స్టార్టప్ పీడియా'26 అద్భుత ప్రయాణం - భవిష్యత్ ఆవిష్కరణలకు మరింత ఉత్సాహం
విజయంతంగా ముగిసిన 12వ జాతీయ స్థాయి స్టార్టప్ సమ్మిట్ - శామీర్‌పేటలోని ఐపీఈ (IPE) క్యాంపస్‌లో రెండు రోజుల పాటు సాగిన స్టార్టప్ పీడియా'26 - చివరిగా ముగ్గురికి బహుమతులు అందజేత

Published : March 2, 2026 at 12:29 PM IST
|Updated : March 2, 2026 at 12:37 PM IST
STARTUPEDIA'26 : ఐపీఈ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్)లో జరిగిన 12వ జాతీయ స్థాయి స్టార్టప్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, వ్యవస్థాపకులు సమర్పించిన ఉత్తేజకరమైన స్టార్టప్ పిచ్‌లతో 2వ రోజూ గొప్పగా సాగింది. జాతీయ వేదికపై సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచన, వ్యవస్థాపక నైపుణ్యాన్ని ప్రదర్శించే విభిన్న రంగాల్లో వినూత్న వ్యాపార నమూనాలు, భవిష్యత్తు ఆలోచన పరిష్కారాలను ప్రదర్శించారు.
ఒకటో రౌండ్ జ్యూరీలలో రేష్మా రావూరి, సునీత తమ్మినీడి, శ్రీనిత్య కరతి, అశుతోష్ చౌహాన్, అవనిజా రమణన్, ఐపీఈలోని అధ్యాపకులు ప్రొఫెసర్ అనంత్, ప్రొఫెసర్ రామకృష్ణ, డాక్టర్ సయ్యద్ అజర్ అలీ, డాక్టర్ నరేష్, ప్రొఫెసర్ కల్యాణ్, ప్రొఫెసర్ షాహీన్, డాక్టర్ సాగరిక, డాక్టర్ జి.సురేందర్ రెడ్డి, డాక్టర్ కల్యాణి ఉన్నారు.
నిపుణులతో జ్యూరీ ప్యానెల్ : ప్రాథమిక పిచింగ్ సెషన్ల తర్వాత 14 జట్లు రెండో రౌండ్‌కు అర్హత సాధించాయి. ఇక్కడ వారి వ్యాపార ఆలోచనలను పరిశ్రమ నిపుణులతో కూడిన జ్యూరీ ప్యానెల్ మూల్యాంకనం చేసింది. మూల్యాంకన ప్రక్రియ ఆవిష్కరణ, సాధ్యాసాధ్యాలు, స్కేలబిలిటీ, మార్కెట్ వయబిలిటీపై దృష్టి సారించింది. దీని వలన పోటీ మరింత ప్రభావవంతంగా మారింది. రౌండ్ 2 కోసం జ్యూరీ ప్యానెల్‌లో ఈషా రావు, సతీష్ కతిరిశెట్టి, ఎన్.వి. సుబ్బారావు, అశుతోష్ చౌహాన్, అవనిజా రమణన్, డాక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు.
ఏజీ టెక్ ఇన్నోవేషన్ ల్యాబ్ : ఈ సమ్మిట్ గ్రాండ్ వాలెడిక్టరీ వేడుకతో ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా ఏజీ టెక్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎల్ఎల్సీ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ గుంటకు దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస మూర్తి, రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మీ కుమారి, ఈ-సెల్ హెడ్ డాక్టర్ ప్రార్థనా కుమార్, స్టూడెంట్ కో-ఆర్డినేటర్ మైత్రి హాజరయ్యారు.
స్టార్టప్ పీడియా'26 రెండు రోజుల ప్రయాణం ముఖ్యాంశాలను ప్రస్తావించడంతో వేడుక ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ, భవిష్యత్ నాయకులను రూపొందించడంలో వ్యవస్థాపక చొరవల ప్రాముఖ్యతను చెప్పారు. సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహక బృందాన్ని అభినందించారు.
విలువైన అనుభవాలు : డాక్టర్ గుంటకు దిలీప్ కుమార్ మాట్లాడుతూ తన వ్యవస్థాపక ప్రయాణం నుంచి విలువైన అనుభవాలను పంచుకున్నారు. నమ్మకం, కొత్త కొత్త ఆవిష్కరణలను కొనసాగించడానికి స్ఫూర్తిదాయక ఉపన్యాసం ఇచ్చారు. వ్యవస్థాపకులు తమ ఆలోచనలను తీసుకువచ్చే క్షణం నుంచే విజయం ప్రారంభమవుతుందని, స్టార్టప్పీడియా'26 వంటి ప్రభావవంతమైన వేదికల ద్వారా వ్యవస్థాపకతను ప్రోత్సహించినందుకు ఐపీఈని ప్రశంసించారు.
అనంతరం స్టార్టప్ పీడియా'26 విజేతలను ప్రకటించారు. విజేతగా చార్స్ అండ్ ఆయిల్స్ కంపెనీ (ఎకో-సస్టైనబుల్ ఇండస్ట్రీ) నిలిచింది. మొదటి రన్నరప్‌గా శ్రీమతి మిల్లె (అగ్రి-టెక్ ఇండస్ట్రీ). రెండో రన్నరప్‌గా ఫోరివో టీం (ఎడ్యుటెక్ ఇండస్ట్రీ) నిలిచింది.
ఈ-సెల్, ఐపీఈ హెడ్ డాక్టర్ ప్రార్థనా కుమార్ సందేశంతో ఈవెంట్ ముగిసింది. ఆమె విజేతలను అభినందించారు. పాల్గొన్న వారందరినీ వారి వినూత్న ఆలోచనలు, నిర్వాహక బృందం, వాలంటీర్లను అభినందించారు. స్టార్టప్ పీడియా'26 గొప్ప విజయాన్ని సాధించినందుకు ప్రముఖులకు, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఐపీఈలో ఆవిష్కరణలు, నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ, తదుపరి ఎడిషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
సందడిగా "స్టార్టప్ పీడియా'26" - బిజినెస్ అంకురాలన్నీ ఒకే వేదికపైకి!

