ETV Bharat / state

ఆందోళన వద్దు - ఆ జిల్లాల్లో ఎవరికీ బర్డ్ ఫ్లూ సోకలేదు: ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్

ఓ యువకుడికి ఏవియన్ ఇన్ఫ్లూంజా సోకినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడి - నమూనాను ల్యాబ్లో పరీక్షించగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్న వీరపాండియన్

State Health Commissioner Veerapandian Clarity on Bird Flu in AP
State Health Commissioner Veerapandian Clarity on Bird Flu in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 10:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

State Health Commissioner Clarity on Bird Flu in AP : చిత్తూరు, అన్నమయ్య ఇతర జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఎవరికీ సోకలేదని ఎక్కడా మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి ఏవియన్ ఇన్​ఫ్లుయంజా సోకినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాను వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఒక ప‌్రకటనలో తెలిపారు.

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు వచ్చిన బర్డ్ ఫ్లూ మనుషుల వరకు రాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని వీరపాండియన్ పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి ఓసెల్టామివర్ మాత్రలను అందచేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎన్. 95 మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. లోతైన సర్వైలెన్స్​లో భాగంగా క్షేత్రస్థాయిలోని పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ప్రభావిత గ్రామాల్లోని కుటుంబ సభ్యుల నుంచి వైద్య సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించినట్లు వెల్లడించారు.

54 రిపోర్టుల్లోనూ నెగిటివ్ : ఈ క్రమంలో అనుమానిత లక్షణాలు కలిగిన వారి నుంచి సేకరించిన నమూనాలను తిరుపతిలోని స్విమ్స్ ల్యాబ్లో పరీక్ష చేయించగా ఇప్పటివరకు వచ్చిన 54 రిపోర్టులూ నెగిటివ్ ఉన్నాయని తెలిపారు. ముందు జాగ్రత్తగా చిత్తూరు, మదనపల్లె పట్టణాల్లోని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పడకలు సిద్ధం చేశామని తెలిపారు. ఏవియన్ ఇన్​ఫ్లుయంజా అనేది పక్షులకు సంబందించినదని, నిర్దిష్ట ప్రమాణాలు పాటించి సరైన రీతిలో వండిన కోడి మాసం, గుడ్లు వినియోగం సురక్షితమేనని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు వర్చువల్ విధానంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షలు జరుపుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్వైలెన్స్ పటిష్టతపై సలహాలు, సూచనలు ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను గమనిస్తున్నారని వెల్లిడించారు. దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం జిల్లాల్లో పర్యటిస్తోందని వీరపాండియన్ పేర్కొన్నారు.

పెద్ద సంఖ్యలో నాటుకోళ్లు మృతి : అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభవారిపల్లె గ్రామాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో నాటుకోళ్లు మరణించాయి. పశుసంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమై ఆ కోళ్ల నమూనాలను భోపాల్‌ ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ ల్యాబ్‌కు పంపించారు. పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లెలో చనిపోయిన కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. మరోవైపు మదనపల్లె మండలంలో మృతి చెందిన కోళ్లను కొత్తవారిపల్లె పంచాయతీ సీటీఎం పెద్దచెరువులో వేయగా అధికారులు అప్రమత్తమై గుంతలు తవ్వి పూడ్చారు.

బర్డ్‌ ఫ్లూపై వదంతులు, అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మదనపల్లెలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. అనుమానాల నివృత్తికి 70139-14401, 93982-62752 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. 100 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలో ఉడికించిన చికెన్, గుడ్లు తినడం సురక్షితమని, సగం వండిన మాంసం, గుడ్లు తినవద్దని అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో ఇటీవల కోళ్ల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఇక్కడి నమూనాల్నీ భోపాల్‌ ల్యాబ్‌కు పంపించారు.

బర్డ్‌ఫ్లూపై ఎవరికీ ఆందోళన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

తమిళనాడును వణికిస్తున్న బర్డ్ ఫ్లూ - ఆ గుడ్లను తినొద్దని ఆరోగ్య మంత్రి సూచన