ఆదర్శ గ్రామాలు : ఈ తండాల్లో ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు
సర్కారు కొలువులకు నిలయంగా మారుతున్న తండాలు - ప్రభుత్వ ఉద్యోగులకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఆ రెండు తండాలు

Published : November 8, 2025 at 4:07 PM IST
Thanda Youth are Getting Govt Jobs : ఒకప్పుడు తండావాసులకు వ్యవసాయమే జీవితం. కానీ ఇప్పుడు కొన్ని తండాల తీరు మారింది. కేవలం వ్యవసాయమే కాకుండా చదువు వైపు కూడా వారి పిల్లలు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. చదువుంటే ఏదైనా సాధించవచ్చనే నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు అలాంటి రెండు తండాల్లో ఇంటికో ఉద్యోగి ఉన్నాడంటే నమ్మగలరా? అవునండీ. నిజంగా ఇంటికో ఉద్యోగి ఉంటూ ఆ తండాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు. ఒక తండాలోని వారు వ్యవసాయం చేస్తూ చదువుకుంటే, మరో తండా గతంలో గుడుంబా తయారీ కేంద్రంగా ఉండి ఇప్పుడు ఉద్యోగాల ఖిల్లాగా మారింది. ఇప్పుడు ఆ రెండు తండాల స్టోరీలను తెలుసుకుందాం.
వ్యవసాయం నుంచి ఉద్యోగాల ఖిల్లా : నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధి సరంపేట గ్రామ ఆవాస ప్రాంతమైన సరంపేట తండా గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఈ తండాలో 76 ఇళ్లు ఉండగా, 230 మంది ఓటర్లు ఉంటారు. వీరిలో 190 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు అన్ని పల్లెల మాదిరిగానే ఈ తండాలో కూడా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండేదీ. కానీ ఇదొక్కటే కాకుండా ఇక్కడి పిల్లలు తల్లిదండ్రులతో కలిసి సాగు పనులకు వెళ్తూనే చదువుకుంటూ ఉన్నత విద్యాభ్యాసం కోసం మర్రిగూడ, హైదరాబాద్‌కు వెళ్లేవారు.
అక్కడ మొదటగా 1968లో మూడావత్ జగారం అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మిగతా వారు ఆ దిశగా అడుగులు వేశారు. ఇలా ప్రస్తుతం ఈ తండాలో 230 మంది ఓటర్లు ఉంటే, అందులో 120 మంది ప్రభుత్వ, మరో 70 మంది ప్రైవేటు ఉద్యోగాలను సాధించారు. మిగతా వారు వ్యవసాయం, వ్యాపారాలు చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఒక్కో ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంకా కొందరు పదవీ విరమణ పొందారు.
జిల్లా స్థాయి అధికారి నుంచి నాలుగో తరగతి ఉద్యోగి వరకు వివిధ హోదాల్లో తండా వారు పని చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఈ ఉద్యోగులంతా, ఏటా దసరా, ఇతర పండగల సందర్భాల్లో గ్రామానికి వచ్చి సందడిగా గడుపుతారు. పల్లె అనగానే వ్యవసాయమే గుర్తొచ్చే ఈ పరిస్థితుల్లో, ఈ ఊరు మాత్రం కొలువుల పల్లెగా కీర్తి గడించి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతోంది.
గుడుంబా నుంచి ప్రభుత్వ ఉద్యోగాల వైపు : మరోవైపు ఒకప్పుడు గుడుంబా తయారీతో పోలీసులు నిత్యం దాడులు నిర్వహించిన ఆ తండాల్లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల పంట పండుతోంది. రామగుండం నగరపాలక పరిధి యైంటింక్లయిన్ కాలనీలో 19వ డివిజన్లోని రాజీవ్నగర్తండాలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ 2010కి ముందు వరకు గుడుంబా తయారీకి అడ్డాగా ఉండేది. అక్కడ 206 కుటుంబాలు జీవనం సాగిస్తూ, దాదాపు 1100 మంది ఉన్నారు. 2007లో తండా నుంచి మొట్టమొదటగా రిజర్వ్ ఎస్సైగా రాజునాయక్ తొలి ప్రభుత్వ ఉద్యోగం సాధించగా, 2015లో రాజ్‌కుమార్ జాదవ్ ప్రభుత్వ వైద్యుడు అయ్యారు.
అప్పటి నుంచి ఆ తండా ముఖచిత్రమే మారిపోయింది. ప్రస్తుతం ఈ తండాలో ఐదుగురు వైద్యులు, ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు ఇంజినీర్లు, పోలీసు శాఖలో 8 మంది, ఆర్టీసీ ఉద్యోగులు, రైల్వేలో ఇద్దరు, బ్యాంకులో ఒకరు, సింగరేణిలో 28 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ తండాలో విశ్రాంత ఉద్యోగులు 80 నుంచి 100 లోపు ఉంటారు.
రూ.50వేల పెట్టుబడితో పుట్టగొడుగుల సాగు- ఏటా రూ.7 కోట్ల రాబడి- యువ రైతు సక్సెస్ స్టోరీ!
డిగ్రీతో కొలువుల పంట - కాస్త శ్రద్ధగా చదివితే భవిష్యత్తు బంగారు మయం!

