తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీ - పది పాసైతే చాలు - ఎగ్జామ్ లేకుండానే డ్యూటీలోకి
ఎంపికకు పదో తరగతి విద్యార్హత - సమస్యగా మార్కుల శాతం - గ్రేడింగ్ విధానం స్పష్టతకు SSC బోర్డును సంప్రదించిన ఆర్టీసీ

Published : July 9, 2026 at 8:18 AM IST
|Updated : July 9, 2026 at 9:46 AM IST
Conductors Recruitment in TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యమే ఈ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ కొలువులను భర్తీ చేయలేదు. ఉన్న ఉద్యోగులే పదవీ విరమణ చేస్తుండటంతో ప్రతి ఏటా ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం ఔట్ సోర్సింగ్ పద్ధతిన తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా పలు రీజియన్ల పరిధిలోని డిపోల్లో సిబ్బందిని నియమించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1,500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సిద్ధమవుతోంది.
మార్కులు వర్సెస్ గ్రేడింగ్ : కండక్టర్ జాబ్లకు టెన్త్‌లో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకుని ఎంపిక చేసే విధానం ఆర్టీసీలో ఉంది. రీజియన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటూ సెలక్షన్ ప్రాసెస్ జరిగేది. ఆ తర్వాత రాష్ట్రంలో టెన్త్‌లో గ్రేడింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. దీంతో కండక్టర్ కొలువులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొంతమంది మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేసే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఈ రెండు విధానాలను ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారి ఒకరు వివరించారు. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా లేఖ రాసింది. గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి అనే విషయంపై ఎస్సెస్సీ బోర్డు నుంచి స్పష్టత తీసుకుని, కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఆర్టీసీ యోచిస్తున్నట్లుగా సమాచారం .
ఇకనైనా సిబ్బంది కొరత తీరేనా : ఆర్టీసీలో సిబ్బంది కొరత నానాటికీ తీవ్రమవుతోంది. ముఖ్యంగా కండక్టర్ పోస్టులో ఈ సమస్య ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 2,059 మంది కండక్టర్ల కొరత ఉంది. ఈ ఏడాది మార్చినాటికి 140 మంది ఉద్యోగ విరమణ చేశారు. మరోవైపు గత కొద్ది నెలల్లో కొత్తగా మరిన్ని బస్సులను రోడ్డెక్కించిన నేపథ్యంలో మరింత మంది కండక్టర్లు కావాలని అధికారులు గుర్తించారు. మొత్తంగా 3,208 మంది అవసరం ఉంది. తక్షణం 1500 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఆర్టీసీ యాజమాన్యం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి కొద్దిరోజుల క్రితం తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
డబుల్ డ్యూటీలు, డ్రైవర్లకు బాధ్యతలు : ఆర్టీసీ కండక్టర్ల కొరత నేపథ్యంలో ఆ సంస్థ యాజమాన్యం తాత్కాలిక సర్దుబాట్లతో నెట్టుకొస్తోంది. దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో డ్రైవర్లకు కండక్టర్ల బాధ్యతలను కూడా అప్పగించాల్సిన పరిస్థితి. అదీ చాలక ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కొంతమందిని తీసుకున్నారు. ఉన్న కండక్టర్లలో వీలున్నంతమందికి డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తక్షణ భర్తీకి అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. నిజానికి ఆర్టీసీలో కండక్టర్ల నియామకాలు జరగక దశాబ్దం కాలం దాటింది. ఈ పోస్టుల భర్తీకి నాలుగైదు ఏళ్లుగా ప్రభుత్వ అనుమతిని ఆర్టీసీ యాజమాన్యం కోరుతూనే ఉంది. తాజాగా కండక్టర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్టీసీలో సిబ్బంది కొరత తగ్గే అవకాశం ఉంది.
ఇక బస్సు షెడ్యూళ్లను నిర్ణయించేది ప్రయాణికుల రాకపోకలే - 'స్మార్ట్ షెడ్యూలింగ్'కు ఆర్టీసీ శ్రీకారం
ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు - ప్రయాణికుల రక్షణ, భద్రతే ధ్యేయంగా సరికొత్త ప్రయోగం

