ETV Bharat / state

అర్ధరాత్రితో మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం - సర్వదర్శనానికి 15 గంటల సమయం

వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి హుండీకి భారీగా కానుకలు - మొత్తం హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు - క్యూలైన్‌లోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు

VAIKUNTA GATE CLOSE TIRUMALA
VAIKUNTA GATE CLOSE TIRUMALA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 11:44 AM IST

3 Min Read
Choose ETV Bharat

Srivari Vaikunta Gate Close Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో గతేడాది డిసెంబరు 30వ తేదీన ప్రారంభమైన పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం(8-01-26) అర్ధరాత్రి 12 గంటలకు ముగియనున్నాయి. వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. తర్వాత సాధారణ దర్శన విధానం అమల్లోకి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ వైకుంఠ ద్వార దర్శనాల కాల వ్యవధిలో రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఈ-డిప్‌లో రోజుకు ఐదు వేల చొప్పున టోకెన్లు : పది రోజుల ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులు మాత్రం ఈ-డిప్‌ విధానం ద్వారా టోకెన్లు టీటీడీ జారీ చేసింది. మిగిలిన ఏడు రోజులకు నేరుగా వచ్చే సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇదే సమయంలో పరిమిత సంఖ్యలో శ్రీవాణి, వీవీఐపీల బ్రేక్, రూ.300 టికెట్లు, స్థానికులకు ఈ-డిప్‌ విధానంలో రోజుకు ఐదు వేల చొప్పున టోకెన్లను జారీ చేసింది. ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు పర్యవేక్షించారు. క్యూలైన్‌లోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించారు.

సర్వదర్శనానికి 15 గంటల సమయం : వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి హుండీకి భారీగా కానుకలు వచ్చాయని అధికారులు తెలిపారు. శ్రీవారిని ఎనిమిదోరోజు మంగళవారం వైకుంఠ ద్వారంలో 82,022 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చిందని ప్రకటించారు. 20,230 మంది భక్తులు మొక్కులు తీర్చుకొని తలనీలాలు సమర్పించారని తెలిపారు. అదేవిధంగా బంగారం, వెండి కానుకలు కూడా పెద్ద మొత్తంలో వచ్చాయని అధికారులు వివరించారు. వస్తు కానుకలు, భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారికి విశేషంగా సమర్పించారని తెలిపారు. ఈ ఆదాయాన్ని తిరుమల అభివృద్ధి, గోశాల, విద్య , అన్నదానం, వైద్య సేవలకు వినియోగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. అన్నప్రసాద కేంద్రాలు, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించినట్లు వెల్లడించారు. తొమ్మిదో రోజు బుధవారం కూడా రద్దీ కొనసాగింది. రింగురోడ్డులోని శిలాతోరణం నుంచి భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించారు. సాయంత్రానికి 51,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోగా క్యూలైన్‌లో వేచి ఉన్న మిగిలిన భక్తులకు 15 గంటల్లో దర్శనం పూర్తికానుందని టీటీడీ ప్రకటించింది.

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు : అయితే నిన్న(7-01-26) మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కూడా సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, మంత్రి ఆనం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆయన స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. అంతేకాకుండా పండితులు ధరమ్ బీర్ గోకుల్‌కు వేదాశీర్వచనం అందజేశారు. అంతేకాకుండా అదేేరోజు వేర్వేరు సమయాల్లో సినీ నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్​లు దర్శించుకున్నారు. దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్​లు వెంకన్నను దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భారీ కుట్ర - మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాద్యమాలలో ప్రచారం

తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు