45 నిమిషాల ఛార్జింగ్‌తో 250 కి.మీ ప్రయాణం - ఆర్టీసీలోకి అధునాతన ఈవీ బస్సులు
ఈవీ బస్సుల వినియోగంలో ఎదురవుతున్న ఛార్జింగ్ కష్టాలకు ఇక చెక్ - త్వరలో అందుబాటులోకి రానున్న అధునాతన విద్యుత్తు బస్సులు - కేవలం 45 నిమిషాల ఛార్జింగ్‌తో 250 కి.మీ ప్రయాణించే సామర్థ్యం

Published : February 28, 2026 at 2:41 PM IST
TGSRTC To introduce More EV Buses : ఈవీ బస్సుల వినియోగంలో గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీకి ఎదురవుతున్న ఛార్జింగ్ కష్టాలు ఇకపై తీరనున్నాయి. కేవలం 45 నిమిషాల ఛార్జింగ్‌తో 250 కి.మీ ప్రయాణించే అత్యాధునిక బస్సులు త్వరలో ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు 1085 ఈవీ(విద్యుత్ బస్సులు) సరఫరా, నిర్వహణ కోసం తన అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ లిమిటెడ్ ద్వారా రెండు కాంట్రాక్టులను(ఎల్ఓఏ) ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థ దక్కించుకుంది. అన్నీ అనుకూలిస్తే ఈ ఈవీలను 20 నెలల్లో విడతల వారీగా ఆర్టీసీ సంస్థకు అందించనుంది. ఇందులో అధికభాగం బస్సులను హైదరాబాద్ నగరంలోనే నడిపే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు వివరించారు.
అందుబాటులోకి 175 కొత్త బస్సులు : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వివిధ మార్గాల్లో 325 ఈవీ బస్సులు నడుస్తుండగా మరో 175 కొత్తబస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఉన్న బస్సులు ఛార్జింగ్ కోసం గంటర్నర సమయం పాటు అధిక సమయాన్ని తీసుకుంటున్నాయి. ఫుల్ ఛార్జింగ్ చేసినట్లయితే కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే వెళ్తున్నాయి. బీహెచ్ఇఎల్, మియాపూర్ డిపోల నుంచి విజయవాడతో పాటు పలు జిల్లాలకు వెళ్లే బస్సులు ఛార్జింగ్ కోసమని మార్గమధ్యలో నిలపడం వల్ల ప్రయాణికులు వేచిచూడాల్సి వస్తోంది.
మరిన్ని ప్రత్యేకతలివే : ఆయా బస్సుల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లోర్ డిజైన్ : ఈ బస్సులు కేవలం 400 మిల్లీమీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉండటంతో వృద్ధులు, చిన్న పిల్లలు, వృద్ధులు బస్సు ఎక్కడం, దిగడమనేది చాలా సులువు అవుతుంది.
స్పీడ్, పికప్ : కేవలం 10.5 సెకన్లలోనే 30 కిలోమీటర్ల వేగాన్ని ఈ బస్సులు అందుకోవడం వీటి ప్రత్యేకత.
అడ్వాన్స్ బ్రేకింగ్ : ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన అడ్వాన్స్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా జడత్వ సమస్యలు ఉండవు.
బ్యాటరీ టెక్నాలజీ : మంటలు అంటుకోకుండా, ఎక్కువ కాలం మన్నే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్‌ఎఫ్‌పీ) బ్యాటరీలను ఈ తరహా బస్సుల్లో వినియోగిస్తున్నారు.
కుదుపుల్లేని ప్రయాణం : వాహనం ముందు, వెనక భాగాల్లో అడ్వాన్స్‌డ్ ఎయిర్ సస్పెన్షన్ ఉండటంతో కుదుపులు ఉండవు. దీనివల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాలు ఈవీ బస్సులు, ఇతర వాహనాల కొనుగోళ్లకు సంబంధించిన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అదేవిదంగా పలు రాయితీలను కూడా కల్పిస్తుండటంతో కొనుగోళ్లు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్ట్యాక్స్లు మినహాయింపులు ఇస్తున్న కారణంగా ప్రజలు కూడా అధికంగా ఈవీలు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మరిన్ని కొత్త ఈవీ బస్సులు : డీజిల్ ఇంధనంతో నడిచే వాటితో పోలిస్తే ఒక ఈవీ బస్సు రోజులో ఒక టన్ను కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుంది. పుష్పక్ బస్సులతో కలిపి మొత్తం 385 ఈవీ బస్సులు నగరంలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో మరో 150 ఎలక్ట్రిక్ బస్సులు రానున్న క్రమంలో కర్బన ఉద్గారాల స్థాయి భారీగా తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. రెండేళ్లలో మరో 2,500 రోడ్డెక్కించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో నగరంలో మొత్తం అవే దర్శనమివ్వనున్నాయి. వీటితో పాటు పలు వ్యక్తిగత వాహనాలు సైతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో 2 లక్షలకు పైగా బైక్‌లు, 30 వేల కార్లు రోడ్డెక్కాయి. డీజిల్, పెట్రోల్ కారుతో పోల్చితే ఈవీ కారు రోజులో 38 నుంచి 40 కేజీల కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుంది.
భాగ్యనగరానికి మంచి రోజులు! - పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - ఆ బస్సుల్లో టికెట్ ధరల తగ్గింపు - మార్చి 1 నుంచే అమల్లోకి

