పురపాలక ఎన్నికల్లో 75 రకాల గుర్తులు - అభ్యర్థులు చెల్లించాల్సిన 'డిపాజిట్'లు ఎంతంటే?
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు - ఈ నెల 12న తుది జాబితా ప్రకటించనున్న ఎస్ఈసీ - పురపాలక ఎన్నికల్లో 75 రకాల గుర్తులు ఉంటాయని ప్రకటించిన అధికారులు

Published : January 10, 2026 at 10:42 AM IST
Telangana Municipal Elections 2026 : రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మరోవైపు నగర, పురపాలికల్లో ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది శిక్షణకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 75 రకాల గుర్తులున్నాయి. అభ్యర్థుల డిపాజిట్‌లను కూడా ఖరారు చేశారు. పురపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, ఇతరులు రూ.2,500, కార్పొరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5 వేలుగా అధికారులు నిర్ణయించారు.
ఏర్పాట్లు పూర్తి చేయాలి : మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పురపాలక, కార్పొరేషన్ల కమిషనర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన తుది ఓటర్ల జాబితా, 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టి-పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని రాణి కుముదిని ఆదేశించారు. 16వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితా ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆమె సూచించారు.
పురపాలక ఎన్నికలపై ప్రధాన పార్టీల ఫోకస్ : మరోవైపు పురపాలిక ఎన్నికలపై ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించుకున్న ఆయా పార్టీల నాయకులు పుర బరిలో సమర్థులను నిలిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఎలాగైనా అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకోసం పార్టీలో మంచి పేరు, వ్యక్తిత్వం కలిగిన వారిని ఎంపిక చేసే పనిలో ఆయా పార్టీల నాయకులు బిజీగా ఉన్నారు. పార్టీ బలం కొంత తోడైతే వ్యక్తిగతం కలిసి వస్తే గెలుపునకు బాటలు పడతాయని చాలా మంది భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ ఆశావహుల అభిప్రాయాలను కోరుతున్నాయి. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటే పట్టణ ప్రాంతాలపై మరింత పట్టు ఉంటుందని, రానున్న ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు అవకాశముంటుందని నాయకులు చెబుతున్నారు.
ఖర్చుల విషయంలో : ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు మిగతా సభ్యుల ఎన్నికకు కొంత ఆర్థికంగా సాయపడాలని చెబుతుండడంతో ఆశావహుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు మారుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ తమ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో బీజేపీ పట్టు లేకపోవడంతో తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో కనీసం కొన్ని వార్డు స్థానాల్లోనైనా పోటీ చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఎవరికి వారు ఖర్చులు పెట్టుకుంటే భారం ఉండదని భావిస్తున్నప్పటికీ ఛైర్మన్ పదవి ఎంపిక విషయంలో తేడాలొస్తే ఇబ్బందికరమని అంతర్గతంగా ఆలోచనలో పడ్డారు.
రంగంలోకి తాజా మాజీలు : ఎన్నికల రంగంలోకి తాజా మాజీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం రిజర్వేషన్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ ప్రాంతంలో తమకు అనుకూల ఓటర్లు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ అవకాశం వచ్చినా పోటీకి సై అనే విధంగా సిద్ధమవుతున్నారు.
భిన్న ఫలితాలతో మరింత అప్రమత్తం : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పలు మండలాల్లో భిన్నమైన ఫలితాలొచ్చాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థులను ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. కౌన్సిలర్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో విజయం సాధించడంతోపాటు ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్‌రెడ్డి, తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులను పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ - ఈ నెలలోనే నోటిఫికేషన్!
ఈసారైనా ఆ మున్సిపాలిటీకి ఎన్నిక జరిగేనా? - అక్కడ 2019 నుంచి నో ఎలక్షన్

