ETV Bharat / state

ఆ జాబితాలో ఉన్న లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు - ఏడాదికి 4.50 లక్షల చొప్పున కేటాయింపు

ఏడాదికి 4.50 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు - వచ్చే రెండేళ్లలో కేటాయించనున్న ప్రభుత్వం - సొంత స్థలం ఉండి ఇళ్లు లేనివారిని ఎల్​-1లో చేర్చిన అధికారులు

Indiramma Houses For L1 Beneficiaries
Indiramma Houses For L1 Beneficiaries (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : December 29, 2025 at 10:29 AM IST

|

Updated : December 29, 2025 at 10:55 AM IST

3 Min Read
Choose ETV Bharat

Indiramma Houses For L-1 Beneficiaries : రాబోయే రెండేళ్లలో ఎల్​-1 జాబితా లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి గానూ 4.50 లక్షల ఇళ్ల చొప్పున పథకం లబ్ధిదారులకు కేటాయించనుంది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి మొత్తం 77,68,134 దరఖాస్తులు వచ్చాయి. ఇంటింటి ఫ్యామిలీ సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్​-1, ఎల్​-2, ఎల్​-3లుగా విభజించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వారిని ఎల్​-1 జాబితాలో అధికారులు చేర్చారు. ఇందులో 23,20,490 మంది దరఖాస్తుదారులు ఉన్నారు.

ఎవరు ఏ జాబితాల్లో ఉన్నారంటే? : స్థలాలతో పాటు ఇళ్లు లేనివారిని ఎల్‌-2 జాబితాలో చేర్చారు. అలాంటి వారు 21,49,476 మంది ఉన్నారు. దారిద్య్ర రేఖ (బీపీఎల్​ కుటుంబాలు)కు ఎగువన ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు కలిగిన వారు, ఆదాయపు పన్ను పరిధిలోని వారిని ఎల్‌-3 కేటగిరీగా గుర్తించారు. ఈ తరహా వారు 32,98,168 మంది ఉన్నారు. ప్రజాపాలన అర్జీలు మాత్రమే కాకుండా తర్వాత ఇళ్ల కోసం మరో 1,66,664 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేవలం ఎల్‌-1 (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు) జాబితాదారులే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా మారనున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఎల్‌-1 జాబితా లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహాయించి ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా 3,69,014 మందికి ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 2,45,500 ఇళ్ల గ్రౌండింగ్‌ పూర్తయ్యింది. ఇవి పలు దశల్లో ఉన్నాయి. మొత్తం ఎల్‌-1లో 23.20 లక్షల దరఖాస్తుదారులు ఉండగా ప్రస్తుత, రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 13.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు రానున్నాయి.

మరో 9.70 లక్షల మంది తర్వాత దశల్లో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎల్‌-2లో కనీసం స్థలాలు లేనివారు 21.49 లక్షల మంది ఉన్నారు. వారికి ఏ విధంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే దానిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ జాబితాలో ఉన్న వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందించాల్సి ఉంటుంది. బ్లాక్‌ల వారీగా నిర్మించి ఇస్తే ఏవిధంగా ఉంటుందోనన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎల్‌-3 లబ్ధిదారులను అనర్హుల జాబితాలో చేర్చడం వల్ల వీరికి ఇళ్లు కేటాయించే అవకాశాలు లేవని సమాచారం.

నిబంధనల సడలింపు : ఇందిరమ్మ ఇళ్లు తప్పనిసరిగా 400-600 చ.అ విస్తీర్ణంలో నిర్మించాలనేటువంటి నిబంధనలున్నాయి. పలుచోట్ల నిర్ణీత విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించడం లేదని అధికారులు అనుమతులు రద్దు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. తక్కువ విస్తీర్ణం కారణంగా కొంతమంది ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు సర్కారు గుర్తించింది.

తక్కువ విస్తీర్ణంలో స్థలాలున్న ఇళ్ల పథకం లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలను సడలించింది. 400 చదరపు అడుగులు 44.4 చదరపు గజాల్లోపు స్థలం ఉన్నా, జీ ప్లస్​ వన్​ విధానంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా నిర్ణీత స్థలం కన్నా తక్కువ ఉన్న లబ్ధిదారులకు ఊరట కలిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.

చెల్లింపులు ఇలా : నిర్ణీత విస్తీర్ణం లేని లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు జీప్లస్​ విధానంలో చేపట్టాలనుకుంటే ముందుగానే హైసింగ్​ డిపార్ట్​మెంట్​ డిప్యూటీ ఈఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా ఇంటిని తప్పనిసరిగా ఆర్​సీసీ ఫ్రేంలోనే నిర్మించాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణంలో తప్పనిసరిగా వంట గది (కిచెన్​ రూం), మరుగుదొడ్డి ఉండాలని నిబంధనలను విధించింది.

సగం పూర్తయ్యాక అర్హత లేదంటారా? - ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త కష్టాలు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్ - అలా చేస్తే ఇళ్లు రద్దు!

Last Updated : December 29, 2025 at 10:55 AM IST