రాష్ట్రంలో తొలిసారి నీటి బడ్జెట్! - 2026-27 సంవత్సరానికి రూపొందించిన ప్రభుత్వం
2026-27 నీటి సంవత్సరానికి బడ్జెట్ రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం - రైల్వే, వ్యవసాయ రంగాల తరహాలో తొలిసారి నీటి బడ్జెట్‌కు శ్రీకారం - నీటి లభ్యత, అవసరాలను లెక్కలు కడుతూ అంచనాలు సిద్ధం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 9:33 AM IST
Andhra Pradesh Water Budget : 2026-27 నీటి సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జలవనరులశాఖ తొలిసారి ఈ నీటి బడ్జెట్‌ను తయారుచేసింది. ఈ మేరకు వచ్చే నీటి సంవత్సరంలో నీటిలభ్యతను 15 వందల 65 టీఎంసీలుగా, అవసరాలను 14 వందల 90 టీఎంసీలుగా అంచనాలు రూపొందించారు.
రైల్వే, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక బడ్జెట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా నీటి బడ్జెట్‌కు శ్రీకారం చుడుతోంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు నీటి అవసరాలు, లభ్యత వంటి లెక్కలతో బడ్జెట్ లెక్కలు వేశారు. అసలు నీటి లభ్యతను ఎలా లెక్క కడతారనే సందేహాలు రావడం సహజమే. సాధారణంగా జిల్లాల్లో నీటి అభివృద్ధి మండలి సమావేశాల సమయంలో నదీ బోర్డుల్లో ముందే నీటి అంచనాలు లెక్కిస్తారు.
పాత సంవత్సరాల్లో నీటి లభ్యత సరళి ఆధారంగా లెక్కలు కడతారు. ఈ అంచనాలు ఒక్కోసారి సరిపోవచ్చు, తప్పనూవచ్చు. వాతావరణ పరిస్థితులనూ అంచనాలోకి తీసుకుంటారు. ఆ రకంగా లెక్కించి రాష్ట్రంలోని నదుల్లో వచ్చే నీటి సంవత్సరంలో 15 వందల 65 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కలు వేశారు. అన్నీ పోనూ 2027 రబీ ముగిసే సమయానికి 75 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయనేది జలవనరులశాఖ ప్రస్తుత లెక్క.
జనవరి 1 నాటికి 504 టీఎంసీలు : ప్రస్తుత నీటి సంవత్సరంలో 2026 జనవరి 1 నాటికి 504 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో 475 టీఎంసీలు, మధ్యతరహా ప్రాజెక్టుల్లో 29 టీఎంసీలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 11 వందల 6 టీఎంసీలు. ఈ రిజర్వాయర్లలో వినియోగించుకునేందుకు నిల్వ చేయదగ్గ నీరు 846 టీఎంసీలు కాగా మిగిలిన నీళ్లు డెడ్ స్టోరేజీ కింద లెక్క.
ఈ మే నెలాఖరు వరకు రాష్ట్రంలో 412 టీఎంసీల నీటి అవసరాలు ఉంటాయన్నది అధికారుల అంచనా. రబీ సాగుకు 318 టీఎంసీలు, పరిశ్రమలకు 17 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 77 టీఎంసీలు అవసరమవుతాయి. అన్నీ పోను వచ్చే నీటి సంవత్సరం ప్రారంభం నాటికి 133 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉంటాయి. పులిచింతలలో ఉన్న 41 టీఎంసీలను కలిపి ఈ లెక్కలు వేశారు. వచ్చే ఖరీఫ్ ముందుగా ప్రారంభించేందుకు వీలవుతుందని అంచనా.
రాష్ట్రంలో నీటి బడ్జెట్ లెక్కలు : రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా, APSIDC కింద నీటి లభ్యత ఉన్న ఆయకట్టు 106 లక్షల 54 వేల ఎకరాలు ఉంది. 2026-27 ఖరీఫ్ సాగుకు భారీ, మధ్య తరహా కింద ప్రతిపాదన 62 లక్షల 15 వేల ఎకరాలు కాగా, ఖరీఫ్ నీటి డిమాండ్ 760 టీఎంసీలుగా లెక్కలు కట్టారు. రబీ ఆయకట్టు ప్రతిపాదన 26 లక్షల 77 వేల ఎకరాలు కాగా రబీ నీటి అవసరాలు 343 టీఎంసీలుగా అంచనా వేశారు.
అటు చిన్న నీటి వనరుల కింద ఆయకట్టు ఖరీఫ్ ప్రతిపాదన 12 లక్షల 50 వేల ఎకరాలుగా, వీటికి నీటి డిమాండ్ 155 టీఎంసీలుగా లెక్క వేశారు. APSIDC పథకాల కింద ఖరీఫ్‌లో ఆయకట్టు ప్రతిపాదన 6 లక్షల 77 వేల ఎకరాలుగా, నీటి అవసరాలు 47 టీఎంసీలుగా అంచనా కట్టారు. తాగునీటి అవసరాలు 157 టీఎంసీలు, పరిశ్రమలకు 28 టీఎంసీలుగా లెక్కలు వేశారు. మొత్తం నీటి అవసరాలు 14 వందల 90 టీఎంసీలుగా అంచనా వేస్తున్నారు.
అందుబాటులో అవసరాలకు సరిపడా నీరు : గడిచిన ఐదేళ్లలో సగటున రాష్ట్రంలో అన్ని వనరుల నుంచీ కలిపి 2 వేల 308 టీఎంసీల నీటి లభ్యత ఉంది. భారీ జలాశయాల్లో 18 వందల 15 టీఎంసీలు, మధ్యతరహా జలాశయాల్లో 493 టీఎంసీల లభ్యత ఉంది. ఆ లెక్కన వచ్చే నీటి సంవత్సరంలో 15 వందల 65 టీఎంసీల లభ్యతను జలవనరులశాఖ అంచనా వేసింది. అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండటమే కాకుండా మిగులు కూడా ఉంటుందనేది వారి లెక్క. ఆ లెక్కలకు మరిన్ని తుది మెరుగులు దిద్దుతున్నారు.
ఆదివారమే కేంద్ర బడ్జెట్- జనవరి 28 నుంచే పార్లమెంట్ సమావేశాలు!
ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి - 'థాంక్యూ డిప్యూటీ సీఎం సార్' అంటూ ప్లకార్డులు

