ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ మరోసారి పొడిగింపు
ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1969లోని రూల్ 3 (3) ప్రకారం నిర్ణయం - క్రిమినల్ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 3:51 PM IST
Suspension Extends of Ex CID Chief PV Sunil Kumar : సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. సస్పెన్షన్‌ను మరో సారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నియమాల ఉల్లంఘన కింద సస్పెన్షన్ పొడిగించారు. సునీల్ కుమార్‌పై కీలకమైన క్రిమినల్ కేసులు పూర్తయ్యే వరకు లేదా పదవీ విరమణ తేదీ 30 జూన్ 2026 వరకు సస్పెన్షన్ పొడిగింపు వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపింది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైఎస్సార్సీపీ హయాంలో ఎంపీగా ఉన్న తనను కస్టాడియల్ టార్చర్‌కు గురి చేశారంటూ సునీల్ కుమార్ పై ఫిర్యాదు చేసిన ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా వేరే దేశాలకు వెళ్లారన్న అభియోగాలపై తొలిసారి సస్పెన్షన్ వేటు వేయగా అగ్రిగోల్డ్ బాధితుల నిధులు దుర్వినియోగం, ఎలక్ట్రానిక్స్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై సునీల్ కుమార్‌పై నమోదైన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
కీలకమైన కేసుల్లో దర్యాప్తు కీలక దశలో ఉండటంతో సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగించారు. 2025 మార్చి 2న సునీల్ కుమార్ పై తొలిసారి సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 28న మరో 6 నెలలు సస్పెన్షన్ పొడిగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24తో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో మరో సారి పొడిగించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే? : రాజద్రోహం కేసులో 2021 మే 14వ తేదీన హైదరాబాద్‌లోని నివాసంలో రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అదే రోజు రాత్రి కస్టడీలో ఉన్న తనను తీవ్రంగా హింసించారని, హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేసు సైతం నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం రాగానే 2024 జులై 11వ తేదీన రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏ1గా పీవీ సునీల్‌కుమార్: ఐపీసీ సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 రెడ్ విత్ 34 ప్రకారం కేసు పెట్టారు. ఈ కేసులో సీఐడీ డీజీగా పని చేసిన పీవీ సునీల్ కుమార్‌ను ఈ కేసులో ఏ1గా, అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులును ఏ2గా, జగన్మోహన్ రెడ్డిని ఏ3గా చూపించారు. సీఐడీ డీఎస్పీ విజయపాల్‌ను ఏ4గా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు. ఈ కేసులో విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రభావతిని రెండుసార్లు విచారించారు.
జీజీహెచ్ అధికారులపై ఒత్తిళ్లు: రఘురామను కస్టడీలో వేధించటంతో పాటు జీజీహెచ్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొనివచ్చి తప్పుడు వైద్య నివేదికలను సమర్పించారని సునీల్‌కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు నమోదైన సమయంలో కూడా సునీల్ కుమార్ ఇదో తప్పుడు కేసని సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.
కస్టడీలో చంపేందుకు ప్రయత్నం : రాజద్రోహం కేసులో అరెస్టైన తనను పోలీసు కస్టడీలో చంపేందుకు యత్నించారంటూ శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ల కింద సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఈ కేసు నమోదు నిర్ణయాన్ని తప్పుపడుతూ జులై 12న సునీల్‌కుమార్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. దీనిపై అఖిల భారత సర్వీసు ప్రవర్తనా నియమావళిలోని 7వ నియమ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ 2024 అక్టోబర్ 7న ఉత్తర్వులిచ్చింది.
వెలుగులోకి సునీల్‌కుమార్ ఆరాచకాలు - ఒక్కొక్కరిగా బయటికొస్తున్న బాధితులు
ఐదు గంటల పాటు సాగిన హైడ్రామా! - సునీల్ కుమార్ నుంచి ఆశించిన స్థాయిలో రాని సమాధానాలు

