భాగస్వామ్యంతో 53 పార్కులను అభివృద్ధి చేయాలనుకుంది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను రుణంగా తీసుకునేందుకు ఏపీఐఐసీకి ప్రభుత్వం అనుమతించింది.

మొదటి దశలో 56 పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందులో 11 పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 39 పార్కులకు ఆయన శంకుస్థాపన చేశారు. మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక పార్కులు ఉన్నాయి. మరో మూడు చోట్ల మౌలిక సదుపాయాలను కల్పించింది. మిగిలిన పార్కుల అభివృద్ధికి అవసరమైన భూములను సేకరించడంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే పార్కులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది.

ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలు - 42 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగుప్రజలు

ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలు - 42 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగుప్రజలు