చిన్న పిల్లల పాలిట 'సంజీవని' : 20 నెలల్లో 500 గుండె ఆపరేషన్లు - అదీ ఫ్రీగా
చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తున్న సత్యసాయి సంజీవని ఆసుపత్రి - అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ వందలాది చిన్నారులకు పునర్జన్మ - సుశిక్షుతులైన డాక్టర్లకతో శస్త్ర చికిత్సలు చేస్తున్న తీరు

Published : July 7, 2026 at 2:14 PM IST
Sri Sathya Sai Sanjeevani Hospital Free Treatment For Children : సిద్దిపేట జిల్లాలోని కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని పిల్లల సంరక్షణ పరిశోధన కేంద్రంలో వైద్యులు 500 చిన్నారుల గుండెలకు ఉచిత సర్జరీలు చేసి ఊపిరి అందించారు. చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రుల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపారు. దాదాపు 20 నెలల సమయంలో పూర్తి ఉచితంగా వందలాది చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. బాలల హృదయాలను సంరక్షిస్తుండగా ఎంతోమంది తల్లిదండ్రుల గుండెలు ఆనందంతో నిండిపోతున్నాయి. ఆసుపత్రిలోని అత్యాధునిక కార్డియాక్ కేర్ సదుపాయాలు, నిపుణుల వైద్యబృందం సర్జరీలతో బాసటగా నిలుస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన శ్రావణి-రామకృష్ణ దంపతుల కుమారుడు జ్ఞానదీప్ (4ఏళ్లు)నకు పుట్టుకతో గుండెకు రంధ్రం సమస్య ఏర్పడింది. రామకృష్ణ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించారు. శస్త్రచికిత్స తప్పనిసరి కాగా, రూ.5 లక్షల వ్యయమవుతుందని తేలడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రక్రియ పూర్తయింది. పూర్తి ఉచితంగా, చక్కటి సేవలు అందించారని, జీవితాంతం వైద్యులను మర్చిపోలేమని దంపతులు తెలిపారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అరుణ్ పాటిల్, అరుణ దంపతులు ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కుమార్తె ఖుషీ పాటిల్ (5 ఏళ్లు)కు పుట్టుకతోనే గుండె సమస్య ఉత్పన్నమైంది. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించి మెడిసిన్స్ వాడినా శస్త్రచికిత్స అనివార్యమైంది. రూ.10 లక్షలు ఖర్చవుతాయని ప్రైవేటు డాక్టర్లు చెప్పారు. అప్పటికే శక్తికి మించి రూ.లక్షలు ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో తమ బంధువుల ద్వారా సంజీవని ఆసుపత్రి వివరాలు తెలుసుకున్నారు. ఆరు నెలల కిందట ఒకసారి, ఇటీవల మరో దశ సర్జరీ చేశారు.

నాగలక్ష్మీ-ప్రసాద్ దంపతులది నిరుపేద కుటుంబం. వీరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం జిల్లా గుండాల కాలనీ. కుమార్తె శివనాగరిత్విక వయసు అయిదున్నరేళ్లు. రెండేళ్ల కింద హృద్రోగ సమస్య ఉన్నట్లు డాక్టర్లు టెస్టుల్లో గుర్తించారు. ప్రసాద్ ఓ కంపెనీలో గుమాస్తాగా కొనసాగుతున్నారు. ఆయా పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు విజయవాడ, ఖమ్మంలోని పలు ప్రైవేటు హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. సర్జరీ అనివార్యమవగా, రూ.లక్షల్లో ఖర్చవుతుందని తెలిసింది. ఈ క్రమంలోనే కొండపాకకు వెళ్లడంతో శస్త్రచికిత్స ఉచితంగా చేశారు.

ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హేమంతి దేవి, ముఖేశ్యాదవ్లది నిరుపేద కుటుంబం. జ్యూస్ స్టాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి కుమారుడు పీయూశ్ యాదవ్ (6 ఏళ్లు)కు 3 నెలల వయసులో గుండె సమస్య ఉన్నట్లు తెలిసింది. దీంతో స్వరాష్ట్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదు. సోషల్ మీడియా ద్వారా కొండపాకలోని సత్యసాయి సంజీవని ఆసుపత్రికి చేరారు. సర్జరీ విజయవంతమవగా, ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
గుండె ఆరోగ్యం కోసం - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!
సత్యసాయి సంజీవని హార్ట్కేర్లో ఉచిత శస్త్రచికిత్సలు - వీరికి మాత్రమే చేస్తారు

