సందడిగా "స్టార్టప్ పీడియా'26" - బిజినెస్ అంకురాలన్నీ ఒకే వేదికపైకి!
ప్రారంభమైన 12వ జాతీయ స్థాయి స్టార్టప్ సమ్మిట్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ఈవెంట్‌కు భాగస్వామిగా ఈటీవీ భారత్ - విభిన్న ఆలోచనలే వ్యాపార విజయానికి పునాది : వక్తలు

Published : February 26, 2026 at 5:51 PM IST
STARTUPEDIA'26 : "సమస్యలే నూతన ఆవిష్కరణలకు నాంది, బిజినెస్ స్కూల్ విద్యార్థులు శరవేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని వినూత్న ప్రాజెక్టులతో రాణించాలి" అని జాతీయస్థాయి స్టార్టప్ సమ్మిట్ "స్టార్టప్ పీడియా'26"లో వక్తలు పేర్కొన్నారు. శామీర్ పేటలోని ఐపీఈ (IPE) క్యాంపస్‌లో గురువారం "స్టార్టప్ పీడియా'26" జాతీయ స్థాయి స్టార్టప్ సమ్మిట్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు యూనివర్సిటీల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో ప్రాంగణంలో సందడి నెలకొంది. తొలి రోజు వక్తల ప్రసంగాలు, ప్యానెల్ డిస్కషన్ ఆసక్తిగా సాగాయి.
వ్యాపార ఆలోచనలను సమీకరించి, అవి కార్యరూపం దాల్చే విధంగా అటు బిజినెస్ స్కూల్ విద్యార్థులను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే స్టార్టప్ పీడియా (Startupedia'26) లక్ష్యం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ) నిర్వహిస్తున్న ఈవెంట్‌కు "ఈటీవీ భారత్" భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రెండ్రోజుల ఈ ఈవెంట్లో భాగంగా గురువారం స్పీకర్ సిరీస్, ప్యానెల్ చర్చ, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ సెషన్స్ నిర్వహించారు.
క్రాస్ రోడ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ : ముందుగా సమ్మిట్‌లో పాల్గొన్న విద్యార్థుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభించగా ముఖ్య అతిథులు, నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ కామేశ్వర్రావు మాట్లాడుతూ జాతీయ స్థాయి సమ్మిట్ అనేది "క్రాస్ రోడ్స్ ఆఫ్ ఇన్నోవేషన్"గా అభివర్ణించారు. వినూత్న ఆవిష్కరణలకు కీలక మలుపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలు, బిజినెస్ పిచ్‌లకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. స్టార్టప్ పాలసీ ద్వారా రూ.10 లక్షల నుంచి పది కోట్ల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME) ప్రాజెక్టులు, పరిశ్రమలకు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల రుణాలు ఇస్తామని తెలిపారు.
ఉద్యోగాల సృష్టి కొనసాగుతుంది : "మేరా ఈవెంట్స్" ఫౌండర్ దారపనేని చెన్నప్ప నాయుడు మాట్లాడుతూ నిజమైన సమస్యల నుంచే వినూత్న ఆలోచనలు మొగ్గతొడుగుతాయన్నారు. ఈ సందర్భంగా పలు ఆవిష్కరణల వెనుక నేపథ్యాన్ని గుర్తు చేశారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని కఠిన పరిస్థితులను గుర్తు చేస్తూ ఇంటర్నెట్ వచ్చాక ఉద్యోగాలు ఉండవనే అపోహ నెలకొందని చెప్పారు. కానీ, ఇంటర్నెట్ వాడకంతో ఉద్యోగాలు ఎన్నో పుట్టుకొచ్చాయని వివరించారు.
"నేను స్టార్టప్ పీడియా ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఇది 12వ జాతీయ స్థాయి స్టార్టప్ పీడియా ఈవెంట్. మేము ఇంతకు ముందు జరిగిన 11 ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించాం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ఈ ఇవెంట్‌ను ఫ్లాగ్షిప్ కార్యక్రమంగా నిర్వహిస్తోంది. ఆవిష్కరణల పట్ల ఇక్కడికి వచ్చిన అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం." -కోమలి, స్టార్టప్ పీడియా ఆర్గనైజేషన్
వ్యాపారంలో కీలకం : ఐపీఈ డైరెక్టర్ ప్రొ.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తాము వరుసగా 12వ సారి జాతీయ స్థాయి సమ్మిట్ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఐపీఈ అకడమిక్ డీన్ ప్రొ.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యాపార ఐడియాలు అందిపుచ్చుకోవడానికి స్టార్టప్ పీడియా ఒక వేదికగా నిలుస్తుందన్నారు. పరిశీలన, ఆసక్తి, అగ్రిమెంట్ వ్యాపార నిర్వహణలో కీలక మైలురాళ్లుగా అభివర్ణించారు.
"ఇంత పెద్ద ఈవెంట్లో మేం మొదటిసారి పాల్గొంటున్నాం. రివర్స్ వెండింగ్ మెషిన్స్ కాన్సెప్ట్‌లో పాలుపంచుకుంటున్నాం. ఇది సెలెక్ట్ అయితే భవిష్యత్తులో చాలా మార్పులు వస్తాయి. ప్రస్తుతం సెషన్స్‌లో పాల్గొంటూ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం." -క్యాతియానన్స్, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీ, టీమ్ రెఫ్యూ
ఎంటర్ ప్రెన్యూర్ సెమినార్ : "క్లైమేట్ టెక్నాలజీ, గ్రీన్ యూనికార్న్" అంశంపై యాంబియేటర్ ఫౌండర్ జితేన్ దేశాయ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఐపీఈ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి బృంద చర్చ నిర్వహించగా టీసీఎస్ (TCS) అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ అగర్వాల్, ఉన్నాయన్ డిఫెన్స్ టెక్నాలజీ కో ఫౌండర్, డైరెక్టర్ వైభవ్ జోషి, స్లీప్ ఆల్ఫా సహ వ్యవస్థాపకుడు, సీఈవో జిష్ణు సౌరభ్ శ్రీనివాస్, జోలీ ఏఐ ఫౌండర్, సీఈవో జయ భరద్వాజ్ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. వ్యాపారంలో నైపుణ్యం సాధించాలంటే వ్యూహాలకు పదును పెట్టాలని సూచించారు.
విద్యార్థుల్లో హర్షం : బిజినెస్ ఐడియాలను అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా తమకు వచ్చిన అవకాశం ఎంతో అమూల్యమైందని విద్యార్థులు తెలిపారు. స్టార్టప్ పీడియా'26 సమ్మిట్‌లో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార వ్యూహాలు తెలుసుకోవడంతోపాటు నిపుణులు, వివిధ రంగాల్లో విజయం సాధించిన పలు కంపెనీల సీఈవోలతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.
యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తే భారత్ గొప్పగా ఎదుగుతుంది: : కణ్వాల్ రేఖీ

