ETV Bharat / state

ఇంజినీరింగ్​ అద్భుతం - ఎత్తైన కొండలు చీల్చుకుంటూ ముందుకు గోదారమ్మ పరుగులు

ఎన్నో అద్భుతాలకు నిలయంగా పోలవరం ఎడమ కాలువ నిర్మాణం- కనుచూపు మేర కాంక్రీ‌ట్‌ నిర్మాణంతో కనువిందు చేస్తూ ప్రవాహం - మధ్యలో భారీ అక్విడెక్ట్‌లు, వంతెనలను నిర్మించిన అధికారులు

Construction Method Of The Polavaram Left Canal
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 8:56 AM IST

3 Min Read
Choose ETV Bharat

Construction Method Of The Polavaram Left Canal : కనువిందు చేస్తూ గలగలా సాగే నీటి ప్రవాహం కనుచూపు మేర కాంక్రీ‌ట్‌తో నిర్మాణం. అక్కడక్కడా నడుముకు వడ్డాణంలా కనిపించే భారీ అక్విడెక్ట్‌లు, వంతెనలు. ఎత్తైన కొండలను చీల్చుకుంటూ వెళ్లే గోదావరి. ఇదీ అద్భుతంగా సాగిన పోలవరం ఎడమ కాలువ నిర్మాణ తీరు. నిజంగా ఇదంతా ఓ ఇంజినీరింగ్ అద్భుతమేనని చెప్పాలి. ఆ కాలువ ద్వారానే గొంతెండిన గ్రామాల దప్పిక తీర్చుతూ బీడు వారిన భూములను బంగారంగా మార్చుతూ ఉత్తరాంధ్ర వైపు గోదారమ్మ పరుగులు తీస్తోంది. గోదావరి పురుషోత్తపట్నం గ్రామంలో ప్రారంభించిన ఆ పరుగు పిల్ల కాలువగా మారే వరకు దారి వెంట జరిగే అద్భుత దృశ్యాలను చూసొద్దాం పదండి.

ఉత్తరాంధ్రాను ఆదుకున్న గోదావరి : ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఎన్నో వేలమైళ్లు ప్రవహించి ఉద్ధృతమై, ఉగ్రరూపమై దిగువకు వచ్చిన గోదావరి పోలవరం ప్రాజెక్టు వద్దకు రాగానే కాస్త శాంతిస్తుంది. సమీపంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల వద్దకు వచ్చాక నడక మార్చుకుంటుంది. మోటార్ల ధాటికి వచ్చిన ఒత్తిడితో ఉవ్వెత్తున ఎగిసి పడుతూ దిశ మార్చుకుని గలగలా ప్రవహిస్తూ, పోలవరం ఎడమ కాలువలోకి చేరి దిగువకు పరుగులు పెడుతోంది. గొంతెండిన గ్రామాల దాహం తీర్చుతూ బీడు వారిని పొలాలను సస్యశ్యామలం చేస్తూ ముందుకు నడుస్తుంది. దారి పొడవునా రైతన్నను ఆశీర్వదిస్తూ కొండంత భరోసా ఇస్తూ కనువిందుగా ముందుకు కదులుతోంది.

లిఫ్ట్ ఇరిగేషన్​తో కాలువలేకి నీళ్లు : పోలవరం ఎడమ కాలువను అద్భుతమైన నిర్మాణశైలితో నిర్మించారు. కాంక్రీట్ కవచంతో కాలువ గట్లను పటిష్టం చేసి చుక్క నీరు వృథా కాకుండా డిజైన్ చేశారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా త్రీడీ హైడ్రాలిక్ నమూనాలతో హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని ముందే లెక్కించారు. కాలువ అలైన్‌మెంట్ కోసం అధునాతన జీఐఎస్​ , డ్రోన్ సర్వేలను వాడారు. పురుషోత్తపట్నం, పుష్కర వంటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులతో నది నీటిని కాలువలోకి ఎక్కించే పంపింగ్ టెక్నాలజీని అమోఘం అని చెప్పాలి. చాలా చోట్ల నదులు అడ్డంగా రాగా నీటి ప్రవాహం కోసం నిర్మించిన భారీ అక్విడెక్ట్‌లను ప్రత్యేకతగా చెప్పుకోవాలి. కత్తిపూడి నుంచి తుని వెళ్లే మార్గంలో నాలుగు భారీ అక్విడెక్ట్‌ల నిర్మాణం ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎత్తైన కొండలు చీల్చుకుంటూ ముందుకు గోదారమ్మ పరుగులు (ETV Bharat)

అనేక సవాళ్లను ఎదుర్కొన్న గోదారమ్మ: కూటమి ప్రభుత్వం వచ్చాక కాలువ నిర్మాణ మార్గంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ వద్ద 123 మీటర్లు, 115 మీటర్ల ఎత్తున్న రెండు భారీకొండలను తొలిచి కాలువ తవ్వడం ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పాలి. సుదీర్ఘ ప్రయాణంలో వందలాది చిన్న, పెద్ద వాగులు, నదులు, రోడ్లు, రైల్వే లైన్లను దాటడానికి అనేక అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్ నిర్మించారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం ఎడమ కాలువలో కలిసిన గోదావరమ్మ సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లోని గ్రామాల మీదుగా ముందుకు వడివడిగా కదులుతుంది. మురారి వద్ద కాకినాడ జిల్లాలో ప్రవేశిస్తుంది. 23 టీఎమ్​సీ నీటిని తరలించడమే లక్ష్యంగా ఈ భారీ కాలువను నిర్మించారు. దారిలో పలు జాతీయ రహదారులు, నదులు, కాలువలు, రైల్వే ట్రాక్ లు , ప్రవాహాలు అడ్డురాగా పలు భారీ వంతెనలను నిర్మించారు

విశాఖ వాసుల దాహార్తిని తీర్చుతున్న గోదావరి : కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో బీడువారిన పలు నియోజకవర్గాల మీదుగా ప్రవహించే పోలవరం ఎడమ కాలువ ఏకంగా లక్షా 67 వేల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేస్తోంది. గండేపల్లి మీదుగా ముందుకు సాగుతూ జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మీదుగా ప్రహిస్తోంది. శంఖవరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం మీదుగా ముందుకు కదులుతోంది. మధ్య మద్యలో తూముల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేశారు. రామవరం,తాళ్లూరులో భారీ ఎత్తిపోతల లిఫ్ట్ స్కీంలు నిర్మించి నీటిని పంపింగ్ చేస్తూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయనుంది. గోదావరి జలాలను విశాఖ వైపు నడిపించే ఈ కాలువ, ఎండిన భూములకు ప్రాణం పోసే ఒక అమృతధారగా కనిపిస్తోంది. ప్రగతికి సాక్ష్యంగా నిలుస్తూ విశాఖ వాసుల దాహార్తిని తీర్చేందుకు ఉత్తరాంధ్ర వైపు అడుగులు వేస్తూ నవశకాన్ని నిర్మిస్తోంది.

వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన, పూర్తిచేసింది చంద్రబాబే : మంత్రి నిమ్మల

సెప్టెంబర్​ 2న అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు - విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు