కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ - కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం!
సీఎం అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం - కార్పొరేషన్లలో పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై చర్చ- రాజధానిలో కీలక 18 ప్రధాన అంశాలకు ఆమోదం లభించే అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 4, 2026 at 8:28 AM IST
CM Cabinet Meeting : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు సచివాలయంలో జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే సీపీఎస్ అమల్లోకి రాకముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పింఛను (OPS) విధానాన్ని వర్తింపజేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనున్నారు.
15,000 మందికి పైగా ఉద్యోగులు : CPS అమలుకు ముందే జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై, వివిధ కారణాల వల్ల CPS అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు 'పాత పెన్షన్ పథకం' (OPS) అమలు చేసే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుందని సమాచారం. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదన ద్వారా 15,000 మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని అంచన. కాగా పాత పెన్షన్ పథకం అమలు వల్ల 11,000 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ రెండు అంశాలపై ఉద్యోగులు గత కొన్నేళ్లుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట కల్పించింది.
అలాగే హైకోర్టు ప్రాంగణంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 547 కోట్లు కేటాయింపు, నిర్మాణ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక 'భవన ట్రిబ్యునల్'ను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపనుందని తెలిసింది. ఏలూరు నుంచి ప్రకాశం వరకు తొమ్మిది జిల్లాల్లో విస్తరించి ఉన్న 'అమరావతి ఎకనామిక్ రీజియన్' అభివృద్ధికి ఆర్ఎఫ్ పీ' అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు జారీ చేయడానికి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అబ్జర్వేషన్ వీల్ : ఈ ప్రణాళికలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఒక భారీ 'అబ్జర్వేషన్ వీల్' (వీక్షణ చక్రం), ప్రత్యేక అగ్నిమాపక విభాగం కేంద్ర శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజధాని నగర ప్రణాళిక అభివృద్ధికి సంబంధించిన 18 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ఆ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంపొందించే లక్ష్యంతో 'ప్రజా-ప్రైవేటు భాగస్వామ్యం' (PPP) ప్రాతిపదికన 'రూపకల్పన-నిర్మాణం-నిర్వహణ-బదిలీ' (DBOT) నమూనాలో అమరావతిలో ఒక భారీ అబ్జర్వేషన్ వీల్‌ను నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
LPS లేఅవుట్‌లలోని "వీధి మూలల" (రహదారుల కూడళ్లలో ఉన్న ప్లాట్లు) వద్ద ఉన్న స్థలాల్లో ATMలు కియోస్క్‌ల వంటి వివిధ సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించనుందని తెలిసింది. PPP లేదా 'సంయుక్త సంస్థ' (Joint Venture) నమూనా ద్వారా అమలు చేయతలపెట్టిన 'నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్' అభివృద్ధికి కూడా పచ్చజెండా లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా సంప్రదింపుల పరిష్కార విధానంలో భాగంగా అభివృద్ధికి అనుకూలం కానివిగా భావించిన ప్లాట్లకు పరిహారంగా గ్రామకాంతం (గ్రామ ఉమ్మడి భూమి) ప్రాంతంలో 5 సెంట్ల వరకు భూమిని కేటాయించడాన్ని మంత్రివర్గం ఆమోదించనుంది.
వారానికి ఒకరోజు నో వెహికల్ డే - ప్రధాని పొదుపు చర్యలపై కేబినెట్ భేటీలో కీలక చర్చ
గొడ్డలి పార్టీ విమర్శలను తిప్పికొట్టాలి - మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం

