ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా మంతెన సత్యనారాయణ, కార్టూనిస్ట్ శ్రీధర్ - ఉత్తర్వులు జారీ
ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు - దేవదాయశాఖ ప్రభుత్వ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయప్రసాద్ - మాస్ కమ్యూనికేషన్స్ ప్రభుత్వ సలహాదారుగా పోచంపల్లి శ్రీధర్‌రావు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 8:50 PM IST
|Updated : December 29, 2025 at 10:26 PM IST
Government Issued Orders To Appointing Three More Advisors : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురిని సలహాదారులుగా నియమించింది. ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అలాగే మాస్ కమ్యూనికేషన్స్, దేవాదాయ శాఖలకు కొత్తగా ఇద్దరు సలహాదారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్ కమ్యునికేషన్స్ సలహాదారుగా పోచంపల్లి శ్రీధర్ రావును నియమించగా, దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్‌లను నియమించింది. దీనిపై సీఎస్ కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. అదేవిధంగా పోచంపల్లి శ్రీధర్‌రావును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. కార్టూనిస్ట్ శ్రీధర్‌గా సుపరిచితులైన ఆయన మాస్ కమ్యూనికేషన్స్‌లో సేవలు అందిస్తారు. దేవదాయశాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ నియమితులయ్యారు. మంతెన, శ్రీధర్, సీతారామాంజనేయ ప్రసాద్ తమ పదవుల్లో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
తొలుత తప్పుగా జీవో - సాయంత్రం కల్లా సరిచేసి : అయితే ప్రభుత్వ జీవోలు స్పష్టంగా ఉండేలా జారీకి ముందే జాగ్రత్తగా పడుతూ, అప్రమత్తంగా ఉండాల్సిన జీఏడీ అధికారులు మాత్రం తొందరపాటుతో వ్యవహరించడం వల్ల కొంత గందరగోళం నెలకొంది. చుండూరి సీతామాంజనేయ ప్రసాద్‌ను దేవాదాయ శాఖ సలహదారుగా నియమిస్తే, జీవోలో మాత్రం మాస్ కమ్యునికేషన్స్ సలహాదారుగా నియమించినట్లు తొలుత తప్పుగా జీవో ఇచ్చారు. అనంతరం తప్పును సరి చేసి చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్‌ను దేవాదాయ శాఖ సలహదారుగా నియమిస్తున్నట్లు మరో జీవో జారీ చేశారు. అనంతరం మాస్ కమ్యునికేషన్ సలహదారుగా పొచంపల్లి శ్రీధర్ రావును నియమిస్తూ పాత నెంబర్ తోనే ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగా జీవోలో తప్పులు దొర్లినట్లయితే దాన్ని వెబ్ సైట్ నుంచి తొలగించకుండా సవరణ జీవోలు జారీ చేస్తారు. కానీ అధికారులు పాత జీవో వెబ్ సైట్లో కనపడకుండా జోవోను మాయం చేశారు. కీలకమైన ప్రభుత్వ జీవోల జారీలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గందరగోళం నెలకొంది. సాయంత్రం కల్లా తప్పులను సరిచేసి జీవోలు ఇవ్వడంతో గందరగోళానికి తెరపడింది.
రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులు : మరోవైపు ఇప్పటికే వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు ఆ పదవుల్లో ఉంటారు.
అలాగే రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు - మహమ్మద్ షరీఫ్. (నర్సాపురం-టీడీపీ)క్యాబినెట్ ర్యాంక్, రాష్ట్ర నైతిక విలువల సలహాదారు-చాగంటి కోటేశ్వరరావు. (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్)లకు ఇప్పటికే క్యాబినెట్ ర్యాంక్‌లు ఇచ్చారు.
చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా సుచిత్ర ఎల్ల నియామకం
సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన - ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే

