ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'సంతాన ప్రాప్తిరస్తు' - రూ.లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఫ్రీగా

తల్లి అయ్యేందుకు లక్షలు ఖర్చు చేయలేని వారి కోసం ఉచిత కేంద్రాలు - ఐయూఐ, ఐవీఎఫ్​ చికిత్స నుంచి బిడ్డ పుట్టే వరకు పర్యవేక్షణ - గాంధీ, పేట్లబుర్జు ఆస్పత్రుల్లో ఇప్పటికే పలు చికిత్సలు

Free Fertility Center In Telangana
Free Fertility Center In Telangana (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 5, 2026 at 11:43 AM IST

3 Min Read
Choose ETV Bharat

Free Fertility Center's In Telangana : మాతృత్వం అంటే మహాభాగ్యంగా భావిస్తుంటారు మహిళలు. తమ జీవితంలో అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతుంటారు. తల్లిదండ్రులవ్వాలని ప్రతి జంటా కలలు కంటుంది. అయితే మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లు, రసాయణాల వాడకం, కాలుష్యం కారణమేదైనా తల్లిదండ్రులయ్యే భాగ్యానికి పలు జంటలు నోచుకోవటం లేదు. అంతేకాకుండా క్రమంగా ఈ సమస్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.లక్షలు ఖర్చయ్యే సంతాన సాఫల్య చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రులు ఉచితంగా అందిస్తున్నాయి. ఎన్నో జంటలకు సంతాన ప్రాప్తిరస్తు కలిగిస్తున్నాయి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

వారి ఆశలను వ్యాపారంగా మారుస్తూ : ఏడాది తిరిగేసరికే పండంటి బిడ్డను ఎత్తుకోవాలని ఉవ్విళ్లూరుతుంటాయి కొత్త జంటలు. అయితే జన్యు సమస్యలు, పీసీఓడీ, పర్యావరణంలో మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఇలా కారణమేదైనా తల్లి తండ్రీ అవ్వాలనే కల ఎన్నో జంటలకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాల మెట్లెక్కే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని, సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐయూఐ, ఐవీఎఫ్​ చికిత్సల పేరుతో బాధితుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. ఆర్థికంగా స్థిరపడిన వారికి ఈ ఖర్చు పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ పేద, మధ్య తరగతి వారికి గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సంతాన సాఫల్య కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా సంతాన సాఫల్య కేంద్రాలు (ETV)

ఉచితంగా ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్సలు : పేద, మధ్య తరగతి వారి జేబుకు చిల్లుపడకుండా మెరుగైన ఫెర్టిలిటీ చికిత్సలు అందించాలని భావించిన సర్కారు, 2024లో సంతాన సాఫల్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. 2023లోనే గాంధీలో ఫెర్టిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, రీయేజంట్లు, ఎంబ్రియాలజిస్ట్‌ల కొరతతో చికిత్సలు ప్రారంభం కాలేదు. దీంతో ప్రభుత్వం 2024లో మరోమారు ఫెర్టిలిటీ కేంద్రాన్ని గాంధీ, పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రుల్లో శ్రీకారం చుట్టింది. స్త్రీ, పురుషుల్లో సంతాన లేమి సమస్యలకు సంబంధించిన పరీక్షలు, స్కానింగ్​లు సహా అవసరమైన వారికి ఉచితంగా ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్సలను అందిస్తున్నారు. ఒక్క ఐవీఎఫ్ సైకిల్ పూర్తి చేయాలంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుండగా, ఇక్కడ మందులు, పరీక్షలన్నీ ఉచితంగా అందిస్తున్నారు.

"రక్త పరీక్షలు, హార్మోన్​ పరీక్షలు, స్కానింగ్​, హెచ్చెస్​, సైమన్​ అనాలిసిస్​, ఐయూఐ, ఓవ్యులేషన్​ ఇండక్షన్​, ఫాలిక్యులర్​ స్టడీ తర్వాత ప్రెగ్నెన్సీ వరకు ఫాలోఅప్​ చేస్తాం. ఒకవేల గర్భం దాల్చకపోతే హార్మోన్​, ఎంబ్రియో ట్రాన్స్​ఫర్​ కూడా చేస్తాం." - డా. శోభా, గైనకాలజీ విభాగం హెచ్ఓడీ, గాంధీ ఆసుపత్రి

మందుల ద్వారా కూడా పరిష్కారం : గాంధీ ఆస్పత్రిలో రోజుకు కనీసం 80 మంది వరకు చికిత్సకు వస్తుండగా, పేట్లబుర్జులోనూ 50 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. కొందరిలో చిన్న చిన్న లోపాలు మాత్రమే ఉన్నాయని గుర్తిస్తున్న వైద్యులు, వారికి మందుల సహాయంతో గర్భం దాల్చేలా చికిత్స అందిస్తున్నారు. ఓ కమిటీ ఏర్పాటు చేసి, దాని సిఫార్సు మేరకు అవసరమైన వారికి ఐవీఎఫ్ లాంటి క్లిష్టమైన వైద్యాన్ని అందిస్తున్నారు.

"ట్యూబ్స్​ అన్నీ ఓపెన్​ ఉన్నాయా, లేదా అని చూసుకోవడానికి హెచ్​ఎస్​జే టెస్ట్​లు చేస్తాం. ప్రతి రోజూ వాళ్ల ఎగ్​ ఎలా పెరుగుతుంది లాంటి విషయాలు ఫాలో అప్​ చేస్తాం. కొన్నిసార్లు ఒక ఐదు ఏళ్లుగా పిల్లలు కలగకపోయినా చిన్నపాటి చికిత్సతో సమస్య దూరమయ్యేలా చేస్తాం." - డా.సుజాత, డైరెక్టర్, ఐవీఎఫ్ సెంటర్, పేట్లబుర్జు ఆసుపత్రి

అత్యంత ఖరీదైన ఫెర్టిలిటీ చికిత్సలను ఉచితంగా అందిస్తూ గాంధీ, పేట్లబుర్జు ఆస్పత్రులు, ఇప్పటికే పలు కుటుంబాల్లో సంతోషాలను నింపాయి. సంతాన సమస్యలు ఉన్న వారు నేరుగా ఆస్పత్రులకు వచ్చి వైద్య సహాయం పొందవచ్చని ఆయా ఆస్పత్రుల వైద్యులు సూచిస్తున్నారు.

రూ.800 - రూ.1500 ఇచ్చి - కూలీలు, యాచకుల నుంచి వీర్యం, అండాల సేకరణ

IN Vitro Fertility Center in Gandhi Hospital : గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రం.. ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ